Raghunandan Rao: కేటీఆర్.. అమెరికా వెళ్లి బాత్ రూమ్ లు కడుక్కో.. రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు
కేటీఆర్ పాదయాత్రపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: భవిష్యత్తులో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) సెటైర్లు వేశారు. ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ స్పందించారు. 'తనకు రాజకీయాలు బంద్ చేయాలని ఉందని కేటీఆర్ అంటున్నారు. అలాంటప్పుడు రాజకీయాలు బంజెయ్యు. ఎవరు వద్దన్నరు. వెళ్లి అమెరికాలో బాత్ రూమ్ లు కడుక్కో. అధికారంలో ఉన్న పదేళ్లు కేటీఆర్ ప్రజలకు కలిసే సమయం దొరకలేదు. మీ నాన్న 10 నెలలుగా ఫామ్ హౌస్ లో ఉన్నారు. ఏమైనా నష్టం జరిగిందా?' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేటీఆర్ ను ఇప్పుడు పాదయాత్ర చేయాలని అడిగిందెవరని నిలదీశారు. సిరిసిల్ల ప్రజలు పాదయాత్రను అడగలేదని, సిద్దిపేట ప్రజలు అంతకంటే అడగలేదన్నారు. ఎవరి కోసం ఎందుకోసం ఈ పాదయాత్ర చెప్పాలన్నారు.
ఫామ్ హౌస్ పంచాయతీ నుంచి బయటపడేందుకే..
జన్వాడ ఫామ్ హౌస్ (Janwada Farmhouse Case) పార్టీ పంచాయతీ నుంచి బయట పడేందుకు కేటీఆర్ పాదయాత్ర అంటున్నారని రఘునందన్ రావు విమర్శించారు. ఫామ్ హౌస్ కేసులో పాలేవో, నీళ్లేవో తేలాలంటే జన్వాడ సీసీ ఫుటేజ్ బయట పెట్టాల్సిందేనన్నారు. విదేశాల్లో చదువుకున్న కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ తెలంగాణలో ఆడవాళ్లు తాగుతారని అంటున్నారు. తెలంగాణలో ఎక్కడైనా ఆడవాళ్లు తాగుతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ అసలు సిసలు నిజాలు బయటకు రావాలంటే సీసీ ఫుటేజ్ బయటకు రావాల్సిందేనన్నారు. కేటీఆర్ వచ్చింది ప్రజల కోసం కాదని ఆయన వచ్చింది డబ్బుల కోసం, అధికారం కోసం అన్నారు. ప్రతిపక్షంలో పదినెలు కూర్చుంటేనే మీకు విసుగొస్తే పదేళ్ల పాటు ప్రజలు మీ అరాచక పాలనను ఎలా భరించారని ప్రశ్నించారు. కేటీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదన్నారు. కేటీఆర్ కు తన నాన్న, చెల్లి, బావతో పాటు ఎవరిపై నమ్మకం లేదని ఆరోపించారు. కేసీఆర్ దోచుకున్న లక్షకోట్లు కక్కించి ప్రజలకు ఖర్చుచేస్తామని రాహుల్ గాంధీ చేత చెప్పించిన కాంగ్రెస్ నేతలు అధికారంలోకి వచ్చి 10 నెలలు అవుతున్నా పది రూపాయలు కక్కించలేకపోయారని విమర్శించారు. దీపావళికి బజార్లలో బాంబులు పేలాయి కానీ పొంగులేటి (Ponguleti Srinivas Reddy) చెప్పిన కుక్కతోక పటాకులు కూడా పేలలేదని ఎద్దేవా చేశారు. తప్పు చేస్తే అది ఏ పార్టీ వారినైనా చట్టప్రకారం అరెస్టులు చేయాలని డిమాండ్ చేశారు.