కోచ్ ఫ్యాక్టరీ@ కాజీపేట..వ్యాగన్ పరిశ్రమకు అప్‌గ్రేడ్
ఉమ్మడి వరంగల్ జిల్లా వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది.
దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లా వాసుల చిరకాల స్వప్నం నెరవేరింది. రాష్ట్ర పునర్విభజన హామీల్లో ప్రధానమైన కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌ల తయారీకి అనుగుణంగా యూనిట్‌ను తీర్చిదిద్దాలని రైల్వే బోర్డు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ విషయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొద్దిరోజుల క్రితమే ప్రకటించినప్పటికీ ఢిల్లీలో హోం శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర విభజనహామీలపై సమీక్ష జరిగింది.
ఈ మేరకు రైల్వే కోచ్ మంజూరుపై అధికారికంగా నిర్ణయం తీసుకుంటూ రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాజీపేట వ్యాగన్ పరిశ్రమను కోచ్‌ల తయారీ యూనిట్‌గా అభివృద్ధి చేయాలని సూచించింది. కేంద్రం ఆదేశాలతో సౌత్ సెంట్రల్ రైల్వే జీఎంకు రైల్వే బోర్డు లేఖ రాయడం విశేషం. కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామంలోని మెట్టు రామలింగేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన 240 ఎకరాల్లో 160 ఎకరాలను వ్యాగన్ పరిశ్రమ కోసం రాష్ట్ర ప్రభుత్వం సేకరించి రైల్వేశాఖకు అప్పగించింది. తాజాగా వ్యాగన్ పరిశ్రమను కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేస్తుండడంతో మిగతా భూమిని సైతం సేకరించే అవకాశం ఉంది.
దశాబ్దాల కల నెరవేరిన వేళ..!
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ 1970 కాలం నుంచి వినిపిస్తోంది. ఇందుకోసం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు, రైల్వే యూనియన్ల నేతలు, రైల్వే జేఏసీ నేతలు కూడా డిమాండ్ చేస్తూ వచ్చాయి. తర్వాత కాలంలో తెలంగాణకు కేటాయించిన కోచ్ ఫ్యాక్టరీని పంజాబ్‌కు తరలించారు. దీంతో నిరాశే ఎదురైంది. అయితే 2014లో రాష్ట్ర పునర్విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. దీంతో అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ ప్రభుత్వం కాజీపేట మండలం అయోధ్యపురం గ్రామంలో 160 ఎకరాల స్థలాన్ని సేకరించి రైల్వేశాఖకు అప్పగించింది. అయితే 2017లో దేశంలో ఎక్కడా కూడా కోచ్ ఫ్యాక్టరీల అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం హామీని వెనక్కి తీసుకుంది.
అదే సమయంలో 2018లో మహారాష్ట్రలోని లాతూర్‌లో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తెలంగాణలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఒత్తిడి పెరగడంతో 2023 జూలై 8న కాజీపేటలో 160 ఎకరాల్లో రైల్వే వ్యాగన్ తయారీ పరిశ్రమకు ప్రధాని మోదీ భూమి పూజ చేశారు. 2025లోగా పూర్తయ్యేలా రూ.521 కోట్లతో ఈ పరిశ్రమను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం శరవేగంగా పనులు కూడా జరుగుతున్నాయి. తాజాగా వ్యాగన్‌ను కోచ్ ఫ్యాక్టరీగా అప్‌గ్రేడ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. ఆమోదం తెలపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుతో స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
మొదలు కానున్న సర్వే..
రైల్వే వ్యాగన్ షెడ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పుడు వ్యాగన్‌కు కేటాయించిన స్థలంలోనే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అధికారులు సర్వే చేపట్టునున్నారు. కోచ్ ఫ్యాక్టరీ వచ్చే ఏడాది ఆగస్టు నాటికి పూర్తిగా సిద్ధమవుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ యూనిట్‌లో గూడ్స్ వ్యాగన్లు, ఇంజిన్లతో పాటు రైల్వే కోచ్‌ల తయారీకూడా జరగనుంది. ఆధునిక ఎల్‌హెచ్‌బీ బోగీలు, సబర్బన్ రైళ్లకు ఉపయోగించే ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్లు (ఈఎంయూలు) కూడా తయారీ కానున్నాయి. ఈ యూనిట్‌ను ఏడాదికి 600 కోచ్‌ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండేలా రైల్వే అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు. కోచ్ ఫ్యాక్టరీతో ప్రత్యక్షంగా సుమారు 3వేల మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయి.