అప్పు పట్టు..ఐపీ పెట్టు.. కోదాడలో నయా ట్రెండ్

చిట్టీల పేరుతో, జనం నుంచి డబ్బులు వసూలు చేయడం..

Update: 2025-03-19 01:51 GMT
అప్పు పట్టు..ఐపీ పెట్టు.. కోదాడలో నయా ట్రెండ్
  • whatsapp icon

దిశ, కోదాడ: చిట్టీల పేరుతో, జనం నుంచి డబ్బులు వసూలు చేయడం.. విచ్చల విడిగా అప్పులు చేయడం.. ఇలా సేకరించిన సొమ్ముతో ఆస్తుల కొనుగోలు, వ్యాపారాలు చేయడం.. అదను చూసి 'ఐపీ' పెట్టేసి భాగస్వాములు, ప్రజల నెత్తిన టోపీ పెట్టేయడం.. ఇలాంటి ఘటనలు కోదాడ లో తరచూ వెలుగు చూస్తున్నాయి. రాజ్యాంగం కల్పించిన 'రక్షణ'.. కొందరికి ఆయుధంగా మారింది. భాగస్వాములు, జనాల నమ్మకమే పెట్టుబడిగా భారీగా కూడబెట్టుకొని, ఆ తర్వాత దివాళా తీశామని కోర్టు తలుపు తట్టడం షరా మామూలుగానే మారింది.

ఐపీ అంటేనే వణుకు...

ఐపీ.. ఈ పదం వింటేనే కోదాడ వ్యాపారుల్లో ఇప్పుడు వణుకు పుడుతోంది. చిట్టీలు వేసిన వారి గుండెల్లో దడ పుట్టిస్తోంది. చిన్నా చితకా పొదుపు చేసిన సొమ్మును ఫైనాన్స్ లో చిట్టీలు, పెట్టుబడుల రూపంలో పెట్టిన వారిలో కలకలం రేపుతోంది. దివాళా పేరిట టోకరా వేస్తూ కోర్టు నుంచి ఐపీ నోటీసులు పంపుతుండడంతో మార్కెట్లో తీవ్ర అయోమయం, గందరగోళం నెలకొంది. గత రెండేళ్ల కాలంలో కోదాడ పట్టణంతో పాటు మండలాల్లో ఐపీ బాట పట్టి, నమ్మిన వారికి సుమారు రూ. కోట్ల మేర కుచ్చుటోపీ పెట్టారు. పట్టణంలోని వ్యాపారస్తులు, స్కూల్ నిర్వాహకులు, ఫైనాన్స్ నడిపే వారు, తమ హోదా ను ఉపయోగించి కోట్ల రూపాయలు ఐపీ బాట పట్టారు.

ఇటీవల కోదాడ రూరల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి కొంతమందికి మాయమాటలు చెప్పి దాదాపు రూ.1.40 కోట్లకు పైగా అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. ఏళ్లు గడుస్తున్నా తీసుకున్న రుణం చెల్లించకపోవడంతో బాధితులు అతడిని ఒత్తిడికి గురి చేశారు. దీంతో కుటుంబ సభ్యులను తీసుకుని వ్యాపారి పరారీ అవుతుండగా ఏపీ లోని ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు వద్ద పట్టుకుని కోదాడలోని ఓ వ్యక్తి వద్దకు తీసుకొచ్చారు. మాట్లాడుతున్న సమయంలో వ్యాపారి అక్కడి నుంచి పరారయ్యాడు. మంచి వ్యక్తిగా గుర్తింపు పొందినందుకే అప్పులు ఇచ్చామని, మోసం చేస్తాడని అనుకోలేదని బాధితులు వాపోయారు. ఆ వ్యాపారి కూడా ఐపీ పెట్టాడు.

కేవలం పట్టణానికి మాత్రమే పరిమితమైన ఈ ఐపీ తంతంగం గ్రామీణ ప్రాంతాలకు కూడా విస్తరించింది. అనంతగిరి మండలానికి సంబంధించి ఓ గ్రామానికి చెందిన వ్యక్తి సైతం సుమారు రూ.20 లక్షల వరకు ఐపీ పెట్టి జారుకున్నాడు. ఇది మరువక ముందే పట్టణంలో పద్మావతి మీసేవ సమీపంలో ఓ పాన్ డబ్బా నడుపుతున్న వ్యక్తి నాలుగు కోట్లకుఐపీ పెట్టినట్లు సమాచారం. గత 20 ఏళ్లుగా దుకాణం నడిపించడంతో పాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండడంతో అందరూ నమ్మారు. ఇదే క్రమంలో రూ. లక్షల్లో చిట్టీలు నడిపే స్థాయికి వెళ్లాడు. వ్యాపారం రూ.4 కోట్ల వరకు చేరడంతో ఇటీవల పాట పాడి డబ్బులు ఇస్తానని చెప్పి పలువురికి ఇవ్వలేదు. అతడు అందు బాటులో లేకపోవడంతో బాధితులు లబోదిబోమంటున్నారు.

