వరంగల్ నగర రూపు రేఖలు మారనున్నాయి..: ఎంపీ కడియం కావ్య

వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న

Update: 2024-11-06 14:44 GMT

దిశ, హనుమకొండ : వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం తీసుకుంటున్న ప్రత్యేక చొరవతో త్వరలోనే నగర రూపురేఖలు మారనున్నాయని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాలులో వరంగల్ నగరాభివృద్ధిపై హైదరాబాద్ లో రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార పౌర సంబంధాల శాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర పర్యావరణ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ లు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలసి హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, సంబంధిత అధికారులతో గత మంగళవారం హైదరాబాద్ లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించిన వాటికి సంబంధించిన వివరాలను మీడియా సమావేశంలో ఎంపీ, మేయర్, ఎమ్మెల్యేలు, కలెక్టర్లు వెల్లడించారు. మీడియా సమావేశంలో వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోనే రెండో పెద్ద నగరమైన వరంగల్ ను రెండో రాజధానిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు.

వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ దశాబ్దాల ఎయిర్ పోర్ట్ కల త్వరలోనే సాకారం కానుందని చెప్పారు. కార్గో విమానాల రాకపోకలకు ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కావలసిన 950 భూమికి గాను ఇప్పటివరకు 693 ఎకరాలు కేంద్ర విమానయాన సంస్థ ఆధీనంలో ఉందన్నారు. మిగిలిన 253 ఎకరాల భూమిని సేకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. ఎయిర్పోర్టుకు భూ సేకరణ పూర్తయితే పనులు ప్రారంభం కానున్నాయన్నారు. వరంగల్ నగరానికి సంబంధించి రెండు రైల్వే లైన్లు వస్తున్నాయన్నారు. నష్కల్ నుండి హసన్ పర్తి వరకు, నష్కల్ నుండి చింతలపల్లి వరకు రైల్వే మార్గాలు వస్తున్నాయన్నారు. ఇప్పటికే నష్కల్ నుండి హసన్ పర్తి రైల్వే మార్గానికి రైల్వే బోర్డు నుండి ఆమోదం లభించిందన్నారు. రైల్వే మార్గాల రాక వలన నగర అభివృద్ధికి దోహదపడుతుంద న్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉపయోగపడే విధంగా వెల్ నెస్ సెంటర్ మంజూరయిందన్నారు.

నగర మేయర్  గుండు సుధారాణి మాట్లాడుతూ.. హైదరాబాద్ తర్వాత రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ ను అంతటి స్థాయిలో అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. గతంలో నగరానికి తొలిసారి విచ్చేసిన నేపథ్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో నగరం గ్రేటర్ గా ఏర్పడినప్పటికి అంతటి స్థాయిలో అభివృద్ధి జరగలేదన్న ఉద్దేశంతో నగరానికి అతి ముఖ్యమైన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ (యు డి జి) ఏర్పాటు చేయాలని ఆదేశించడం జరిగిందని అందుకు అనుగుణంగా ఇన్చార్జి మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి యుజీడీ కోసం డీపీఆర్ తయారు చేయడం కోసం ఒక కంపెనీని టెండర్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇందుకోసం సర్వే కూడా మొదలు పెట్టడం జరిగిందని, ఈ అంశంపై హైదరాబాదులో సుదీర్ఘంగా చర్చించడం జరిగిందని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కేవలం స్ట్రాం వాటర్ డ్రైన్ మాత్రమే కాకుండా ఎలక్ట్రికల్ తో పాటు నీటి సరఫరా లైన్స్ కేబుల్ నెట్వర్క్ డ్రైనేజీ లైన్లు లింక్ చేసి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్( ఐసీసీసీ) అనుసంధానం చేయడం నగరంలోని జలాశయాలు ఎస్ టి పి లను కూడా అనుసంధానం చేయాలన్నారు.

సమగ్ర రిపోర్టు వచ్చే విధంగా డిపిఆర్ తయారు చేయాలని, ఇట్టి అంశాలను కంపెనీ పర్యవేక్షించడంతో పాటు మాస్టర్ ప్లాన్ అమలు కోసం స్పెషల్ అధికారిని నియమించాలని, హైదరాబాదులో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇన్చార్జి మంత్రివర్యులు సూచించడం జరిగిందని నగర ప్రజల చిరకాల వాంఛ ఆయన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను సమగ్రంగా అమలు చేయడానికి ప్రత్యేక అధికారి దోహదపడతారని సుదీర్ఘంగా మాస్టర్ ప్లాన్ అమలకు కొంత సమయం పడుతున్నప్పటికీని ప్రత్యేక అధికారి నియామకం వల్ల పనుల్లో పురోగతి ఉంటుందని ఇందుకోసం చర్యలు చేపట్టిన ముఖ్యమంత్రి కి నగర ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలుపుతున్నట్లు మేయర్ తెలిపారు.

