హైదరాబాద్ ప్రజలకు శుభవార్త.. పచ్చజెండా ఊపిన రాష్ట్ర ప్రభుత్వం
మెట్రోపాలిటన్ సిటీ అయిన హైదరాబాద్‌కు జలమండలి తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ సేవలు అందిస్తోంది.
దిశ, సిటీబ్యూరో: మెట్రోపాలిటన్ సిటీ అయిన హైదరాబాద్‌కు జలమండలి తాగునీటి సరఫరా, మురుగు నీటి నిర్వహణ సేవలు అందిస్తోంది. ఔటర్ చుట్టూ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలు, గ్రామపంచాయతీలు, ఇతర స్థానిక సంస్థలకు సైతం తాగునీరు సరఫరా చేస్తోంది. ఇంతటి సేవా పరిధి కలిగిన జలమండలి గోదావరి రెండో దశ ప్రాజెక్టుతో నగరవాసులకు తాగునీటి కష్టాలను తీర్చడానికి చర్యలు చేపట్టింది. ఈ ఏడాదిలో మేజర్ ప్రాజెక్టు ఇదే. నగరంలో 100శాతం మురుగుశుద్ధే లక్ష్యంగా జలమండలి ముందుకుపోవాలని నిర్ణయించింది.
గోదావరి ప్రాజెక్టు రెండో దశ పనులు..
రాష్ట్ర ప్రభుత్వం గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-2కు పచ్చజెండా ఊపింది. ఈ పథకం ద్వారా నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం అదనపు జలాలను తరలించడంతో పాటు, హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర జలాశయాలను పునరుజ్జీవం చేయనుంది. ప్రస్తుతం 560 ఎంజీడీల నీరు సరఫరా చేస్తుండగా 2030వ సంవత్సరం వరకు హైదరాబాద్ నగర తాగునీటి డిమాండ్ 867 ఎంజీడీలకు పెరుగుతుంది. 2050 నాటికి ఈ సంఖ్య 1114 ఎంజీడీలుగా ఉండనుంది. గోదావరి డ్రికింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్-1 కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలమండలి ఇప్పటికే 10 టీఎంసీల నీరు తరలిస్తోంది. తాజాగా పథకం రెండో దశ ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో 15 టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది. మూసీ ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాలను పునరుజ్జీవనం చేసేందుకు 5 టీఎంసీలను ఉపయోగించనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా పంప్ హౌజ్‌లు, సబ్ స్టేషన్లు, నీటి శుద్ధి కేంద్రాలు, భారీ పైపు లైన్ నిర్మించనున్నారు. రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ -1 ద్వారా 163 ఎంజీడీల నీరు సరఫరా చేస్తున్నారు.
100 శాతం మురుగు శుద్ధి లక్ష్యం..
