కాంగ్రెస్ సభను విజయవంతం చేయాలి : టీపీసీసీ చీఫ్
వరంగల్‌లో లక్ష మంది మహిళలతో నిర్వహిస్తున్న కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.
దిశ, వరంగల్ బ్యూరో : వరంగల్‌లో లక్ష మంది మహిళలతో నిర్వహిస్తున్న కాంగ్రెస్ బహిరంగ సభను విజయవంతం చేయాలని టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈనెల 19న ఇందిరగాంధీ జయంతిని పురస్కరించుకుని ఇందిరా మహిళా సదస్సును కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. దాదాపు లక్షమంది మహిళలతో ఈ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం భవనాన్ని కూడా అదే రోజు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభం అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొననున్నారు. ఈ సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం నయీంనగర్‌లోని ఓ హోటల్‌లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
మహేష్ కుమార్ గౌడ్ తో పాటు మంత్రులు కొండా సురేఖ, శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ముఖ్యలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం పర్యటన, సభా ఏర్పాట్లపై మహష్ కుమార్ గౌడ్ సమీక్షించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటై ఏడాది పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మహిళా స్వయం సహాయక బృందాలు, జిల్లా సమాఖ్య సభ్యులు, గ్రామ సమాఖ్య సభ్యులకు వివిధ శాఖల వారీగా ఈ సందర్భంగా ఆస్తులను పంపిణీ చేయనున్నారని తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించిన రూట్ మ్యాప్, వేదిక ఏర్పాట్లు, పార్కింగ్ తదితర లాజిస్టిక్ అంశాలపై చర్చించారు.
భద్రత పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై సమీక్షించారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చేపట్టే పకడ్బందీగా ఏర్పాట్లు జరిగేలా చూడాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనను అందరం కలిసి దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. మహిళలు ఎక్కువ దూరం నడవకుండా పక్కాగా పార్కింగ్ ఏర్పాట్ల గురించి, మహిళలు, చిన్నారుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం గత ఏడాది కాలంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు విజువల్స్ ద్వారా అవగాహన కల్పించాలని, గ్రామ గ్రామాన పెద్ద ఎత్తున విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. అధికారులంతా సమన్వయంతో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేసేందుకు కృషి చేయాలని పేర్కొన్నారు.
మంత్రుల పర్యవేక్షణ..!
సమీక్ష అనంతరం హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ గ్రౌండ్‌లో మంత్రులు కొండా సురేఖ, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ గౌడ్, ఎమ్మెల్యేలతో కలిసి మహష్‌కుమార్ గౌడ్ పర్యటించారు. ఈసందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా, వరంగల్ కలెక్టర్ సత్యశారద, హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్యతో పాటు వివిధ విభాగాలకు చెందిన రాష్ట్ర స్థాయి అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. సభా వేదిక ఏర్పాటుతో పాటు తాగునీరు వంటి సదుపాయం తదితర అంశాలపై మంత్రులు అధికారులకు సూచించారు.సభా నిర్వహణకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండటంతో ఏర్పాట్లలో వేగం పెంచారు.