భద్రకాళి చెరువు యందు గత 30 సం.ల నుండి పూడిక పేరుకుపోవడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోవడం జరిగిందని ప్రస్తుత భద్రకాళి చెరువు గతం లో త్రాగు నీటి రిజర్వాయర్ గా ఉండేదని ప్రస్తుతం లేదని నగరానికి నీటి సరఫరా ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి జరుగుతుందని కావున భద్రకాళి చెరువులో గుర్రపు డెక్క పేరుకుపోవడం వల్ల నీరు కలుషితం అవుతుందని కావున చెరువును పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ప్రజాప్రతినిధులు తెలియజేయడం జరిగిందని ఇందుకోసం ఇరిగేషన్ అధికారులతో సమన్వయం చేస్తూ తొలగింపు ప్రక్రియ కొనసాగాలని గతంలో ప్రభుత్వం నుండి తీసుకువచ్చిన రూ. 158 కోట్ల తో బొంది వాగు నుండి కాపు వాడ వైపు ఇన్ లెట్ అవుట్ లెట్ ఏర్పాటు చేసే విధం గా చూడాలని తద్వారా హనుమకొండ వరంగల్ పట్టణాలకు హార్ట్ ఆఫ్ ద సిటీగా ఉన్న భద్రకాళి చెరువు ఉండడం వల్ల ఈ నిర్మాణాలు చేపడితే ఇరు ప్రాంతాలలో కాలనీలు వరద ముంపుకు గురికాకుండా ఉంటాయని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన సమగ్ర కుటుంబ కుల గణన సర్వే తెలంగాణ లో ప్రారంభించడం జరిగిందని ఇది దేశానికి దిక్సూచిగా మారనుందని పార్లమెంటు సభ్యులు రాహుల్ గాంధీ రాష్ట్రంలోని మేధావులు ప్రముఖులతో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణ పై సమీక్షించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఈ సర్వే నిర్వహణ ద్వారా అన్ని వర్గాలకు సంక్షేమ ఫలాలు సమన్యాయం జరుగుతుందని ఈ సర్వే నిర్వహణ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు సమన్యాయం జరుగుతుందని మేయర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత వరంగల్ మహా నగర అభివృద్ధి కొరకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. నిన్న హైదరాబాద్ వేదికగా హనుమకొండ, వరంగల్ జిల్లా ల సమగ్ర అభివృద్ధి పై ఇంచార్జ్ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి,జిల్లా అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో సుధీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. చాలా అంశాలు సమావేశ అనంతరం కొలిక్కి వచ్చాయి. గత ప్రభుత్వ హయాంలో అటువంటి సమీక్ష నిర్వహించిన దాఖలాలు లేవని ఏద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో వరంగల్ నగరానికి వరాల జల్లులు కురిపించబొతున్నారని ఎమ్మెల్యే నాయిని పేర్కొన్నారు. భద్రకాళి చెరువు పూర్తి స్థాయిలో మంచినీటి కేంద్రంగా మార్చాలని ప్రభుత్వం దృష్టి సారించిందని గుర్తు చేశారు.

వరంగల్ మహా నగరానికి మరో మణిహారంగా ఉన్న మామునూర్ విమానాశ్రయ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రానున్న రోజుల్లో హైదరాబాద్ ఆ తర్వాత రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరమైన వరంగల్ లో రైలు మార్గం రోడ్డు మార్గంతో పాటు వాయి మార్గం కూడా రావడం వల్ల పారిశ్రామికంగా కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. పార్లమెంట్ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం భారతదేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కులగణన సర్వే ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ సర్వే ద్వారా తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి ఆధారపడి ఉంటున్న తరుణంలో ప్రజలందరూ కులగనన సర్వేకు సహకరిస్తూ పూర్తిస్థాయిలో వాస్తవాలను పొందుపరచాలని తప్పుడు సమాచారం వల్ల నివేదికలలో చాలా మార్పులు రావడం జరుగుతుందని ప్రజలందరు సహకరిస్తూ పూర్తిస్థాయిలో వాస్తవాలనే అధికారులకు చెప్పాలని కోరారు.

వర్ధన్నపేట శాసనసభ్యులు కేఆర్ నాగరాజు మాట్లాడుతూ.. తన వర్ధన్నపేట నియోజకవర్గంలో మామునూరు ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు చర్యలు వేగవంతంగా చేపట్టడం జరుగుతున్నదని, అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ ఏర్పాటు నిమిత్తం భూ నిర్వాసితులకు పరిహారం త్వరితంగా అందించుటకు చర్యలు తీసుకోవడం జరుగుతున్నదన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో ప్రజలు భాగస్వాములై పూర్తి వివరాల అందించి రేటరులకు సహకరించాలని ఎమ్మెల్యే నాగరాజు కోరారు.

జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ.. గత మంగళవారం హైదరాబాదులో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు సురేఖ, పొన్నం ప్రభాకర్, నగరంలోని ప్రజాప్రతినిధులతో గతంలో ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్, భద్రకాళి మాడ విధుల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటు, మెగా టెక్స్టైల్ పార్క్, ఎయిర్పోర్ట్, సైన్స్ సెంటర్, రైల్వే ఓవర్ బ్రిడ్జి ఈకో పార్క్ తదితర అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించాలని అన్నారు.

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ.. గత మంగళవారం మంత్రుల ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఎయిర్పోర్ట్, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ , తదితర అంశాలపై సమీక్షించి వేగవంతంగా పూర్తి చేయుటకు దిశా నిర్దేశం చేశారని అన్నారు. ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా వరంగల్ జిల్లాలో 2.64 లక్షల గృహాల సర్వే చేయుట కొరకు 2052 గనకులను 205 సూపర్వైజర్లు నియమించడం జరిగిందని, ఈరోజు క్షేత్రస్థాయిలో గృహాల గుర్తింపు స్టిక్కరింగ్ లను పరిశీలించడం జరిగిందన్నారు. ఖచ్చితమైన పూర్తి వివరాలను గనకులకు అందించి సహకరించాలని జిల్లా ప్రజలను కలెక్టర్ కోరారు.


Similar News