‘స్టూడెంట్‌ను టీచర్ తన్నాడనేది దుష్ప్రచారం’

రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములుపై దాడిని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ తీవ్రంగా ఖండించింది.

Update: 2024-12-29 15:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుక్కుగూడ గ్రామ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములుపై దాడిని తెలంగాణ కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ తీవ్రంగా ఖండించింది. ఇటీవల విద్యార్థులను టీచర్ లెక్కలు అడిగిన సందర్భంగా అప్పజెప్పనందుకు విద్యార్థిని పక్కన నిలబెడితే కొందరు కాలితో స్టూడెంట్‌ను తన్నారని సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని సీపీఎస్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర గౌరవ సలహాదారు తిరుమల రెడ్డి ఇన్నారెడ్డి, కొలిపాక వెంకట స్వామి మండిపడ్డారు. ఈ అంశంపై ప్రధానోపాధ్యాయులు రాములుపై కొందరు ప్రణాళికబద్ధంగా దాడి చేశారని, క్షమాపణ చెప్పినా వినకుండా, అక్కడున్న విద్యార్థి కాళ్లను మొక్కించారని వారు పేర్కొన్నారు. ఇది అత్యంత హేయమైన చర్య అని ఫైరయ్యారు. ఈ చర్య వల్ల రాష్ట్రం లోని ప్రతి ఉపాధ్యాయుల ఆత్మ గౌరవం దెబ్బతిందన్నారు. విద్యార్థి తల్లితండ్రులు, కుటుంబసభ్యులు కాకుండా కొందరు బయట వ్యక్తులు కొట్టడం, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని భయభ్రాంతులకు గురిచేయడం చట్ట వ్యతిరేకమన్నారు. దాడికి సూత్రధారులైన నిందితులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేస్తామని తిరుమలరెడ్డి, వెంకటస్వామి హెచ్చరించారు.


Similar News