కమలంలో కల్లోలం.. హ‌న్మకొండ జిల్లా పార్టీపై అధిష్టానం ఫోక‌స్‌

బీజేపీ హ‌న్మకొండ జిల్లా పార్టీలో సంస్థాగ‌త మార్పుల‌కు రాష్ట్ర

Update: 2025-01-03 01:56 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : బీజేపీ హ‌న్మకొండ జిల్లా పార్టీలో సంస్థాగ‌త మార్పుల‌కు రాష్ట్ర అధినాయ‌క‌త్వం సిద్ధమ‌వుతున్నట్లు స‌మాచారం. రాష్ట్ర అధ్యక్షుడిగా నూత‌న సార‌థి రాబోతున్నార‌ని తెలుస్తున్న నేప‌థ్యంలో హ‌న్మకొండ జిల్లాలోనూ నాయ‌క‌త్వ బాధ్యత‌ల మార్పు ఉండ‌బోతోంద సంకేతాలు వెలువ‌డుతున్నాయి. రెండేళ్ల గ‌రిష్ఠ కాల‌ప‌రిమితితో ఉండే జిల్లా అధ్యక్ష ప‌ద‌వికి ప్రస్తుత హ‌న్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావుప‌ద్మ మూడు ద‌ఫాలుగా నియ‌మితుల‌య్యారు. మ‌రోసారి ఆమెకు అధ్యక్ష బాధ్యత‌లు అప్పగించేందుకు అవ‌కాశం లేద‌ని స‌మాచారం. ఇప్పటికే ఆమె ప‌నితీరును త‌ప్పుబ‌డుతూ అనేకానేక ఆరోప‌ణ‌లు, ఫిర్యాదుల‌తో అధిష్టానం వ‌ద్దకు సీనియ‌ర్ నేత‌లు క్యూ క‌ట్టడం గ‌మ‌నార్హం. పార్టీలో స‌మ‌న్వయం లోపించ‌డంతో పాటు వ‌ర్గ రాజ‌కీయాలు పెరిగేందుకు కార‌ణ‌మ‌వుతున్నార‌ని సీనియ‌ర్ల నుంచి ఆరోప‌ణ‌లున్నాయి.

రావు ప‌ద్మపై ఆరోప‌ణ‌లివే..!

అసెంబ్లీ ఎన్నిక‌ల త‌ర్వాత పార్టీని ముందుకు న‌డిపించ‌డంలో, పార్టీ విధానాల‌ను ప్రజ‌ల్లోకి తీసుకెళ్లడంలో, కేంద్ర ప్రభుత్వం ప‌థ‌కాల‌పై ప్రచారం నిర్వహించ‌డం, చ‌ర్చ జ‌రిగేలా చేయ‌డంలోనూ ఆమె వైఫ‌ల్యం చెందుతున్నార‌ని ప‌లువురు సీనియ‌ర్లు నొక్కి వ‌క్కాణిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధుల‌తో

అదే స‌మ‌యంలో పార్టీలో త‌మ‌ను పూచిక‌పుల్లలా చూస్తోంద‌ని, క‌నీస గౌర‌వ మ‌ర్యాద‌లు ద‌క్కడం లేదని, పార్టీలో ప్రోటోకాల్ అమ‌లు జ‌ర‌గ‌డం లేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫ‌ల్యాల‌ను, ప్రజా వ్యతిరేక విధానాల‌ను పార్టీ ప‌రంగా తిప్పికొట్టడంలోనూ విఫ‌లం చెందుతున్నారంటూ ఇలా అనేకానేక ఆరోప‌ణ‌లు, విమ‌ర్శల‌తో అధిష్టానం వ‌ద్ద సీనియ‌ర్ నేత‌లు ఫిర్యాదు చేసిన‌ట్లు స‌మాచారం. జిల్లా అధ్యక్షురాలి పదవిలో ఉండి నేతలందరినీ కలుపుకోవాల్సిన ఆమె, వర్గాలను పెంచి పోషించారని బహిరంగంగానే బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, స్మార్ట్ సిటీ నిధులు బీజేపీ ప్రక‌టిస్తే ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వైఫ‌ల్యం చెందార‌న్న విమ‌ర్శలు పార్టీ నేత‌ల నుంచి వినిపిస్తున్నాయి.

రేసులో వీరు..!

సంక్రాంతి పండుగ స‌మ‌యంలోనే బీజేపీ అధ్యక్షుడి నియామ‌కం ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ ప‌రిణామానికి అటు ఇటుగా హ‌న్మకొండ జిల్లా నూత‌న అధ్యక్షుడి నియామకం కూడా ఉంటుంద‌ని స‌మాచారం. పోరాట పటిమ, సమన్వయం చేసుకునే సమర్థతతో పాటు వయసును కూడా ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందని ఓ సీనియ‌ర్ నేత అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలోని కీల‌క నేత‌ల‌తో పాటు విభిన్న నేప‌థ్యాలున్న నేత‌ల అభిప్రాయాలు సేక‌రిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండ‌గా ఈక్రమంలోనే రావు ప‌ద్మ కూడా త‌న వ‌ర్గానికి చెందిన నేత‌కు అధ్యక్ష ప‌ద‌వి వ‌చ్చేలా అధిష్టానానికి విన్నవించుకున్నట్లుగా తెలుస్తుండ‌గా, ఆ ప్రతిపాద‌న‌ల‌ను కూడా సీనియ‌ర్లు వ్యతిరేకిస్తున్నట్లు స‌మాచారం. బీజేపీ జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రధానంగా సీనియ‌ర్ నేత రావుల కిష‌న్‌, చాడ శ్రీనివాస‌రెడ్డి, సంతోష్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి.

ఇందులో రావుల కిష‌న్ పేరును ప్రముఖంగా అధిష్టానం ప‌రిశీలిస్తున్నట్లు విశ్వస‌నీయంగా తెలిసింది. దాదాపుగా 35 ఏళ్లుగా బీజేపీలో కొన‌సాగుతున్న రావుల కిష‌న్ పార్టీని న‌మ్ముకుని ప‌నిచేస్తున్నారు. గ‌తంలో రెండు సార్లు జిల్లా అధ్యక్ష ప‌ద‌వి రేసులోకి వ‌చ్చినా అధిష్టానం సూచ‌న‌లు, సామాజిక స‌మీక‌ర‌ణ‌ల‌తో చేజారింది. బండి సంజ‌య్‌, బండారు ద‌త్తాత్రేయ వంటి సీనియ‌ర్ నేత‌ల‌తోనూ రాజ‌కీయ‌ స‌మ‌న్వయం ఉండ‌టం ఆయ‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చే అవ‌కాశంగా సీనియ‌ర్ల చెబుతున్నారు. పార్టీ కీల‌క ప‌ద‌వుల్లో బీసీల‌కు స్థానం ఉండ‌డం లేద‌న్న విమ‌ర్శల‌కు బీసీ నేత ఎంపిక‌తో స‌మాధానం ఇచ్చిన‌ట్లవుతుంద‌న్న స‌మీక‌ర‌ణాన్ని అధిష్టానం ఆలోచ‌న చేస్తున్నట్లు స‌మాచారం.


Similar News