ప్రైవేట్ హాస్పిటళ్లు కేంద్రం నిబంధనలకు ప్రకారమే వైద్యం అందించాలి: మంత్రి రాజనర్సింహా
ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటే సహించేది లేదని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా హెచ్చరించారు.
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రైవేట్ ఆసుపత్రులు ప్రజలను దోచుకుంటే సహించేది లేదని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా హెచ్చరించారు. సోమవారం ఆయన ఆరోగ్య ఉత్సవ సభతో పాటు సెక్రటేరియట్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యారోగ్యశాఖ అంశాలపై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం చట్టాల ప్రకారం ప్రైవేటు ఆసుపత్రులు వైద్యం అందించాలన్నారు. చట్ట ప్రకారం అన్ని పర్మిషన్లు తప్పనిసరి అన్నారు. అధిక బిల్లులతో పేదలను సతాయిస్తే ప్రజా ప్రభుత్వం ఊరుకోదని సూచించారు. పేదలకు వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేద వర్గాల పక్షంగానే నిలుస్తుందన్నారు.
ప్రజలు అనారోగ్యంతో అప్పుల పాలు కాకూడదనే లక్ష్యంతో ముందుకు పోతున్నామన్నారు. విద్య, వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ , ఫీజు రీయింబర్స్‌మెంట్ తెచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఆరు గ్యారంటీలలో ఆరోగ్యశ్రీ కూడా ఒకటి అని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే ఆ గ్యారంటీని అమలు చేస్తూ, ఉచిత వైద్య పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామన్నారు. దాదాపు ఐదు వందల కోట్లతో 16 నర్సింగ్ కాలేజీలు, 28 పారామెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశామన్నారు.
పది నిమిషాల్లో అంబులెన్స్ చేరాలి..
రాష్ట్రంలో పది నిమిషాల్లో ఘటన స్థలానికి అంబులెన్స్ చేరేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతున్నదన్నారు. ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన 213 అంబులెన్స్ లతో 25 నిమిషాలుగా ఉన్న అంబులెన్స్ యావరేజ్ టైమింగ్ 13 కి రాబోతున్నాన్నారు. మరో 80 అంబులెన్స్ లను తీసుకువస్తే, సగటు టైమింగ్ పదికి చేరుతుందన్నారు. దీని వలన గోల్డెన్ అవర్ సేప్ అవుతుందన్నారు.ఇక జర్నలిస్టులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయిస్ కు నూతన పాలసీ తీసుకురాబోతున్నామన్నారు. ఉస్మానియా ఆసుపత్రి ని అత్యాధునికంగా నిర్మించబోతున్నామన్నారు. నెల రోజుల లోపే శంకుస్థాపన చేస్తామన్నారు. ఉస్మానియా, గాంధీ, కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థుల కోసం ఏళ్ల తరబడి నుంచి పెండింగ్ లో ఉన్న కొత్త హాస్టల్ బిల్డింగ్స్‌ను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. డయాలసిస్ పేషెంట్లకు అవసరమైన సర్జరీలు చేయడానికి, సుమారు రూ.33 కోట్లతో 7 వాస్క్యులర్ సెంటర్లను మంజూరు చేశామన్నారు. మాతృత్వం కోసం పరితపిస్తున్న దంపతులకు ప్రజా ప్రభుత్వం అండగా నిలిచి, గాంధీ హాస్పిటల్‌లో ఐవీఎఫ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందన్నారు.
మైత్రి క్లినిక్స్..దేశంలోనే రికార్డు..
ఆడ, మగ తీరుగానే ట్రాన్స్‌జెండర్లు కూడా మన సమాజంలో భాగమని మంత్రి చెప్పారు. వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్లకు, గౌరవప్రదమైన జీవితాన్ని అందించే దిశగా ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగస్వాములను చేస్తూ, వారికి ఉపాధి కల్పించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. హాస్పిటళ్లకు వెళ్లినప్పుడు అవమానాలకు గురవుతున్నామని ఆ సొసైటీ ఆవేదన చెందుతుందన్నారు. దీంతోనే వారికోసం ప్రత్యేకంగా మైత్రి క్లినిక్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఉస్మానియా హాస్పిటల్‌లో ఇప్పటికే క్లినిక్ అందుబాటులో ఉండగా, మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఒక్కో క్లినిక్ చొప్పున 32 క్లినిక్స్‌ను తాజాగా ప్రారంభించామన్నారు. వీటిల్లో డాక్టర్లు, నర్సులు, కౌన్సెలర్లు అందుబాటులో ఉండి, ట్రాన్స్‌జెండర్లకు వైద్య సేవలు అందిస్తారన్నారు.
ప్రతి జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్..
ఇక 50 పడకలు ఆసుపత్రి ఉంటే ఏం ప్యానెల్ చేసుకోవచ్చని మంత్రి చెప్పారు. దీంతో జిల్లాలో కనీసం 4, 5 ఆసుపత్రులు ఆరోగ్య శ్రీ చికిత్స పరిధిలోకి వస్తాయన్నారు. ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ఎంత ఉన్నా, హెచ్ ఆర్ లేనిది నిరూపయోగమే అన్నారు. దీంతో రిక్రూట్ మెంట్లను వేగవంతం చేశామన్నారు. తెలంగాణ నర్సింగ్ విభాగానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్నదని, జపాన్, జర్మనీ, ఆస్ట్రేలియా, కెనడా, వంటి దేశాల్లో డిమాండ్ ఉన్నదన్నారు. ఎన్ సీడీపై అవగాహన కల్పిస్తామన్నారు. ప్రత్యేకంగా క్యాన్సర్, డయాబెటిస్, హైపర్ టెన్షన్, హార్ట్ స్ట్రోక్స్ పై విస్తృతంగా ప్రచారం చేస్తామన్నారు. ప్రతి జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ వెహికల్ ను ఏర్పాటు చేబోతున్నామన్నారు. వీటికి అనుసంధానంగా నాలుగు క్యాన్సర్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు.
90 శాతం జిల్లాలోనే జరగాలి..
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జిల్లా హాస్పిటళ్లలోనే 90 శాతం వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సూపర్ స్పెషలిటీ వైద్యం నిమిత్తం మాత్రమే టీచింగ్ ఆసుపత్రులను ఆశ్రయించే పరిస్థితి రావాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నదన్నారు. ఇందుకోసం సబ్ సెంటర్ల నుంచి ఏరియా ఆసుపత్రుల సంఖ్యను పెంచబోతున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా మరో 300 సబ్ సెంటర్లు, 125 ఏరియా ఆసుపత్రులను పెంచుతున్నామన్నారు. పాపులేషన్ ఒకటే క్రైటీరియా కాకుండా దూరాన్ని కూడా లెక్కిస్తామన్నారు. వాటికనుగుణంగా ఆసుపత్రులను ఎస్టాబ్లిష్ చేస్తామన్నారు. మందుల కొరత లేకుండా ప్రతి జిల్లాలో సెంట్రల్ డ్రగ్ స్టోర్ ను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో పేషెంట్ క్లైంట్, కస్టమర్ అనే తరహాలో డాక్టర్లు గుర్తు పెట్టుకొని వైద్య అందించాలని కోరారు.