హైదరాబాద్ నగరంలో ఉత్పన్నమయ్యే మురుగు నీటిని 100 శాతం శుద్ధి చేసే దిశగా జలమండలి అడుగులు వేస్తోంది. ఇందుకోసం పలు చోట్లు మురుగు నీటి శుద్ధి కేంద్రాలు (ఎస్టీపీలు) నిర్మిస్తోంది. హైదరాబాద్ అర్బన్ ఆగ్లోమెరేషన్ పరిధిలో ప్రస్తుతం రోజూ 1950 ఎంఎల్డీల మురుగు నీరు ఉత్పన్నమవుతోంది. ఇది జీహెచ్ఎంసీ ప్రాంతంలో 1650 ఎంఎల్డీలుగా ఉంది. ఇప్పటికే 25 ఎస్టీపీల ద్వారా 772 ఎంఎల్డీల మురుగు నీటిని (46 శాతం) శుద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే అధికం. మిగిలిన 878 ఎంఎల్డీల మురుగు నీటిని శుభ్రం చేయడానికి రూ.3866.41 కోట్ల వ్యయంతో కొత్తగా 1106 సామర్ధ్యంతో ఎస్టీపీల ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. 2036 సంవత్సరం వరకు రాబోయే కాలంలో ఉత్పన్నమయ్యే మురుగును వీటి ద్వారా శుద్ధి చేస్తారు. ఇందులో భాగంగా ఇప్పటికే 11 ఎస్టీపీలు ప్రారంభమై మురుగు నీటిని శుద్ధి చేస్తున్నాయి. వీటిలో కోకాపేట్ (15 ఎంఎల్డీలు), దుర్గం చెరువు (7 ఎంఎల్డీలు), నల్లచెరువు (86.50 ఎంఎల్డీలు), పెద్దచెరువు 17.50 ఎంఎల్డీలు), మియాపూర్ పటేల్ చెరువు (7 ఎంఎల్డీలు), ఖాజాకుంట (20 ఎంఎల్డీలు), ఫతేనగర్-1 (133 ఎంఎల్డీలు) నాగోల్(320ఎంఎల్డీలు), సఫిల్ గూడ(5.5ఎంఎల్డీలు) 1 ఎస్టీపీ ఉంది. కాగా 443 ఎంఎల్డీల సామర్థ్యం కలిగిన మరో 9 ఎస్టీపీలు నిర్మాణం చివరి దశలో ఉన్నాయి. వీటిని త్వరలోనే ప్రారంభిస్తారు. ఇవే కాకుండా అమృత్- 2.0 మూడో దశ కింద మరో 39 ఎస్టీపీల నిర్మాణానికి ప్రతిపాదించడం జరిగింది. అలాగే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌లల్లో మురుగు చేరకుండా మరో నాలుగు నిర్మాణం చేయనున్నారు.
90 రోజుల ప్రత్యేక కార్యాచరణ..
ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా జలమండలి 90 రోజుల ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. దీర్ఘకాలికంగా ఉన్న సీవరేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంతో పాటు భవిష్యత్తులో నీటి కరువు రాకుండా ఇంకుడు గుంతల నిర్మించుకునేలా చర్యలు చేపట్టింది. ఇందులో ప్రధానంగా సీవరేజీ పైపులైన్లు, మ్యాన్ హోళ్లలో పేరుకుపోయిన సిల్ట్ తొలగించారు. మురుగు నీటి ప్రవాహం సాఫీగా సాగేందుకు, సిల్ట్ ఛాంబర్లు నిర్మించుకోవాలని జలమండలి విస్తృత అవగాహన కల్పిస్తోంది.
వందేళ్ల గండిపేట్ కాండూట్‌కు మరమ్మతులు..
హైదరాబాద్ నగరంలో గండిపేట్ కాండూట్‌ను పదేళ్లుగా వేధిస్తున్న లీకేజీ సమస్యకు జలమండలి అడ్డుకట్ట వేసింది. ఈ కాండూట్‌కి గండిపేట్, కోకాపేట్, మణికొండ, సీబీఐటీ కాళాశాల, పుప్పాలగూడ, జానకీనగర్, కౌసర్ కాలనీ, ఎంఈఎస్ క్యాంపస్ తదితర ప్రాంతాల్లో లీకేజీలు ఏర్పడ్డాయి. నీటి సరఫరాకు ఆటంకం కాకుండా చెన్నైకి సంబంధించిన కంపెనీ జర్మన్ టెక్నాలజీతో లీకేజీలు అరికడతామని ముందుకొచ్చి అధికారులు కెమికట్ ట్రీట్‌మెంట్ పద్ధతిని ఉపయోగించి మరమ్మతులు పనులు చేపట్టింది.
వేసవిలో నీటి సరఫరా..
