నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రారంభించేందుకే కమిటీ వేశాం : మంత్రి శ్రీధర్ బాబు

బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించడమే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ చైర్మన్, మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు.

Update: 2024-02-24 12:15 GMT

దిశ, బోధన్ : బోధన్ నిజాం షుగర్ ఫ్యాక్టరీని పునః ప్రారంభించడమే లక్ష్యంగా కమిటీ పనిచేస్తుందని బోధన్ షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ చైర్మన్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిజాం షుగర్స్ పునరుద్ధరణ కమిటీ చైర్మన్ హోదాలో కమిటీతో కలిసి శనివారం బోధన్‌కు వచ్చిన మంత్రి శ్రీధర్ బాబు మొదటగా కర్మాగారాన్ని పరిశీలించి ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం రైతులు, కార్మికులు ఇతర వర్గాల ప్రజలతో మాట్లాడి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించారు.

అనంతరం మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లో ఇచ్చిన హామీ మేరకు నిజాం షుగర్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమిటీ వేశారని, ఈ కమిటీ పనిని ప్రారంభించిందని తెలిపారు. తమ ప్రభుత్వానికి ప్రజల సంక్షేమం అభివృద్ధి ముఖ్యమన్నారు. ప్రజా సంక్షేమాన్ని వ్యతిరేకించే వారి పట్ల తాము కఠినంగా వ్యవహరిస్తామని, అభివృద్ధిని కాంక్షించే వారిని ఆదరిస్తామన్నారు. నిజాం షుగర్స్ కర్మాగారాన్ని ప్రారంభించడమే లక్ష్యమని, కర్మాగారాన్ని ప్రారంభించడం రైతులు చెరుకు పంట వేయడం రెండు ఒకేసారి జరగాలని కోరారు. నిజాం షుగర్స్ కర్మాగారంపై కాంగ్రెస్ స్పష్టతతో ఉందని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసి వెళ్లిందని తాము ప్రణాళిక ప్రకారం పనులను చేస్తూ ముందుకు వెళ్తున్నామన్నారు.

నిపుణుల ఆలోచనలను పరిగణలోకి తీసుకుంటామని వారితో చర్చిస్తామని లేకపోతే కాళేశ్వరానికి పట్టిన గతి పడుతుందన్నారు. కర్మాగారాన్ని ప్రభుత్వం నడపడం, ప్రైవేట్‌కు అప్పగించడం, సహకార రంగంలో నడపడం అనేది ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఫ్యాక్టరీ ఆస్తులు మొత్తం బ్యాంకు గ్యారంటీలలో ఉన్నాయని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందన్నారు. కర్మాగారం ప్రారంభించాక నష్టాలు రాకుండా చూసేందుకు దిగుబడులు పెంచాలని నాణ్యమైన విత్తనాలను తీసుకుని రావాలనే అంశంపై వ్యవసాయ నిపుణులతో చర్చిస్తామన్నారు. రైతుబంధు పై ఆలోచన చేస్తున్నామన్నారు.

కార్యక్రమంలో ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేష్ రంజన్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ మన్సూర్, ఎమ్మెల్యే భూపతిరెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మాజీ ఎమ్మెల్యేలు ఈరవత్రి అనిల్, ఏనుగు రవీందర్ రెడ్డి, అరికల నరసారెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మావతి శరత్ రెడ్డి, జెడ్పి వైస్ చైర్మన్ రజిత యాదవ్, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు


Similar News