ఒక్క ఎకరాకు పరిహారం ఇవ్వలేదు.. ఇదేనా రైతులకు ఇచ్చే గౌరవం : Y. S. Sharmila (షర్మిలారెడ్డి)
వైఎస్సార్ టీపీ నేత షర్మిల చేపట్టిన పాదయాత్ర నర్సంపేట డివిజన్‌లో శనివారం ప్రారంభమైంది.
దిశ, నర్సంపేట: వైఎస్సార్ టీపీ నేత షర్మిల చేపట్టిన పాదయాత్ర నర్సంపేట డివిజన్‌లో శనివారం ప్రారంభమైంది. గ్రామంలో ప్రతీ ఒక్కరిని పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. ఈ నర్సంపేట నియోజకవర్గంలో అకాల వర్షాలకు 20 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు. పంట నష్టాన్ని చూసేందుకు స్వయానా వస్తున్నానని సీఎం వచ్చినట్లే చేశారని కానీ ఇటు వైపు కూడా చూడలేదని ఎద్దేవా చేశారు. నేటికి 10 నెలలు దాటినా ఒక్క ఎకరాకు పరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోకపోతే మంత్రులు ఎందుకు ఉన్నట్లని ప్రశ్నించారు. ప్రజలు చెబుతున్న సమస్యలు చూస్తే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అనే అనుమానం కలుగుతోందన్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వం అని ప్రగల్భాలు పలికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.