ఇంధన దోపిడీ.. బల్దియాలో డీజిల్ లెక్కల్లో గోల్‌మాల్
గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో అవినీతికి అంతులేకుండా పోతోంది.
దిశ, వరంగల్ టౌన్: గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్‌లో అవినీతికి అంతులేకుండా పోతోంది. అవకాశం దొరికితే చాలు సంచులు నింపుకునేందుకు కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు ఎవరూ వెనుకాడడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా, ఇంధన రూపంలో లక్షల్లో డబ్బు కమాయిస్తున్నట్లు బల్దియాలో చర్చ జరుగుతోంది. బల్దియా ఆధ్వర్యంలో వినియోగించే వాహనాలకు వాడుతున్న డీజిల్, పెట్రోల్ లెక్కల్లో గోల్‌మాల్ చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారనే వాదనలు వెల్లువెత్తుతున్నాయి. బల్దియా పరిధిలో మొత్తం 550వాహనాలు ఉన్నాయి. వీటికి ఏడాదికి రూ.1.20కోట్ల మేర ఇంధనానికి ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఖర్చులో తప్పుడు లెక్కలు చూపించి పెద్దమొత్తంలో దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బల్దియా వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయనే విషయంపై నిఘా కొరవడి డ్రైవర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఉన్నతాధికారులకు, పాలకవర్గానికి తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించకుంటే ప్రజాధనం పక్కదారి పట్టే అవకాశం మరింత పెరిగే ప్రమాదం ఉంది.
సర్కారు సొమ్ము.. ప్రైవేటు సేవ..
చెత్త సేకరణకు వినియోగించే స్వచ్ఛ ఆటోలు నగర వ్యాప్తంగా వీధుల్లో తిరుగుతూ చెత్త సేకరిస్తుంటాయి. ఆయా ఆటోలకు ఫలానా వీధులంటూ పరిధి, పరిమితి విధిస్తారు. వాటి కేటాయించిన పరిధిలోనే ఆ ఆటోలు తిరగాల్సి ఉంటుంది. అయితే, ఆటోల డ్రైవర్లు తమ పరిమితి, పరిధి పూర్తి కాకుండానే అయినట్లు చెబుతూ గోల్‌మాల్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఒక స్వచ్ఛ ఆటో రోజు 20 కిలోమీటర్లు తిరగాలని నిబంధన ఉంటే.. డ్రైవర్లు 10 కిలోమీటర్లే తిరుగుతున్నట్లు తెలుస్తోంది. మిగతా 10 కిలోమీటర్లు ప్రైవేటు పనులకు వెళ్లి.. ప్రైవేటు వ్యక్తుల నుంచి కిరాయి వసూలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాగంటే.. నగరంలో కొందరు వ్యాపారస్తుల సరుకులను స్వచ్ఛ ఆటోల్లో తరలిస్తూ వారికి ఊడిగం చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా సర్కార్ ఇంధనంతో ప్రైవేటు సేవలో తరిస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది.
జవాన్, డ్రైవర్లు కుమ్మక్కు..
వాహనాల్లో డీజిల్ పోసే సమయంలో బల్దియాకు చెందిన జవాన్ ఒకరు స్వయంగా పర్యవేక్షించాల్సి ఉంటుంది. వాహనం తిరిగే పరిధిని లెక్కలోకి తీసుకుని ఇంధనం పోయించాల్సి ఉంటుంది. అయితే, డ్రైవరు, జవాన్ కుమ్మక్కై తప్పుడు రీడింగ్ నమోదు చేస్తూ ఇంధనం పోయించకున్నా పోయించినట్లు తప్పుడు లెక్కలు నమోదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా నిత్యం వందల లీటర్ల మేర గోల్‌మాల్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
జీపీఎస్ తుస్...
వాస్తవానికి బల్దియా పరిధిలో వినియోగించే వాహనాలకు జీపీఎస్ సిస్టమ్ ఏర్పాటు చేయాల్సి ఉంది. కొన్ని వాహనాలకు ఉన్నప్పటికీ మిగతా వాహనాలను పట్టించుకునే వారే కరువయ్యారు. ఇలా జీపీఎస్ లేని వాహనాల్లో కాంపాక్టర్లు 13, డంపర్ ప్లేసర్స్ 10, టిప్పర్లు 8, స్వచ్ఛ ఆటోలు 200, ట్రాక్టర్లు 66, ట్యాంకర్లు 10 ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా వాహనాలు ఎక్కడ తిరుగుతున్నాయనే విషయంపై నిఘా కొరవడి, డ్రైవర్లు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం ఉన్నతాధికారులకు, పాలకవర్గానికి తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఐటీ డిపార్ట్‌మెంట్ కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, వాహనాల రవాణాపై దృష్టిసారించేలా జీపీఎస్ ఏర్పాటు చేస్తే ఏటా రూ.20లక్షల మేర బల్దియాకు ఆదా కానుంది. లేదంటే.. ప్రజాధనం పక్కదారి పట్టే అవకాశం మరింత పెరిగే ప్రమాదం ఉంది.