నెర‌వేర‌నున్న క‌ల‌.. మున్సిపాలిటీలుగా కేస‌ముద్రం, స్టేషన్​ఘ‌న్‌పూర్‌..

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా అభివృద్ధిలో మ‌రో ముందడుగు ప‌డింది.

Update: 2024-12-21 02:46 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో : ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లా అభివృద్ధిలో మ‌రో ముందడుగు ప‌డింది. మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని కేస‌ముద్రం, జ‌న‌గామ జిల్లాలోని స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌ ను మునిసిపాలిటీలుగా చేయ‌నున్నట్లుగా శుక్రవారం మున్సిప‌ల్ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధ‌ర్‌బాబు శాస‌న స‌భ‌లో ప్రక‌టించారు. అలాగే వ‌రంగ‌ల్ జిల్లాలోని న‌ర్సంపేట మున్సిపాలిటీలో మ‌రో ఆరు గ్రామాల‌ను విలీనం చేస్తూ ప‌రిధిని విస్తృతం చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. ఎన్నోఏళ్లుగా మున్సిపాలిటీ హోదా కోసం ఎదురు చూస్తున్న కేస‌ముద్రం, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌ వాసుల క‌ల నెర‌వేరిన‌ట్లయింది. కేస‌ముద్రం, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌ ప్రస్తుతం న‌గ‌ర పంచాయ‌తీలుగా కొన‌సాగుతున్నాయి.

మున్సిపాలిటీలు ఏర్పాటు చేస్తామ‌ని ప్రభుత్వం ప్రక‌టించినప్పటికి ఇంకా విధివిధానాలు, కూర్పు పై పూర్తి స్పష్టత ఇవ్వ‌లేదు. గ‌తంలో చేసిన ప్రతిపాన‌ద‌ల ప్రకారం కేసముద్రం టౌన్, కేసముద్రం విలేజ్, అమీనాపురం, ధనసరి, స‌బ్ స్టేష‌న్ తండా గ్రామాలను కలుపుతూ కేసముద్రం మున్సిపాలిటీని ఏర్పాటు చేయ‌నున్నట్లు స‌మాచారం. అలాగే ఛాగల్లు, స్టేషన్ ఘన్​పూర్, శివునిపల్లి గ్రామాల‌ను క‌లుపుతూ స్టేష‌న్ ఘ‌న్‌పూర్ మున్సిపాలిటీ ఆవిర్భవించ‌నుంది. ఇక న‌ర్సంపేట మున్సిపాలిటీలో మ‌రో తొమ్మిది గ్రామాల‌ను విలీనం చేసే ప్రతిపాద‌న‌లు కొన‌సాగుతున్నాయి. అందులో మాదన్నపేట (జ‌నాభా 1586), నాగుర్లపల్లి(1251), మహేశ్వరం(3669), ముగ్దుమ్ పురం (2346), రాజపల్లె(1401), రాములు తండా( 655), పర్శనాయక్ తండా(517), ముత్తోజిపేట(1928), న‌ర్సంపేట మండ‌లంలో ఏకైక ఏజెన్సీ గ్రామ‌మైన రాజుపేట(1403) ఉండ‌నున్నాయి.

ఏళ్లుగా పెండింగ్‌.. నేడు మార్గం..!

కేస‌ముద్రం, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ న‌గ‌ర పంచాయ‌తీల‌ను మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ చేయాల‌నే ప్రతిపాద‌న‌లు చాలా ఏళ్లుగా తెర‌మీద‌కు వ‌చ్చి అట‌కెక్కాయి. 2019లో బీఆర్ఎస్ ప్రభుత్వం రెండో సారి అధికారంలోకి వ‌చ్చాక ఈ రెండు న‌గ‌ర పంచాయ‌తీల‌ను మున్సిపాలిటీలుగా చేయాల‌నే డిమాండ్ బ‌లంగా వినిపించింది. అయితే గ‌త ప్రభుత్వంలో మున్సిప‌ల్ శాఖ మంత్రిగా ప‌నిచేసిన కేటీఆర్ రెండింటిని అప్‌గ్రేడ్ చేస్తామ‌ని హామీ ఇచ్చిన నెర‌వేర్చలేదు. స‌మీప గ్రామాల‌ను క‌లుపుకుంటే రెండుచోట్ల మున్సిపాలిటీ సాధ్యమేన‌నే ప్రతిపాద‌న‌లు అధికారుల నుంచి వెళ్లినా గ‌త ప్రభుత్వం ఎందుక‌నో ప‌ట్టింపు చేయ‌లేదు.

రెండు అర్హత‌లున్నవే..!

నిబంధ‌న‌ల ప్రకారం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలంటే 20 వేల జనాభా పైబడి ఉండాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం స్టేషన్‌ఘన్‌పూర్‌ జనాభా 12,721 మాత్రమే. దీంతో పక్కనే ఉన్న శివునిపల్లి, ఛాగల్‌ను కలుపుకొని మున్సిపాలిటీగా చేయనున్నారు. ఈ రెండు గ్రామాలను కలిపితే 23,483 జనాభా ఉంది. శివునిపల్లిలో 6,242, ఛాగల్‌లో 4,520 జనాభా ఉంది. ఛాగల్‌ విస్తీర్ణం 3115.28 ఎకరాలు, శివునిపల్లి విస్తీర్ణం 1493.25 ఎకరాలు కాగా ఘన్‌పూర్‌ విస్తీర్ణం 5001 ఎకరాలుగా ఉంది. మూడు గ్రామాలు కలిపి 9,609.53 ఎకరాల్లో విస్తరించి ఉంది. దీంతో 9,609.53 ఎకరాల పరిధి విస్తీర్ణం మున్సిపాలిటీ పరిధిలోకి రానుంది. ప్రతిపాదిత కేస‌ముద్రం మున్సిపాలిటీలోనూ 22వేల‌కు పై చిలుకు జ‌నాభా క‌లిగి ