ఇసుక మాఫియాకు అడ్డుకట్టేది..? రాష్ట్ర సరిహద్దులో జోరుగా రవాణా

తెలంగాణ- కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో ఉన్న మాగనూరు, కృష్ణ మండలాలలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది.

Update: 2025-03-17 02:46 GMT
ఇసుక మాఫియాకు అడ్డుకట్టేది..? రాష్ట్ర సరిహద్దులో జోరుగా రవాణా
  • whatsapp icon

దిశ, మాగనూరు: తెలంగాణ- కర్ణాటక రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో ఉన్న మాగనూరు, కృష్ణ మండలాలలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది. కృష్ణానది తీరం వెంబడి ఉన్న నాణ్యమైన ఇసుకను తరలిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా ఇసుక మాఫియా కాసుల వేటలో పరుగులు పెడుతుంది. ఇసుక మాఫియాకు అధికారులు, అధికార పార్టీ నాయకుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. మీడియాలో వరుస కథనాలు వచ్చిన సందర్భంలో మాత్రమే అధికారులు కొన్ని రోజుల పాటు ఇసుక రవాణా జరగకుండా అడ్డుకుంటున్నారే తప్ప శాశ్వతంగా అడ్డుకట్ట వేయడం లేదు. ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి స్థానిక అధికారులు ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు అందజేస్తూ చేతులు దులుపుకుంటున్నారు. మరోవైపు ప్రభుత్వానికి ఆదాయం సమకూరేలా ఆన్ లైన్ లో ఇసుక కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నా అవి కొన్ని రోజులకే పరిమితం అవుతున్నాయి. అక్రమ ఇసుక తరలింపునకే ప్రాధాన్యత ఉంటుంది. ఇక్కడి నుంచి ఇసుక హైదరాబాద్, మహబూబ్ నగర్, గద్వాల, కర్ణాటక రాష్ట్రంలోని రైచూరు, యాదగిరి తదితర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు. చెక్ పోస్టుల వద్ద తనిఖీలు కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో ఇసుక మాఫియా కు అడ్డూ, అదుపు లేకుండా పోతుంది.

పగలంతా ప్రశాంతం.. రాత్రి అయితే..

ఇసుక మాఫియా అక్రమంగా ఇసుకను తరలించేందుకు రాత్రి సమయాన్ని ఎంచుకుంటున్నారు. ప్రత్యేకించి సెలవు రోజులలో అధికారులు తనిఖీలు చేసే అవకాశాలు లేకపోవడంతో ఉన్న కొంతమంది అధికారులు, పోలీసులతో ఇసుక మాఫియా కుమ్మక్కై దర్జాగా ఇసుకను తరలిస్తున్నారు.

అడుగంటుతున్నా భూగర్భ జలాలు

కృష్ణానదిలో ఇష్టానుసారంగా తోడేస్తుండడంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. ఇసుక మాఫియాతో పోలీసులు, రెవెన్యూ అధికారులు కుమ్మక్కుకావడంతోనే జోరుగా ఇసుక అక్రమంగా తరలిపోతుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నేతలు కూడా ఇసుక మాఫియాకు సహకరిస్తుండంతో రెవెన్యూ, పోలీసులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి భూగర్భ జలాల మట్టం తగ్గకుండా చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ పనులకు అవసరమైతే ఆన్ లైన్ ద్వారా ఇసుక రవాణాకు కట్టుదిట్టంగా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.


Similar News