ఐఏఎస్‌ల బదిలీ ఎప్పుడు?
ఐఏఎస్‌ల బదిలీల్లో ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నది.
దిశ, తెలంగాణ బ్యూరో: ఐఏఎస్‌ల బదిలీల్లో ప్రభుత్వం నాన్చుడు ధోరణిని అవలంబిస్తున్నది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అనుకూలంగా ఉండే పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ బాధ్యతలను అప్పగించినట్టు ప్రచారం జరుగుతున్నది. మెజార్టీ జిల్లాల ఎస్పీలు నాన్ ఐపీఎస్‌లకు ఇచ్చినట్టు టాక్. ఐపీఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్ ముగియడంతో ఐఏఎస్‌ల బదిలీలు ఎప్పుడనే టాక్ మొదలైంది. చాలా కాలంగా ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయని, లిస్టు కూడా ఫైనల్ అయ్యిందనే ప్రచారం జరిగింది. కానీ.. ఇంతవరకూ ఐఏఎస్‌ల బదిలీలకు మోక్షం కలగలేదు. గతేడాది మునుగోడు బై ఎలక్షన్ తర్వాత బదిలీలకు కసరత్తు జరిగింది.
కాగా, ఓటరు లిస్టు పూర్తయ్యే వరకు కలెక్టర్ల బదిలీలు చేయకూడదని ఎన్నికల సంఘం చెప్పడంతో పుల్‌స్టాప్ పడింది. జనవరి ఫస్ట్ వీక్‌లో ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్‌కు రెడీ అవుతున్న టైమ్‌లో సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్‌ను ఏపీకి వెళ్లాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో మళ్లీ బ్రేక్ పడింది. కొత్తగా వచ్చిన సీఎస్ శాంతికుమారికి ఆఫీసర్ల పనితీరుపై క్లారిటీ రాలేదని తెలుస్తోంది. ఏ అధికారి ఎలా పనిచేస్తున్నారో ఇప్పుడిప్పుడే తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఐఏఎస్‌ల బదిలీల్లో శాంతి కుమారి ఎఫెక్ట్ ఉంటుందని ప్రచారం జరుగుతున్నది. మరోవైపు బడ్జెట్ సమావేశాలు ఉండటంతో ఐఏఎస్‌ల ట్రాన్స్‌ఫర్స్ ప్రస్తుతం ఉండవని సెక్రటేరియట్ వర్గాలు భావిస్తున్నాయి.