కొందరు చిట్టీ పాట పాడి ఆ డబ్బులు సదరు వ్యక్తికే వడ్డీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. పాన్ డబ్బా దుకాణం సమీపంలోని కొందరు దుకాణదారులు రూ.10 లక్షల వరకు ఇవ్వాలని చెబుతున్నారు.నమ్మకంగా ఉంటూ చివరికి ఇలా చేశాడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాధితులు అంతా కలిసి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు సన్నద్ధమైనట్లు సమాచారం.

ఐపీ అంటే...

ఐపీ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్. వ్యాపారంలో నష్టాలు వచ్చినపుడు రుణ గ్రహీతలను రక్షించడానికి తయారు చేసిన చట్టమిది. నష్టాల బారిన పడిన వ్యకి తాను దివాళా తీసినట్టు ప్రకటించమని కోర్టును ఆశ్రయించి, తనకున్న అప్పులు, ఆస్తుల జాబితాను సమర్పించి, నష్టాలకు కారణాలను వివరించి కోర్టు నుంచి రక్షణ పొందే వెసులుబాటు ఈ చట్టం కల్పిస్తోంది. అయితే, ఈ రక్షణ ప్రస్తుతం మోసగాళ్లకు వరంగా మారింది. ఐపీని అస్త్రంగా చేసుకుని 'కొందరు’ నమ్మిన వారికి టోపీ పెడుతున్నారు. అయితే, ఈ చట్టం అప్పులు తీసుకున్న వారికే కాదు, ఇచ్చిన వారికి సైతం రక్షణ కల్పిస్తుంది. రుణ గ్రహీత నుంచి తమకు రావాల్సిన రొక్కం ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కోర్టును ఆశ్రయించి సదరు వ్యక్తిని దివాళాకోరుగా ప్రకటించమనే అవకాశం చట్టం కల్పిస్తోంది. దివాలా పిటిషన్ దాఖలా చేసిన వ్యక్తి ఆస్తులను, అప్పులను ఇతర సాక్ష్యాలను పరిశీలించిన అనంతరం కోర్టు సదరు వ్యక్తి దివాళా తీసినటు ప్రకటిస్తుంది. అయితే, దివాళా పిటిషన్లు దాఖలవుతున్నప్పటికీ ,కోర్టు విచారణ పూర్తయి దివాలా తీసినట్టు ప్రకటించిన కేసులు చాలా తక్కువ...

ఎందుకు పెడుతున్నారు..?

చిట్టీలు, ఫైనాన్స్ రూపంలో రూ.కోట్లు వసూలు చేస్తున్న వ్యాపారులు కొందరు ఇష్టారీతిన డబ్బును సొంత అవసరాలకు వాడుకుంటున్నారు. మరికొందరు 'రియల్' వ్యాపారంలో పెట్టి బురిడీ కొడుతుంటే, ఇంకొందరేమో ఆస్తులను కూడబెట్టుకొంటున్నారు. ఇంకొందరు అధిక వడ్డీలు చెల్లించడం ద్వారా నష్టపోతున్నారు. అయితే, నష్టాలను కప్పిపెడుతూ నమ్మిన వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సమకూర్చుకుంటున్నారు. చివరకు ఆస్తులను ఇతరుల పేరిట మార్చడం, అమ్ముకోవడం ద్వారా వచ్చిన సొమ్మును దాచుకుని ఐపీ బాట పడుతున్నారు. అయితే, ఈ పిటిషన్లు దాఖలయినప్పుడు కోర్టుకు వచ్చి న్యాయ పోరాటం చేసే వ్యాపారులు తక్కువగా ఉండడంతో వంచకుల ఆటలు సాగుతున్నాయి. కొందరు నమ్మిన వారికి టోపీ పెట్టడానికి ముందస్తు ప్రణాళికతో ఐపీ ఎత్తుగడలు వేస్తున్నారు. అయితే, బడా వ్యాపారులు ఐపీ జాబితాలో ఉన్నప్పుడు వారి వ్యాపార ప్రయోజనాల దృష్ట్యా లోలోపల సెటిల్మెంట్లు చేసుకుని, చిన్న పెట్టుబడిదారులను నిండా ముంచుతున్నారు.

Similar News