Minister Seethakka: రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యం
రైతన్నకు రుణ విముక్తి, తెలంగాణ ప్రగతికి నాంది అని రుణమాఫీ సందర్భంగా మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షలోపు పంటరుణాలను మాఫీ చేసింది.
దిశ, వెబ్ డెస్క్: రైతన్నకు రుణ విముక్తి, తెలంగాణ ప్రగతికి నాంది అని రుణమాఫీ సందర్భంగా మంత్రి సీతక్క వ్యాఖ్యానించారు. ఈ రోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ. లక్షలోపు పంటరుణాలను మాఫీ చేసింది. వ్యవసాయ శాఖ రుణమాఫీ నిధులు విడుదల కాగా.. నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. ఈ రుణమాఫీ పై మంత్రి సీతక్క ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులో.. రాష్ట్రంలో రైతు రాజ్యం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికే సాధ్యం అన్నారు. పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేనిది కాంగ్రెస్ ప్రభుత్వం నెలన్నర రోజుల్లోనే చేసి చూపించిందని అన్నారు. రూ. లక్ష లోపు రుణమాఫీ అయిన సందర్భంగా రైతు లోకానికి శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు సీతక్క ప్రకటించారు.
కర్షకుల కష్టసుఖాలు తెలిసిన రైతు ప్రభుత్వం మాది. అందుకే వరంగల్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి సమక్షంలో రైతులకు ఇచ్చిన రుణ మాఫీ హమిని నిలబెట్టుకున్నాం. దేశచరిత్రలో కనీవిని ఎరుగని విధంగా అన్నదాతలకు ఏక కాలంలో రూ. రెండు లక్షల వరకు పంట రుణాల మాఫీ చేసుకుంటున్న శుభసందర్భం ఇది. లక్షలాది మంది రైతుల ఖాతాల్లోకి ఇప్పటికే రూ. లక్ష జమ కావడంతో వారంతా రుణ విముక్తులయ్యారు. యావత్ తెలంగాణ రైతాంగం రుణ మాఫీ పండగ చేసుకుంటోందని సీతక్క అన్నారు.