ప్రమాద అంచుల్లో యునెస్కో గుర్తింపు ఉన్న దేవాలయం

వెంకటాపురం మండలం లోని రామప్ప దేవాలయం ఈస్ట్ రోడ్డు, గొల్లాల గుడిని సోమవారం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సందర్శించారు.

Update: 2024-09-24 03:12 GMT

దిశ, ములుగు ప్రతినిధి: వెంకటాపురం మండలం లోని రామప్ప దేవాలయం ఈస్ట్ రోడ్డు, గొల్లాల గుడిని సోమవారం ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రామప్ప దేవాలయం ఈస్ట్ రోడ్డు అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, ఏరియా మ్యాపింగ్ సర్వే చేసి, బౌండ్రి పిల్లర్ ఫిక్స్ చేయాలని, కెనాల్‌కు సంబంధించిన ఏరియా సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గొల్లాల గుడిని సందర్శించి గుడి పైకప్పు, దెబ్బతిన్న శిఖరం పరిశీలించారు. దేవాలయం పూర్తి వివరాలు పురావస్తు శాఖ అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ధ్వంసమైన శిల్పం, పువ్వు అన్ని డాక్యుమెంట్లు చేయాలని, రాత్రి సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని పురావస్తు శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పురావస్తు శాఖ అధికారి మల్లేశం, ఇరిగేషన్ డీఈ రవీందర్, తహసీల్దార్ సదానందం, ఎంపీడీఓ రాజు ఉన్నారు.

రక్షణ కల్పించడంలో విఫలమైన అధికారులు..

వారసత్వ సంపదను పరిరక్షించడంలో సంబంధిత అధికారులు విఫలమైనట్లు గొల్లాల గుడి లోపల గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టడం ఉదాహరణగా నిలుస్తోంది. ఈ సంఘటనతో పురావస్తు శాఖ అధికారులు దేవాలయానికి రక్షణ కల్పించడంలో విఫలమైనట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. యునెస్కో గుర్తింపు పొందిన ప్రముఖ శైవ క్షేత్రం గా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి రక్షణ కల్పించవలసిన బాధ్యత పురావస్తు శాఖ అధికారులపై ఉన్నా ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. అధికారుల నిర్లక్ష్యంతో గుప్త నిధుల తవ్వకాలు జరిగాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. గుడికి రక్షణ కల్పించే విషయంలో సెక్యూరిటీ సిబ్బందిని కేటాయించక పోవడం, కనీసం గుడి చుట్టూ సీసీ కెమెరాలు అమర్చకపోవడంతో ఉప ఆలయాలకు ఇలాంటి దుస్థితి నెలకొందని జిల్లా ప్రజల అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రామప్పను పరిరక్షించే క్రమంలో తీసుకోవాల్సిన రక్షణ చర్యలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


Similar News