Minister : కల్లుగీత కార్మికుల భద్రతకే కాటమయ్య కిట్లు
కల్లుగీత కార్మికుల భద్రతకే కాటమయ్య కిట్లు అందిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.
దిశ, వరంగల్ టౌన్ : కల్లుగీత కార్మికుల భద్రతకే కాటమయ్య కిట్లు అందిస్తున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం వరంగల్ ఎనుమాముల మార్కెట్ పల్లి యార్డులో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వరంగల్ తూర్పు నియోజకవర్గ కాటమయ్య రక్షక కవచం కిట్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదాతో కలిసి కిట్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో కులవృత్తులకు అన్ని విధాలా చేయూత అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. బలహీనవర్గాల అభ్యున్నతే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు. కల్లు గీత కార్మికుల ప్రాణాలకు ప్రజా ప్రభుత్వ అభయహస్తం కాటమయ్య రక్షణ కవచమని అన్నారు.
కల్లు గీత కార్మికుల రక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని, ఇక నుంచి కార్మికుడు చెట్టుపై నుంచి కిందపడి ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ప్రత్యేక కిట్లను తయారు చేసిందని, కాటమయ్య రక్షణ కవచం పేరిట 6 పరికరాలున్న కిట్‌ను సిద్ధం చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్మికుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 10 వేల మంది గీత కార్మికులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేస్తున్నామని, వరంగల్ జిల్లాలో రూ. 55 లక్షల రూపాయల వ్యయంతో 550 మంది కల్లుగీత కార్మికులకు కాటమయ్య రక్షణ కవచాలు అందిస్తున్నట్లు, అందులో వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని 116 లబ్ధిదారులకు నేడు భద్రత కిట్లను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఇది నిరంతర ప్రక్రియ అని అన్నారు. గీత కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ. 25 వేలు, ప్రమాదం జరిగితే రూ.15 వేల పరిహారం, ప్రమాదానికి గురై మరణించిన గీత కార్మికులకు రూ. 5 లక్షలు ఎక్స్ గ్రేషియా ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు గీత కార్మికుడు ప్రయోగాత్మకంగా కాటమయ్య భద్రత కిట్ ధరించి చెట్టు ఎక్కిన తీరును మంత్రి, కలెక్టర్ లు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు పోశాల పద్మ, భోగి సువర్ణ, చింతాకుల అనిల్, ఉమా దామోదర్ యాదవ్, జిల్లా బీసీ సంక్షేమ అధికారి పుష్పాలత, జిల్లా ఆబ్కారీ అధికారి చంద్రశేఖర్, గౌడ సంఘ నాయకులు నర్సయ్య, శ్రీనివాస్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.