వెళ్లేవారెవరు? ఫస్టు లిస్టు తర్వాత అసంతృప్తిపై KCR ఫోకస్!

రెండు రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టును పార్టీ అధినేత కేసీఆర్ రిలీజ్ చేశారు.

Update: 2023-08-23 01:53 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రెండు రోజుల క్రితం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టును పార్టీ అధినేత కేసీఆర్ రిలీజ్ చేశారు. ఇందులో చాలా మంది ఆశావహులకు చోటు దక్కలేదు. దీంతో వారంతా అసంతృప్తిని వెల్లగక్కుతున్నారు. మరి కొందరు పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. దీంతో అసంతృప్తులు ఎవరు? పార్టీ మారుతున్నది ఎవరు అనే విషయంపై గులాబీ బాస్ ఫోకస్ పెట్టారు. అన్ని జిల్లాల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నవారు, ఏండ్లుగా పార్టీలో కొనసాగుతున్న వారికి టికెట్ దక్కకపోవడంతో వారంతా అసంతృప్తితో ఉన్నట్టు టాక్. వారిలో చాలా మంది తమ కేడర్‌తో ప్రత్యేక భేటీలు నిర్వహించి భవిష్యత్ కార్యచరణను రూపొందించుకుంటున్నారు. తర్వాత ఏం చేద్దాం? ఏ పార్టీలోకి వెళ్దాం అనే విషయాలపై చర్చలు జరుపుతున్నారు.

ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌కు టికెట్ దక్కకపోవడంతో ఆమె భర్త శ్యాంనాయక్ ఇప్పటికే కాంగ్రెస్ గూటికి చేరారు. ఆమె సైతం హస్తం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్టు టాక్. ఇప్పటికే కాంగ్రెస్ తరఫున టికెట్ కోసం గాంధీభవన్‌లో దరఖాస్తు కూడా చేసుకున్నారని తెలిసింది. ఇక మరో వైపు నకిరేకల్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సైతం పార్టీ కేడర్‌తో భేటీ అయ్యారు. ఆయన సైతం కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం ఊపందుకుంది.

పెద్దపల్లి నుంచి టికెట్ ఆశించిన నల్ల మనోహర్‌రెడ్డి బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. నర్సంపేట నుంచి పోటీ చేయాలని భావించిన ఉద్యమనేత, డాక్టర్ మదన్ కుమార్‌.. టికెట్ దక్కకపోవడంతో పార్టీకి రిజైన్ చేశారు. టికెట్ దక్కకపోవడంతో మధిరకు చెందిన బొమ్మెర రామ్మూర్తి.. ఆ నియోజకవర్గ కేంద్రంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్కను గెలిపించేందుకే తనకు టికెట్ కేటాయించలేదని, డమ్మి అభ్యర్థికి అవకాశం కల్పించారని ఆరోపించారు. ఎల్బీనగర్ టికెట్ ఆశించి భంగపడిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రామ్మోహన్ గౌడ్ మంగళవారం కేడర్‌తో భేటీ అయ్యారు.

అంబర్‌పేట టికెట్ కాలేరు వెంకటేశ్‌కు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి ఎడ్ల సుధాకర్ రెడ్డి తన కేడర్‌తో సమావేశమయ్యారు. పటాన్‌చెరు టికెట్ నీలం మధుకు దక్కకపోవడంతో ఆయన అనుచరులతో భారీ ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. శేరిలింగంపల్లి టికెట్ ఆశించిన పార్టీ రాష్ట్ర నాయకుడు బండి రమేష్ సైతం అమెరికా పర్యటన ముగించుకొని కేటీఆర్ వచ్చిన తర్వాత తెల్చుకుంటానని, భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తానని తన కేడర్ కు స్పష్టం చేశారు.

బోరున విలపించిన రాజయ్య

స్టేషన్ ఘన్‌పూర్ టికెట్ కేటాయించకపోవడంతో ఎమ్మెల్యే రాజయ్య తన కేడర్ ఎదుట బోరున విలపించారు. అంబేడ్కర్ విగ్రహం ఎదుట బోర్లాపడుకోవడం చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే ఆయన పార్టీ మారే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. కొత్తగూడెం టికెట్ ఆశించిన జలగం వెంకట్రావ్ సైతం పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఇక నర్సాపూర్ నియోజకవర్గం పెండింగ్ ఉన్నది. ప్రస్తుతం అక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న మధన్ రెడ్డి.. టికెట్ దక్కకుంటే కాంగ్రెస్‌లోకి వెళ్లే ఆలోచనలో ఉన్నారని టాక్.

ఖమ్మంపై స్పెషల్ ఫోకస్

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభావం ఎక్కువగా ఉండటంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగరేయాలని ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. పొంగులేటి వెంట వెళ్లిన తెల్లం వెంకట్రావ్‌ను బీఆర్ఎస్‌లో చేర్చుకుని ఆయనకు భద్రాచలం టికెట్ కేటాయించారు. పాలేరు నుంచి పోటీ చేయాలని భావించిన తుమ్మల నాగేశ్వర్ రావుకు టికెట్ ఇవ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డికే తిరిగి అవకాశం ఇవ్వడంతో తుమ్మల అసంతృప్తికి గురయ్యారు. తన అనుచరులతో మంగళవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అయితే ఇప్పటికే కాంగ్రెస్ నుంచి టికెట్ ఇస్తామని ఆయనకు ఆఫర్ వచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. ఈ విషయంపై రెండు, మూడు రోజుల్లో ఆయన క్లారిటీ ఇచ్చే చాన్స్ ఉన్నది. ఈ పరిణామాలను చక్కదిద్దేందుకు కేసీఆర్ ప్రయత్నాలు సైతం చేస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవి ఇస్తామని ఇప్పటికే గులాబీ బాస్ ఆయనకు హామీ ఇచ్చినట్టు టాక్.

మల్కాజ్‌గిరిపైనా దృష్టి

మల్కాజ్‌గిరి నియోజకవర్గంపైనా అధినేత దృష్టిసారించారు. మంత్రి హరీశ్ రావుపై సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్నారు. ఆయనకు ఉద్వాసన పలికేందుకు అధిష్టానం సిద్ధమవుతున్నట్టు టాక్. ఆ స్థానాన్ని ఎవరికి కేటాయించాలనే విషయంపై సమాలోచనలు జరుగుతున్నట్టు తెలిసింది. ఈ టికెట్ కోసం ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మాజీ ఎమ్మెల్యే కనకారెడ్డి కోడలు విజయశాంతితో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మర్రి రాజశేఖర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ మేతే శ్రీలతశోభన్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. కేసీఆర్‌కు సన్నిహితంగా ఉన్న నేతలతో మంతనాలు చేస్తున్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..