తవ్వుకో తరలించుకో.. అక్రమ ఇసుక రవాణాకు అడ్డేది ?
మండల పరిధిలోని ఆకేరు వాగులో గండ్ర (బొండు) ఇసుక అధికంగా దొరుకుతుంది. బేస్ మట్టం, ఫ్లోరింగ్, ప్లాస్టింగ్ కు ఇది చాలా అవసరం.
దిశ, డోర్నకల్(సీరోల్) : మండల పరిధిలోని ఆకేరు వాగులో గండ్ర (బొండు) ఇసుక అధికంగా దొరుకుతుంది. బేస్ మట్టం, ఫ్లోరింగ్, ప్లాస్టింగ్ కు ఇది చాలా అవసరం. స్లాబ్ కోసం గోదావరి ఇసుకను తెప్పించుకొని మిగిలిన పనులకు బొండు ఇసుకను వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో ఆకేరు పరివాహక ప్రాంతాల్లో మోదుగడ్డ తండా, దుబ్బతండా, ములకలపల్లి, ఏటి అవతల గిరిజన గ్రామాల్లో రాత్రి అయితే చాలు వాహనాల కోలాహలం.. అనుమతులతో అసలే పనిలేదు. నిబంధనలు పక్కన పెట్టి గండ్ర(బోండు) ఇసుకను తవ్వుకొని తీసుకపోతున్నారు కొందరు అక్రమార్కులు. ప్రస్తుతం ఇళ్లు, ఇతర నిర్మాణాలు ఊపందుకోవడంతో ఇసుకకు డిమాండ్ ఏర్పడింది. ఇదే అదునుగా వాగులు, ఏటీలో ఇసుక తవ్వుకొని అమ్ముకోవడమే పనిగా పెట్టుకున్నారు. వారికి కొందరు నాయకులు, అధికారుల అండదండలు ఉన్నాయన్న ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ఆదాయానికి గండి..
అనుమతులు లేకుండానే తవ్వుకుపోతూ ఇసుకాసురులు రూ.లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి మాత్రం గండి కొడుతున్నారు. ప్రధానంగా ఆకేరులో రోజుకు 200 ట్రక్కుల ఇసుక తవ్వకుపోతున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ ఉండడంతో ట్రక్కు రూ.6 వేలకు విక్రయిస్తున్నారు. ఖమ్మం నగరంతో పాటు పల్లెలకు సరఫరా చేస్తున్నారు. కొందరు వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద మొత్తంలో నిల్వ చేసుకుంటున్నారు. రోజు వేలల్లో అక్రమార్కులు జేబులో వేసుకుంటున్నారు. అడ్డుకట్ట పడకపోతే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి ఇసుక కొరత, భూగర్భ జలాలు అడుగంటే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అక్రమ ఇసుక రవాణా పై చర్యలు తీసుకుంటాం.. సీరోల్ తహశీల్దార్ శారద
ఆకేరు పరివాహక ఏరియాలో అక్రమ ఇసుక రవాణా జరుగుతున్నట్లు తెలిసింది. స్థానికంగా రెవెన్యూ సిబ్బంది లేకపోవడం ఇబ్బందిగా పరిణమించింది. పోలీసుల సహకారంతో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకొని అక్రమార్కుల పై చర్యలు తీసుకుంటాం.