ఎండుతున్న నర్సరీలు.. నీరు లేక వట్టిపోతున్న మొక్కలు
జిల్లాలో అడవుల శాతం చాలా తక్కువ. అందుకే పర్యావరణం దెబ్బతినడం, వర్షాలు రాకపోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.

నల్లగొండ జిల్లాలో నర్సరీల్లో మొక్కల పెంపకంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొక్కల పెంపకం ఆవశ్యకతను గుర్తించి పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో కొంతమంది అధికారులు స్వార్థంతో ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతుంది. గత పదేళ్లకుపైగా నర్సరీల్లో మొక్కలు పెంచుతుండగా ప్రస్తుతం మాత్రం నర్సరీల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారినట్లు తెలుస్తోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1770 గ్రామపంచాయతీలు ఉండగా నల్లగొండలో 856, సూర్యాపేటలో 486, యాదాద్రి భువనగిరి జిల్లాలో 428 ఉన్నాయి. నర్సరీల నిర్వహణకు ఉమ్మడి జిల్లాలో రూ.20కోట్లు వినియోగిస్తుండగా కేవలం నల్గొండ జిల్లాలోని దాదాపు రూ.10కోట్లకుపైగా నిధులు వెచ్చిస్తున్నట్లు సమాచారం. అయితే ఒక నర్సరీలో 3వేల నుంచి 5వేల మొక్కలను మాత్రమే పెంచాలని స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. అయితే అందుకు భిన్నంగా నల్లగొండ జిల్లాలో మాత్రం ఒక్కో నర్సరీలో 10వేల నుంచి 30వేల మొక్కల వరకు పెంచుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఉపాధి హామీ పథకంలో ఉన్న ఓ కీలక అధికారికి సంబంధించిన వ్యక్తికి పాలిథిన్ కవర్ల తయారీ కంపెనీ ఉందని, అతడి వద్ద సుమారు కోటికిపైగా పాలిథిన్ కవర్లను కొనుగోలు చేయడం కోసమే క్షేత్రస్థాయిలో సిబ్బందిపై ఒత్తిడి తెచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.
దిశ, నల్లగొండ బ్యూరో : జిల్లాలో అడవుల శాతం చాలా తక్కువ. అందుకే పర్యావరణం దెబ్బతినడం, వర్షాలు రాకపోవడం వంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో వాటి నుంచి బయట పడేందుకు జిల్లాలో పెద్దఎత్తున చెట్లు పెంచాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వాలు గుర్తించాయి. ఆ కోణంలోనే ఉపాధి హామీ పథకంలో భాగంగా నర్సరీలలో మొక్కలు పెంచి గ్రామాల్లో వాటిని నాటించేందుకు చర్యలు చేపడుతున్నారు. గత పదేళ్లకుపైగా ఈ కార్యక్రమం చేపడుతున్నా ప్రస్తుతం మాత్రం నర్సరీల పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది.
ఉమ్మడి జిల్లాలో నర్సరీలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 1770 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో నల్లగొండలో 856, సూర్యాపేటలో 486, యాదాద్రి భువనగిరి జిల్లాలో 428 ఉన్నాయి. ఉపాధి హామి పథకంలో భాగంగా నర్సరీలను మొత్తం గ్రామాల్లో ఏర్పాటు చేశారు. అయితే వాస్తవంగా ప్రతి గ్రామానికి ఒక నర్సరీ ఏర్పాటు చేసి 3వేల నుంచి 5వేల మొక్కలను మాత్రమే పెంచాలని స్పష్టమైన ప్రభుత్వ ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. ఇదే క్రమంలో యాదాద్రిభువనగిరి, సూర్యాపేట జిల్లాలోని నర్సరీలలో మొక్కల పెంపకం జరుగుతుంది. కానీ, నల్లగొండ జిల్లాలో ఉన్న నర్సీలల్లో 10వేల నుంచి 30వేల మొక్కల వరకు పెంచుతున్నారు.
ఎండుతున్న నర్సరీలు..
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సుమారు కోటి యాభై లక్షల పైగా మొక్కలను నర్సరీల ద్వారా పెంచుతున్నారు. అందులో సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో 50లక్షలకు పైగా మాత్రమే మొక్కలు పెంచుతుండగా నల్లగొండ జిల్లాలో కోటికి పైగా పెంచుతున్నారు. ఈ మొక్కల పెంపకానికి సుమారు రూ.20కోట్లు వినియోగిస్తున్నారని సమాచారం. అయితే వాస్తవంగా నర్సరీల ఏర్పాటు అనేది నవంబర్, డిసెంబర్ నెలల నుంచి ప్రారంభం కావాలి. జూన్ వరకు గ్రామాల్లో నాటాల్సి ఉంటుంది. కానీ జనవరి, ఫిబ్రవరిలో మొదలుపెట్టారు. అయితే నర్సరీలలో అవసరమైన నీటిని అందించలేకపోతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏ నర్సరీలో కూడా పూర్తిస్థాయిలో మొక్కలు పెరగకుండా ప్యాకెట్‌లోనే విత్తనం మాడిపోయినట్టు తెలుస్తుంది. గ్రామపంచాయతీ, ఎంపీడీవోలను కలిసి నీటి వసతి కల్పించాలని రిక్వెస్ట్ చేసినా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. గ్రామాల్లో తాగునీరుకే ఇబ్బందిగా ఉంది. ఇక నర్సరీలకు నీళ్లు అందించడం సాధ్యం కాదని కరాకండిగా చెప్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో క్షేత్రస్థాయిలో పనిచేసే ఫీల్డ్ ఆఫీసర్లకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. ఈ మొత్తం మొక్కలకు ఉమ్మడి జిల్లాలో రూ.20కోట్లు వినియోగిస్తుండగా కేవలం నల్గొండ జిల్లాలోని దాదాపు రూ.10కోట్లకుపైగా నిధులు వెచ్చిస్తున్నట్లు సమాచారం.
అధిక మొక్కలు పాలిథీన్ కవర్ల కోసమేనా?
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ 3వేల నుంచి 5వేల మొక్కలను మాత్రమే నర్సరీల్లో పెంచాలని ఉపాధి హామీ అధికారులు ఆదేశించారు. నల్లగొండ జిల్లాలో మాత్రమే 10వేల నుంచి 30వేల వరకు ఒక్కొక్క నర్సరీలో పెంచాలని జిల్లా అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్లపై ఒత్తిడి చేసి మరి ఏర్పాటు చేయించినట్లు సమాచారం. మొక్కలు అధికంగా పెంచడానికి ఓ బలమైన కారణం ఉందన్నట్టు వినికిడి. ఉపాధి హామీ పథకంలో ఉన్న కీలక అధికారికి సంబంధించిన ఓ వ్యక్తికి పాలిథిన్ కవర్ల తయారీ కంపెనీ ఉందని తెలుస్తుంది. కాగా, నర్సరీల పెంపకానికి అవసరమైన సుమారు కోటికిపైగా పాలిథిన్ కవర్లను కొనుగోలు చేయడం కోసమే పెద్దఎత్తున మొక్కల పెంపకం చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందిపై ఒత్తిడి తెచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంటే తనకు కావాల్సిన వ్యక్తులకు వ్యాపారం జరగడం కోసం ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం అయినా పర్వాలేదనే ఆలోచనతో ఆ అధికారి ఉన్నట్లు సమాచారం. ఉన్నతాధికారులు స్పందించి దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు.