పక్కా ప్లాన్‌తో డబ్బులు మాయం.. సీసీ ఫుటేజీలో ఆగంతకుల ఆచూకీ 

Update: 2022-02-04 12:05 GMT

దిశ, నర్సంపేట : వరంగల్ జిల్లా నర్సంపేటలో నయా దొంగతనం వెలుగు చూసింది. క్షణాల వ్యవధిలో అనుమానం రాకుండానే నగదును ఆగంతకులు దోచేశారు. ఈ ఘటన నర్సంపేట పట్టణ పోలీస్ స్టేషన్‌ దగ్గరలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నర్సంపేట పట్టణంలోని గాంధీనగర్‌కి చెందిన కరిమిండ్ల సంపత్ రావు (60) పంచాయతీ రాజ్ శాఖలో వర్క్ ఇన్స్పెక్టర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయన గురువారం మధ్యాహ్నం డబ్బులు తీసుకురావడానికి ఎస్‌బీఐ బ్యాంక్‌కి వెళ్ళారు. స్థానిక జయశ్రీ థియేటర్ ముందు సందులోని బ్యాంక్‌కి చేరుకున్న సంపత్ రావు రూ.1.5 లక్షలు విత్ డ్రా చేశారు. ఆ నగదును తన బైక్ ట్యాంక్ కవర్‌లో పెట్టుకొని పోలీస్ స్టేషన్ మీదుగా మాదన్నపేట రోడ్‌లోకి వెళ్లారు. అక్కడ అనూష కిరాణ కొట్టు ఎదుట బైక్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాడు. 5 నిముషాలకు తిరిగి వచ్చిన సంపత్ రావుకు షాక్ తగిలింది. తన బైక్ ట్యాంక్ కవర్‌లో ఉండాల్సిన డబ్బులు లేవు. దాంతో సంపత్ రావు తీవ్ర ఆందోళన చెందారు.

సీసీటీవీ ఫుటేజీలో ఆగంతకుల జాడ..

క్షణాల వ్యవధిలో నగదు మాయం కావడంతో సంపత్ రావు ఆందోళన చెందాడు. అనంతరం పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీలను పరిశీలించగా ఆగంతకుల ఆచూకీ దొరికినట్టు సమాచారం. నలుగురు వ్యక్తులు పక్కా ప్లాన్ ప్రకారం అతని దగ్గర నుండి డబ్బులు కాజేసినట్టు సీసీ టీవీ ఫుటేజీ ద్వారా తెలుస్తోంది. అనూష కిరాణాలోకి వెళ్లిన సంపత్ రావుని ఒకరు బైక్ వైపు చూడకుండా అడ్డుకోవడం, కిరాణా పరిసరాల్లో నలుగురు అనుమానాస్పదంగా తిరుగుతుండటం అంతా సీసీటీవీలో రికార్డ్ అయ్యింది. సంపత్ రావు కిరాణా షాప్‌లో ఉన్న సమయంలో అక్కడే నిల్చుని ఉన్న అగంతకుడు డబ్బులు కాజేశాడు. అనంతరం అందరూ ఒక్కొక్కరుగా అక్కడి నుండి జారుకున్నారు. ఇదిలా ఉండగా.. ఆ నలుగురు ఆగంతకులు అందరూ హెల్మెట్ పెట్టుకొని ఉండటమే కాకుండా, ఉపయోగించిన ద్విచక్ర వాహనాలకు(పల్సర్) సైతం నెంబర్ ప్లేట్ లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Tags:    

Similar News