హస్తం హవా.. ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించిన పలు సర్వే సంస్థలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది.
దిశ, వరంగల్ బ్యూరో : ఉమ్మడి వరంగల్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ చెదురు ముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ గడువు ముగిసిన కొద్ది సేపటికే పలు సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను విడుదల చేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ వైపు మెజార్టీ స్పష్టంగా ఉంటుందని వెల్లడించాయి. రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ కి దక్కుతాయని దాదాపు అన్ని ప్రముఖ సర్వే సంస్థలు వెల్లడించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనూ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తుందని ఎగ్జిట్ ఫలితాల్లో వెల్లడించాయి. ప్రముఖ సర్వే సంస్థలైన ఆరా, చాణక్య స్ట్రాటజీస్, సీ ప్యాక్, పీటీఎస్ వెల్లడించిన అంచనాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 9 సీట్ల వరకు గెలుచుకుంటుందని వెల్లడించడం గమనార్హం. చాణక్య వెల్లడించిన అంచనాల్లో 1 స్థానం పై టఫ్ ఉంటుందని ఫలితం ఎలా అయినా ఉండొచ్చంటూ పేర్కొంది.
ఒపీనియన్, ప్రీ పోల్ సర్వేల్లోనూ కాంగ్రెస్ వైపే..!
తెలంగాణలో ఎన్నికల వాతావరణం మొదలైనప్పటి నుంచి పలుసర్వే సంస్థలు నిర్వహించిన ఒపీనియన్, ప్రీ పోల్ సర్వేల్లోనూ ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ వేవ్ ఉన్నట్లుగా ఫలితాలను వెల్లడిస్తూ వచ్చాయి. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం నిర్ణయాలు, ప్రభుత్వం పై ప్రజల్లో అసంతృప్తి, అభ్యర్థుల పై వ్యతిరేకతనే కాంగ్రెస్‌కు బలంగా మారుతోందంటూ విశ్లేషించాయి. వాస్తవానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని నలుగురైదుగురు ఎమ్మెల్యేలకు ప్రజల్లో ఆదరణ ఉన్నప్పటికీ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి, మార్పును కోరుకోవడం వంటి అంశాలు ఆ స్థానాల్లో కాంగ్రెస్ పుంజుకోవడానికి కారణంగా విశ్లేషణలు జరుగుతున్నాయి.
సర్వేసంస్థ బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఇతరులు
ఆరా 4 - 5 7-8 - -
చాణక్య 4 7 1 -
సీ ప్యాక్ 5 7 - -
పీటీఎస్ 3-5 7-9 - -