ఆ మరణాల వెనుక దెయ్యం…భయంతో వణికిపోతున్న జంగాలపల్లి
ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్థులు అమ్మో దెయ్యం అంటూ వణికిపోతున్నారు. గ్రామంలో వరుసగా మరణాలు నమోదవుతుండటంతో
దిశ, వరంగల్ బ్యూరో : ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామస్థులు అమ్మో దెయ్యం అంటూ వణికిపోతున్నారు. గ్రామంలో వరుసగా మరణాలు నమోదవుతుండటంతో.. గ్రామానికి కీడు సోకడమే ఇందుకు కారణమని భావిస్తున్నారు. రెండు నెలల కాలంలో 20 మంది వరకు అనారోగ్యంతో మరణించడంతో.. ఇప్పుడు ఊరి జనమంతా భయాందోళనకు గురవుతున్నారు. చనిపోయిన వారంతా కూడా దెయ్యం ఆకలికి బలైన వారేనని నమ్ముతున్నారు. గ్రామానికి కీడు సోకిందని.. కీడు నివారణకు గ్రామ దేవతలకు బలులతో పూజలు చేయాలని భావిస్తున్నారు. కీడు సోకిందని.. ఇక్కడే ఉంటే మరణం తప్పదని భావిస్తున్న కొంతమంది ఊరి నుంచి విడిచివెళ్తున్నారు. ఇందులో విద్యావంతులు కూడా ఉండటం గమనార్హం.
20 మరణాలు.. సేమ్ సిమ్‌టోమ్స్..!
సెప్టెబర్ రెండో వారం నుంచి ఇప్పటి వరకు గ్రామానికి చెందిన 20 మంది మృత్యువాత పడినట్లుగా గ్రామస్థులు చెబుతున్నారు. మృతిచెందిన వారిలో వివిధ ఏజ్‌గ్రూపుల వారు ఉండగా.. అందరూ జ్వరం బారిన పడి.. సేమ్ సిమ్‌టోమ్స్ కలిగి ఉన్నారని చెబుతున్నారు. అనారోగ్యం బారిన పడిన రెండు మూడు రోజుల్లో ఆరోగ్యం విషమంగా మారి ప్రాణాలు కోల్పుతున్నారని చెబుతున్నారు. నాలుగైదురోజులకు ఒకరు గ్రామంలో మృతి చెందుతున్నారని, ఏ క్షణం ఏం చెడు వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనకు గురవుతున్నారు. 2నెలల కాలంలోనే 20 మంది మృతి చెందడంతో జంగాలపల్లి వాసులు దిగ్బ్రాంతికి గురవుతున్నారు. దెయ్యం తినేస్తోందని, బొండ్రాయి సరిగా కూర్చోలేకపోవడంతోనే గ్రామంలో ఇలా జరుగుతోందని ఇలా రకరకాల వాదనలు గ్రామస్థులు వినిపిస్తున్నారు.
మరణాలకు కారణాలు కనుక్కోలేరా.?
అకాల మరణాలతో ఆందోళనలతో ఉన్న వారిని మరింతగా భయపెట్టే ప్రచారాలు గ్రామంలో జరుగుతున్నాయి. అయితే వీటిని అదుపు చేసేందుకు.. మరణాల వెనుక మిస్టరీని చేధించే ప్రయత్నం అధికారగణం బాధ్యతారాహిత్యాన్ని బయటపెడుతోంది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి.. రక్త నమునాలను సేకరించి జ్వరాల బారిన పడటానికి కారణాలు, ఇన్ఫెక్షన్ ప్రాణాంతకంగా త్వరగా మారడానికి కారణాలను వైద్యశాఖ అధికారులు తేల్చాలని విద్యావంతులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే దెయ్యం పేరిట జరుగుతున్న అంద విశ్వాసాల ప్రచారాన్ని అదుపు చేసేందుకు ప్రభుత్వం యంత్రాంగం ప్రయత్నించాలని కోరుతున్నారు.