లేబర్ కార్డుల స్కాం డొంక కదులుతోంది
దిశ వరుస కథనాలతో లేబర్ కార్డుల స్కాం డొంక కదులుతోంది.
దిశ, వరంగల్ బ్యూరో : దిశ వరుస కథనాలతో లేబర్ కార్డుల స్కాం డొంక కదులుతోంది. హన్మకొండ కార్మిక శాఖ కార్యాలయంలో రాబంధులు, లేబర్ కార్డు ఫర్ సేల్ శీర్షికలతో రెండు రోజులు వరుస కథనాలు రావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా లేబర్ కార్డుల స్కాంపై చర్చ జరుగుతోంది. దిశ వరంగల్ బ్యూరోకు నేరుగా బాధితులు ఫోన్ చేసి అధికారుల అక్రమాలను, మోసాలను, కార్డు జారీ చేయడానికి అడిగిన లంచాల మొత్తాలను లెక్కలతో సహా చెబుతుండటం గమనార్హం. శనివారం ఆత్మకూరు మండలం నీరుకుళ్ల గ్రామానికి చెందిన ఓ కార్మికుడు, ఆత్మకూరు, పరకాల, కమాలాపూర్‌కు చెందిన కొంతమంది దిశతో మాట్లాడారు.
లేబర్ కార్డు అందిస్తామని కొంతమంది మధ్యవర్తులు రూ. 5వేల వరకు తీసుకుని సంవత్సరకాలంగా తిప్పుతున్నారని పేర్కొన్నారు. అలాగే మధ్య వర్తులతో సంబంధం లేకుండా నేరుగా కలిసే కార్యాలయ సిబ్బంది డిమాండ్ మేరకు రూ.2 వరకు అందజేసినట్లు ఓ కార్మికుడు వెల్లడించారు. అయితే అన్ని అర్హతలున్నప్పటికీ సంవత్సరన్నరకాలంగా కార్డు అందజేయకుండా ఏవేవో సంబంధం లేని కారణాలు చెబుతున్నారని వాపోయారు. ఇందులో వారికి అర్హత ఎంత ఉందన్న విషయం పక్కన పెడితే లేబర్ కార్డులు జారీ చేస్తామనే పేరిట అధికారులూ వసూళ్లకు పాల్పడుతున్న మాట వాస్తవమని స్పష్టమవుతోంది.
ఇంటెలిజెన్స్ అధికారుల ఆరా..!
కార్మికశాఖ కార్యాలయంలో రాబందులు, సేల్ ఫర్ లేబర్ కార్డు శీర్షికల పేరిట దిశలో వరుసగా కథనాలు ప్రచురితం కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. హన్మకొండ కార్యాలయం పరిధిలో జరుగుతున్న అక్రమాలను సైతం ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లింది. దిశలో వస్తున్న కథనాలపై రాష్ట్ర నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. అర్హతలేని వేలాది మందికి లేబర్ కార్డులు, శవాలకు సైతం లేబర్ కార్డులు సృష్టించిన తీరు, ప్రత్యేకంగా అధికారులు నియమించుకున్న ఏజెంట్ల వ్యవస్థను, దళారుల దందాపై సవివరంగా దిశలో కథనాలు ప్రచురితమైన విషయం తెలిసిందే.
దిశ కథనాల్లోని సమాచారాన్ని నిఘా వర్గాలు సరిపోల్చుకుని వాస్తవ పరిస్థితులు తెలుసుకుంటున్నట్లు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. మొత్తంగా హన్మకొండ జిల్లా కార్మిక శాఖ కార్యాలయం పరిధిలో లేబర్ కార్డుల స్కాం తీగ లాగితే డొంక కదులుతోంది. అయితే రాష్ట్ర స్థాయి అధికారులు దీనిపై అక్రమార్కులకు కొమ్ముకాస్తారా..? లేదా అంతర్గత విచారణ చేసి చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. అయితే అక్రమార్కుల చర్యలు తీసుకునేంత వరకు దిశ అక్షర సమరం కొనసాగనుంది.