నారాయణ గురు స్ఫూర్తిని మనందరం కొనసాగించాలి: డిప్యూటీ సీఎం భట్టి
నారాయణ గురు స్ఫూర్తిని మనందరం కొనసాగించాలని, మానవ జాతికి ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అదే మానవత్వం, సమానత్వమని గొప్ప సందేశాన్ని ఇచ్చిన వ్యక్తి నారాయణ గురు అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
దిశ, తెలంగాణ బ్యూరో: నారాయణ గురు స్ఫూర్తిని మనందరం కొనసాగించాలని, మానవ జాతికి ఒకే కులం, ఒకే మతం, ఒకే దేవుడు అదే మానవత్వం, సమానత్వమని గొప్ప సందేశాన్ని ఇచ్చిన వ్యక్తి నారాయణ గురు అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం కేరళ రాష్ట్రంలోని కొల్లాంలోని నారాయణ గురు ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నారాయణ గురు ఇంటర్నేషనల్ లిటరసీ, కల్చరల్ ఫెస్టివల్ కు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానికంగా నిర్వహించిన సెమినార్ లో డిప్యూటీ సీఎం ప్రసంగించారు. కేరళ తో పాటు.. యావత్ భారత దేశాన్ని ప్రభావితం చేసిన నారాయణ గురు స్ఫూర్తి తో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వే, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్మాణం లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.
నారాయణ గురు జీవితాన్ని, బోధనలను స్మరించుకునేందుకు కొల్లాం చేరుకుకోవడం జీవితంలో లభించిన గొప్ప గౌరవమని డిప్యూటీ సీఎం అన్నారు. నారాయణ గురు ఒక ఆధ్యాత్మిక నాయకుడికి మించిన గొప్ప సంస్కరణ వాది, తత్వవేత్త, విప్లవకారుడని అభివర్ణించారు. అరువిప్పురం శివాలయం స్థాపన సాధారణమైన ఆధ్యాత్మిక చర్య కాదని కుల వివక్షకు వ్యతిరేకంగా ఒక సాహసోపేతమైన ప్రకటనగా డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. ఈ ఘటన ఒక్క కేరళ రాష్ట్రాన్నే కాకుండా యావత్ భారత దేశాన్ని ప్రభావితం చేసిందని వివరించారు. నారాయణ గురును స్మరించుకునే సందర్భంలో మహానేత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను స్మరించుకోవడం సముచితంగా ఉంటుందన్నారు. నారాయణ గురు సమాజంలోని మార్పును స్ఫూర్తి పరిస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ద్వారా సమానత్వాన్ని స్థిరపరిచారని తెలిపారు.
విద్యనే విముక్తికి మార్గమని కేరళను విద్యావంతమైన, ఆరోగ్యకరమైన, లింగ సమానత్వం కలిగిన ఒక రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో నారాయణ గురు పాత్ర ఎనలేనిదిగా పేర్కొన్నారు. తెలంగాణ, కేరళ రాష్ట్రాల మధ్య ఆలోచనల్లో సారూప్యత ఉందన్నారు. తెలంగాణలో కొమురం భీం, చాకలి ఐలమ్మ, నారాయణ గురు తరహాలోనే సమానత్వం కోసం తిరుగుబాటు చేశారని వివరించారు. ప్రస్తుత పరిస్థితుల్లో సామాజిక, ఆర్థిక సవాళ్లను దీటుగా ఎదుర్కోవాలని డిప్యూటీ సీఎం అన్నారు. మన కర్తవ్యం నారాయణ గురు వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, ప్రతి ఒక్కరూ న్యాయంగా గౌరవంగా జీవించే సమాజాన్ని నిర్మించడంలో కీలకపాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. ఇదే మనం ఆయనకు ఇచ్చే గొప్ప గౌరవమని అన్నారు.