దివ్యాంగుల కార్పొరేషన్ అవినీతి జరిగితే విచారణకు ఆదేశించండి: వాసుదేవ రెడ్డి

కాంగ్రెస్ అంటేనే స్కాం అని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కె.వాసుదేవ రెడ్డి మండిపడ్డారు.

Update: 2024-10-09 15:55 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ అంటేనే స్కాం అని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కె.వాసుదేవ రెడ్డి మండిపడ్డారు. పది సంవత్సరాల్లో దివ్యాంగుల కార్పొరేషన్ కు కేటాయించిందే 63 కోట్లు అని, వంద కోట్ల అవినీతి జరిగిందని అవివేకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్ లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య నాపై మాజీ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ ల పై నిరాధారమైన ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నానన్నారు. గ్యారంటీలు అమలు చేసే శక్తి లేక కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మీద పడి ఏడుస్తున్నారని దుయ్యబట్టారు. దివ్యాంగుల స్కీం లకు కేసీఆర్ పాలనలో ఆన్ లైన్ లో పూర్తి పారదర్శకత తో లబ్ధి దారుల ఎంపిక జరిగిందన్నారు. పరికరాల కొనుగోలు ఆన్ లైన్ పద్ధతిలో జరిగిందని వెల్లడించారు.

అవినీతి జరిగితే విచారణకు ఆదేశించండి ఎవరు వద్దన్నారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తొలి టర్మ్ లో తుమ్మల నాగేశ్వర్ రావు దివ్యాంగుల శాఖ మంత్రిగా ఉన్నారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ మంత్రిగా ఉన్నారని ..ఆయన కూడా అవినీతి చేశారా ? అని నిలదీశారు. దివ్యాంగుల కోసం కాంగ్రెస్ మేనిఫెస్టో లో ఎన్నో హామీలు ఇచ్చారని, వాటి అమలు పై దృష్టి పెట్టాలని సూచించారు. సీఎం రేవంత్ లాగే కాంగ్రెస్ కింది స్థాయి నాయకులు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. దివ్యాంగులకు ఆరు వేల పెన్షన్ ఏమైంది? అని నిలదీశారు. కేసీఆర్ పాలనలో పథకాల పారదర్శకతకు కొత్త సాఫ్ట్ వేర్ తెచ్చామని వెల్లడించారు. దివ్యాంగుల చైర్మన్ కు దేని పై అవగాహన లేదని, అవగాహన పెంచుకుని మాట్లాడాలని హితవు పలికారు. దివ్యాంగులకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలు కోసం త్వరలోనే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. దివ్యాంగుల సంక్షేమం కోసం మా పోరాటం ఆగదు అని స్పష్టం చేశారు. ఈ చైర్మన్ కు చేతనైతే ప్రతి జిల్లాలో దివ్యాంగుల కార్యాలయం ఏర్పాటు చేసి సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.


Similar News