వీర తెలంగాణ పోరులో విప్లవాగ్ని వీణ.. వెట్టిచాకిరి విముక్తికి కథనరంగం

భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాంను

Update: 2024-09-17 02:18 GMT

దిశ,డోర్నకల్ : భూమి కోసం,భుక్తి కోసం,వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాంను తరిమి నేటికి 75 వసంతాలు గడిచాయి. వేలాది భూములను తమ గుప్పిట్లో పెట్టుకొని నిజాం రాజు, ఆయన అనుచరులు దేశ్‌ముఖ్‌లు, ఖాసీం రిజ్వీ తెలంగాణ ప్రజలను బానిసలుగా మార్చుకున్నారు. బ్రిటీష్‌ పరిపాలన నుంచి భారతదేశమంతటా స్వేచ్ఛా గీతాలు ఆలపిస్తున్నా తెలంగాణ మాత్రం నిరంకుశ నిజాం చేతుల్లోనే ఉంది. ఈ పాలనను పారదోలేందుకు పల్లెపల్లెన ప్రజా సంఘాలు నిర్మించి సాయుధ పోరాటం చేశారు.ఈ పోరాటానికి మానుకోట తాలూకా ఒకటి.

నిజాంపై మరలబడ్డ పెరుమాండ్ల సంకీస..

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో గ్రామాలన్నీ ఏకమయ్యాయి.నిజాం సైనికులు, రజాకార్లు,భూస్వాముల దురగాతాలపై పోరాడాయి.మహబూబాబాద్ జిల్లా పెరుమాండ్ల సంకీస ప్రజలు వెట్టిచాకిరి విముక్తికి కదం తొక్కారు.కమ్యూనిస్టులతో కలిసి విమోచన పోరాటంలో తుమ్మె శేషయ్య నేతృత్వంలో తిరుగుబాటు జెండా ఎగరవేశారు.


ప్రాంతీయ ఆంధ్రమహాసభ సంకీస గ్రామ పెద్ద చెరువు సమీపంలో జరిగింది. ఈ మహాసభలో మంచికంటి రామకిషన్‌, మల్లు వెంకటనర్సింహారెడ్డి, నంద్యాల శ్రీనివాసరెడ్డి లాంటి ఉద్దండులు పాల్గొని ఉద్యమ తీరుతెన్నుల గురించి విశ్లేషించుకునే సమయాన, రజాకార్లు మహాసభపై విరుచుకుపడ్డారు. అందుకు ప్రతి దాడి చేసిన ఉద్యమకారులు ఇద్దరు రజాకార్లను మట్టుబెట్టారు. మూడు సార్లు గ్రామంపై దాడి చేసి దొరికిన వారిని దొరికినట్లు చావబాదారు. అడ్డు వచ్చిన ఆడవాళ్లను హింసించి మానభంగం చేశారు.


ఉద్యమాన్ని అణచివేయాలంటే తుమ్మ శేషయ్యను అంతమొందించాలని రజాకార్లు శేషయ్య ఆచూకీ తెలపాలని 1948 సెప్టెంబర్ 1వ తేదీన 200 మంది పోలీసులతో కలిసి పెరుమాండ్ల సంకీస గ్రామంపై ముప్పేట దాడి చేశారు. దొరికిన మగవారందరిని చేతులు కట్టేసి బూటు కాళ్లతో తన్నారు. అయినా శేషయ్య జాడ కాని, దళం జాడ కానీ చూపించలేకపోయారు. ఆ కోపంతో బందెలదొడ్డి ప్రాంతంలో ఉన్న గడ్డి వాము దగ్గర కాల్పులు జరిపి, కొన ఊపిరితో ఉన్న వారితో సహా మొత్తం 21 మందిని సజీవ దహనం చేశారు.పోరాట యోధుల స్మృతి చిహ్నంగా పెరుమాండ్ల సంకీసలో స్మారక స్థూపాన్ని నిర్మించారు.ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న అమరులను స్మరించుకుంటున్నారు.

నెల్లికుదురు ఠాణా దాడి..

ఇదే జిల్లాలో నెల్లికుదురు ప్రాంతంలో నిజాం సైనికులు రజాకార్లపై కమ్యూనిస్టులు పోరాడి కీలక విజయం సాధించారు.మల్లు వెంకటనర్సింహారెడ్డి నేతృత్వంలో మరికొందరు సాయుధ దళాలు 1948 సెప్టెంబర్‌ 11న నెల్లికుదురు పోలీస్‌స్టేషన్‌పై దాడులు చేశారు. పల్లెల్లో రజాకార్ల అకృత్యాలు పెరిగిపోవడంతో జిల్లాలోని గెరిల్లా దళాలు మండల కేంద్రంలోని నెల్లికుదురు ఠాణా పై దాడి చేసి ఆయుధాలు ఎత్తుకెళ్లారు.చివరకు నిజాం సైనికులు,రజాకార్లు లొంగిపోయారు.ఆ తర్వాత 1948 సెప్టెంబర్ 17న విముక్తి లభించింది.


దేశ్‌ముఖ్‌ లపై వీరోచిత పోరాటం..

నాటి గార్ల జాగీర్దార్ కుటుంబీకులు ప్రజలను వెట్టి చాకిరి,శిస్తు వస్తులతో పీడిస్తుండడంతో పెత్తాళ్లగడ్డ వద్ద గడ్డం వెంకట్రామయ్య నాయకత్వంలో సాయుధ దాడి జరిపారు.బయ్యారం మండలం కోటగడ్డ జమీందార్‌ రంగారెడ్డి దేశ్‌ముఖ్‌పై ప్రజలు వీరోచిత పోరు నడిచింది.బండ్లకుంట గ్రామంలో నిజాం సైన్యాలతో జరిగిన హోరాహోరీ పోరులో గెరిల్లా దళాల కమాండర్లు దామినేని వెంకటేశ్వరరావు, కంచర బుచ్చి మల్లు తో పాటు బండ్ల కుంట గ్రామానికి చెందిన బీరవెల్లి లక్ష్మయ్య, కంబాల చంద్రయ్య, ఆయలబోయిన యర్రయ్య, సింగన బోయిన గంగయ్య, లింగయ్య, కారం మల్లయ్య, పాశం లచ్చయ్య, మాడె పాపయ్య, మాడె బుచ్చయ్య, తాటి బాలయ్య, మోకాళ్ల యర్రయ్య, భూక్య సక్రాం, వేములపల్లి శ్రీకృష్ణ, తాటి లక్ష్మయ్య, తాటి యల్లయ్య, పెడుగుల లక్ష్మీనర్సయ్య, కుంజ ముత్తి లింగయ్య,కారం గాదెయ్య, యేపె బాలయ్య, కుంజ జోగయ్యతో 20 మంది అమరులయ్యారు.1948లో అమరులైనా వీరి పేరిట బయ్యారం గాంధీ సెంటర్‌లో 1969లో స్మారక స్థూపాన్ని ఏర్పాటు చేసి ప్రతియేట నివాళులు ఆర్పిస్తున్నారు.


Similar News