లక్డీకపూల్‌లో విత్తన ధ్రువీకరణ అధికారుల ఆత్మీయ సమ్మేళనం

తెలంగాణ విత్తన ధృవీకరణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం లక్డీకపూల్‌లో నిర్వహించారు.

Update: 2024-11-24 12:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ విత్తన ధృవీకరణ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం లక్డీకపూల్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ వి. లచ్చిరెడ్డి, వ్యవసాయ అధికారుల సంఘం నాయకులు, వివిధ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణ విత్తన రంగ అభివృద్ధిలో విత్తన ధ్రువీకరణ అధికారుల పాత్ర, ఉద్యోగుల సమస్యలు, ఇతరత్రా బెనిఫిట్స్ పైన ప్రత్యేకంగా చర్చించారు. ముఖ్య అతిథిగా హాజరైన లచ్చి రెడ్డి మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడంలో విత్తన ధ్రువీకరణ అధికారుల పాత్ర కీలకమని, వారి బెనిఫిట్స్ గురించి తప్పనిసరిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

అలాగే విత్తన ధృవీకరణ ఉద్యోగులు కూడా మేము ఏర్పాటు చేసిన జేఏసీలో భాగస్వామ్యం అవటం అభినందనీయమని అన్నారు. విత్తన ధ్రువీకరణ ఉద్యోగులకు ఏ సమస్యలు వచ్చినా జేఏసీ అండగా ఉంటుందని ఈ సందర్భంగా లచ్చి రెడ్డి హామీ ఇచ్చారు. విత్తన ధ్రువీకరణ అధికారులు కూడా ఒక ఉన్నతమైన పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉద్యోగంలో చేరారని, ఇలాంటి సంస్థ అభివృద్ధి విషయంలో ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకోవాలని లచ్చిరెడ్డి అభిప్రాయపడ్డారు. విత్తన ధ్రువీకరణ సంస్థను కూడా వ్యవసాయ సహకార శాఖ కింద ఒక ప్రత్యేక విభాగం కింద ప్రభుత్వం పరిగణించి, ఒక డిపార్ట్మెంట్ హోదా కల్పించి రైతులకు నాణ్యమైన విత్తనాలు పకడ్బందీగా సరఫరా అదేవిధంగా చూడాలని చైర్మన్ లచ్చిరెడ్డి అన్నారు. ఉద్యోగుల సంక్షేమమే మా జేఏసీకి ప్రధాన ధ్యేయమని, ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ జనరేషన్ సోర్స్ గా పనిచేయాలని లచ్చిరెడ్డి కోరారు.

ఇతర రాష్ట్రాల్లో విత్తన ధ్రువీకరణ సంస్థల పనితీరు అధ్యయనం చేసి, పక్కన ఉన్న తమిళనాడు రాష్ట్రం మాదిరిగా విత్తన ధృవీకరణ సంస్థను డిపార్ట్మెంట్ స్టేటస్ క్రింద పరిగణించాలని, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ తిరుపతి నాయక్ తెలిపారు. అనంతరం విత్తన ధ్రువీకరణ ఉద్యోగుల వార్షిక సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మరో మూడు సంవత్సరాలకు అసోసియేషన్ కమిటీని ఎన్నుకున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళన సమావేశంలో పెబ్బేటి మహేష్, జనరల్ సెక్రటరీ, తెలంగాణ విత్తన ధ్రువీరకరణ అధికారుల అసోసియేషన్, టి. జయ ప్రకాష్, ప్రెసిడెంట్, తెలంగాణ విత్తన ధ్రువీకరణ అధికారుల అసోసియేషన్ వి. పృథ్వీరాజ్, ట్రెజరర్, తెలంగాణ విత్తన ధ్రువీకరణ అధికారుల అసోసియేషన్, అలాగే తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థకు చెందిన హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, గద్వాల్ డివిజన్ కు చెందిన విత్తన ధ్రువీకరణ అధికారులు, ఇతర కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఉద్యోగులు హాజరయ్యారు.


Similar News