అన్ని పంటలకూ గిట్టుబాటు ధర కల్పిస్తాం: మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

గత ప్రభుత్వ హయాంలో కేవలం ఒకటి లేదా రెండు పంటలకు మాత్రమే గిట్టుబాటు ధర కల్పించేవారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు పండించే అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విదంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు.

Update: 2024-02-20 15:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గత ప్రభుత్వ హయాంలో కేవలం ఒకటి లేదా రెండు పంటలకు మాత్రమే గిట్టుబాటు ధర కల్పించేవారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులు పండించే అన్ని పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విదంగా చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు వెల్లడించారు. మంగళవారం ఆయన వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితో కేవలం ఒకటి లేదా రెండు పంటల కొనుగోళ్లు చేసి మిగతా పంటలకు గిట్టుబాటు ధర కల్పించే విషయములో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు.

ఆ కారణంగా రాష్ట్రంలో 75 శాతం సాగు విస్తీర్ణం రెండు, మూడు పంటల క్రిందకు వచ్చిందని తెలిపారు. ఈ పరిస్థితిని నివారించి అన్ని పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా తగిన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో పసుపు బోర్డు ఏర్పాటు, సీఐఐ సెంటర్ల కొనసాగింపుకు విజ్ఞప్తి చేశామని అన్నారు. పంట వేసిన రోజు నుంచి ఆ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసుకునేంత వరకు రాష్ట్ర ప్రభుత్వము ప్రతి విషయములో రైతులకు అండగా ఉంటుందని అన్నారు. ప్రస్తుతం మార్కెట్లకు పోటెత్తుతున్న మిర్చి పంట అమ్మకాల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు, ధర విషయంలో తేడా రాకుండా పకడ్బందీ చర్యలు చేపట్టమని తెలిపారు. ఇందుకోసం మార్కెటింగ్ శాఖకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. రాష్ట్ర స్థాయిలో జోనల్ స్థాయిలో పని చేసే సంబంధిత అధికారులను అమ్మకాలు ఎక్కువగా జరిగే మార్కెట్లకు పర్యవేక్షకులుగా నియమించి ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకునే ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు.

ఈ సీజన్‌లో రాష్ట్రంలో 3.91 లక్షల వేల ఎకరాలలో మిర్చి సాగుచేయగా ఇప్పటికే 94,395.08 మెట్రిక్ టన్నుల మిర్చి మార్కెట్‌కు వచ్చిందని తెలిపారు. రానున్న రోజుల్లో 3,37,014 మెట్రిక్ టన్నులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు. మార్కెటింగ్ శాఖ జిల్లా అధికారులు, మార్కెట్ కమిటీ కార్యదర్శులు ఎటువంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా, మిర్చితో పాటు వేరుశనగ అమ్మకాల్లో అమ్మకాలు సజావుగా సాగేందుకు అన్నీ చర్యలు చేపట్టాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకొంటామని మంత్రి హెచ్చరించారు.

రాష్ట్రంలో ఈ యాసంగిలో దాదాపు 2 లక్షల ఎకరాలలో వేరుశనగ సాగు కాగా 1.92 లక్షల మెట్రిక్ టన్నులు దిగుబడి రాగలదని అంచనా వేశామని మంత్ర తుమ్మల తెలిపారు. ఇప్పటికే 93 వేల మెట్రిక్ టన్నులు అమ్మకానికి రాగా, సొంత అవసరాలకు పోను ఇంకా మార్కెట్లకు 46 వేల టన్నుల వేరుశనగ వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు సంబంధిత జిల్లా అధికారులు‌తో మిర్చి, వేరుశనగ అధికంగా పండించే జిల్లాలను సందర్శించాలని సూచించారు. రైతులందరికీ మార్కెట్లకు ఉత్పత్తులను తీసుకొచ్చే విషయములో అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు.

Tags:    

Similar News