రాజకీయ లబ్ధి కోసం రెచ్చగొడితే ఊరుకోం: డిప్యూటీ సీఎం భట్టి
రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొడితే ప్రజా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: రాజకీయ లబ్ధి కోసం ప్రజలను రెచ్చగొడితే ప్రజా ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో జరిగిన ఆరోగ్య ఉత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ..ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వానికి విద్య-వైద్యం రెండు కళ్ళు లాంటివని, అందుకే వీటికి అత్యధికంగా నిధులు కేటాయించామన్నారు. అయితే బీజేపీ, బీఆర్ఎస్‌లు ప్రజలను రెచ్చగొట్టి అందులోంచి కొంత సానుభూతి పొంది, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలని కుట్రలు చేస్తున్నాయన్నారు. రాష్ట్రంలోని బడుగు బలహీన పేద మధ్య తరగతి ప్రజల వైద్య అవసరాలు తీర్చడం కోసం ప్రజా ప్రభుత్వం కావాల్సిన నిధులను విడుదల చేస్తుంటే, బురదజల్లే ప్రయత్నం చేస్తుందన్నారు. పది సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలకులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాలను, ఆరోగ్య శ్రీ గురించి పట్టించుకోలేదన్నారు.
డాక్టర్లు, నర్సింగ్ స్టాఫ్ రిక్రూట్మెంట్, సిబ్బంది నియామకాన్ని విస్మరించారన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన బీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు ప్రజా ప్రభుత్వాన్ని విస్మరించడం దారుణమన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం ప్రజలు కూడా సహకరించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యక్తిగతంగా ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. ఫుడ్ సేఫ్టీ కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రభుత్వం తరపున ఐవీఎఫ్ కేంద్రాలు ప్రారంభించడం గొప్ప విషయం అన్నారు. ప్రతిపక్షాలు విమర్శలు బంద్ చేసి, సలహాలు, సూచనలు ఇస్తే బెటర్ అంటూ వెల్లడించారు.