మంత్రి సీతక్క, కొండా సురేఖలపై బీఆర్ఎస్ అమర్యాదగా ఉంటుంది: మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో చురుకైన మంత్రులుగా పనిచేస్తున్న తెలంగాణ ఆడపడుచులు గిరిజన, బీసీ బిడ్డలు సీతక్క, కొండా సురేఖ పై బీఆర్ఎస్ నేతలు అమర్యాదగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు.

Update: 2024-10-09 17:28 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : సీఎం రేవంత్ రెడ్డి మంత్రి వర్గంలో చురుకైన మంత్రులుగా పనిచేస్తున్న తెలంగాణ ఆడపడుచులు గిరిజన, బీసీ బిడ్డలు సీతక్క, కొండా సురేఖ పై బీఆర్ఎస్ నేతలు అమర్యాదగా వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత రవీంద్ర నాయక్ బుధవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. గిరిజన, బీసీ బిడ్డలని వారిని చులకనగా చూడటంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పొంతనలేని విషయాలపై బీఆర్ఎస్ నేతలు ఆ ఆడబిడ్డలపై నిస్సిగ్గుగా ట్రోల్స్ చేయడాన్ని రవీంద్ర నాయక్ ఖండించారు. గతంలో కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నప్పుడే, ఆయన బలహీన నాయకత్వంలో కేంద్ర నిఘా సంస్థల వైఫల్యం, నిరాసక్తతవల్ల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, అలాగే దేశ భద్రతకు సంబంధించిన డాక్యుమెంట్ల తస్కరణ, అనేక సంఘ వ్యతిరేక కార్యక్రమాలు జరిగేవని ఆయన పేర్కొన్నారు.

మరీ ముఖ్యంగా గతంలో కొంతమంది రాజకీయ నాయకులు.., సినిమా, ఇతర రంగాల ముఖ్యుల భార్యాభర్తల మధ్య సంభాషణలను సైతం వింటూ బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డారని రవీంద్ర నాయక్ చెప్పారు. కొండా సురేఖ ఫోన్ ట్యాపింగులో బహిర్గతమైన విషయాలే తప్ప కొత్త విషయాలేమీ చెప్పలేదన్నారు. కానీ కొంతమంది ఫోన్ ట్యాపింగ్ తో సంబంధమున్న బీఆర్ఎస్ రాజకీయ నాయకులు కావాలని కొంతమందిని ఉసిగొల్పి, ఒక బీసీ మంత్రి పై పరువు నష్టం దావా వేయించడం దారుణమని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తేల్చి దోషులను కఠినంగా శిక్షించాలని రవీంద్ర నాయక్ డిమాండ్ చేశారు.


Similar News