SLBC Rescue Operation : రెండు రోజుల్లో SLBC రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేస్తాం : ఉత్తమ్ కుమార్ రెడ్డి
ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్(SLBC Tunnel Rescue Operation) పై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు.
దిశ, వెబ్ డెస్క్ : ఎస్ఎల్బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్(SLBC Tunnel Rescue Operation) పై నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttham Kumar Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు. టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ పై ప్రభుత్వం మరిన్ని కీలక చర్యలు తీసుకుంటున్నట్టు మీడియాకు తెలియజేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మరో రెండు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తి చేసి, కార్మికులను బయటికి తీసుకువస్తామని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ టన్నెల్ ప్రమాదాలు జరిగినా పాల్గొనే నిపుణులను, సరిహద్దుల్లో టన్నెల్స్ నిర్మించే ఎక్స్ పర్ట్స్ ను సహాయ చర్యల కోసం పిలిపిస్తున్నామని తెలిపారు. అవసరమైతే విదేశాల్లో ఉన్న టన్నెల్ నిపుణుల సహాయం తీసుకునేందుకు సిద్ధమయ్యామని ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. గ్యాస్ కట్టర్ తో దెబ్బతిన్న టీబీఎంను వేరు చేసి, పూడికలోకి రెస్క్యూ టీం వెళ్లేందుకు సమాయత్తం అవుతోందని అన్నారు. భారీగా నిలిచిపోయిన నీరు, బురదను తొలగిస్తే.. పూర్తిగా లోపలికి వెళ్లగలం అని వెల్లడించారు. టన్నెల్ లో చిక్కుకున్న వారిని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యం అని, రాజకీయ లబ్ది పొందేవారి గురించి తాము పట్టించుకోమని ఆయన తెలియజేశారు.