వేసవిలో ప్రజలకు తాగునీటికి ఇబ్బందులు రావొద్దని, ప్రధాన వనరులైన నాగార్జున సాగర్, ఎల్లంపల్లి ప్రాజెక్టుల్లో ఎమర్జెన్సీ పంపింగ్ ప్రారంభించింది. ఇప్పటికే ఉన్న ట్యాంకర్లు, డ్రైవర్లు, ఫిల్లింగ్ స్టేషన్లు, పాయింట్లు పెంచి రోజూ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసింది. జలమండలి పరిధిలో దాదాపు 733కి పైగా ట్యాంకర్లు, 78 ఫిల్లింగ్ స్టేషన్లు ఉండగా, ఈ ఏడాది జనవరి 1 నుంచి మొత్తం ఇవాళ్టి వరకు 16,43,660 ట్యాంకర్ ట్రిప్పులను డెలివరీ చేశారు.
పరిష్కార మార్గంగా..
భూగర్భ జలాలు స్థాయిని పెంచేందుకు వినియోగదారుల ప్రాంగణాల్లో ఇంకుడు గుంతలు నిర్మించుకునేందుకు తగిన సాంకేతిక సాయం అందించింది. ఇంకుడు గుంతలు లేని వినియోగదారులకు నోటీసులు జారీ చేసింది. 40 వేల క్యాన్ నంబర్ల వినియోగదారులు ఈ వేసవిలో తరచూ ట్యాంకర్లు బుక్ చేసినట్లు గుర్తించారు. వీరికి ఇంకుడు గుంతలు లేనట్లు గుర్తించారు. 300 చదరపు మీటర్లు ఆపై విస్తీర్ణం ఉండి ఇంకుడు గుంతలు లేని వినియోగదారులు ఇక నుంచి ట్యాంకర్ బుక్ చేసుకుంటే రెట్టింపు ఛార్జీలు వసూలు చేయనున్నారు.
కంటోన్మెంట్ బోర్డుకు అదనపు నీటి సరఫరా..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న నీరు కాకుండా అదనంగా 1 ఎంజీడీని పెంచింది. అక్కడున్న 40 వేల నల్లా కనెక్షన్లకు 5.9 ఎంజీడీల నీరు సరఫరా చేస్తుండగా.. అవి సరిపోవడం లేదని ఎమ్మెల్యే శ్రీగణేష్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సీఎం ఆదేశాలతో ఎండీ అశోక్ రెడ్డి ఎమ్మెల్యేతో సమావేశమై చర్చించి నిర్ణయం తీసుకున్నారు.
తమిళనాడు అధికారుల పర్యటన..
చెన్నై వాటర్ బోర్డు ఎండీ డాక్టర్ టీజీ వినయ్ సారథ్యంలో సూపరింటెండింగ్ ఇంజినీర్ శివ కుమార్, ఏరియా ఇంజినీర్ విజయ్ కుమార్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మాధవి, అసిస్టెంట్ ఇంజినీర్ శివ శంకరి తదితరులు 8 మంది ప్రతినిధులతో కూడిన బృందం జలమండలి సేవలు, అవలంబిస్తున్న పద్ధతులు, సాంకేతిక వినియోగం, చేపట్టిన సంస్కరణలు, రెవెన్యూ అంశాల గురించి అధ్యయనం చేశారు.
ట్రైనీ ఐఏఎస్‌ల పర్యటన..
తెలంగాణ రాష్ట్రానికి కేటాయించిన ట్రైనీ ఐఏఎస్ బృందం జలమండలిని సందర్శించింది. ఒకరోజు ఒరియెంటేషన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో భాగంగా వారు బోర్డు పనితీరు, నగరానికి నీటి సరఫరా, ఎస్టీపీలు, మురుగు శుద్ధి నిర్వహణతో పాటు భవిష్యత్తు ప్రణాళికలు, ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నారు.
కారుణ్య నియామకాలు..
జలమండలిలో ఈ ఏడాది మొత్తం 25 మందికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు లభించాయి. సర్వీసు పిరియడ్‌లో మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించారు. జనవరిలో-3, జూన్-3, జులై-3, సెప్టెంబర్-7, నవంబర్-5, డిసెంబర్‌లో 4 చొప్పున మొత్తం 25 మందికి ఉద్యోగాలిచ్చారు.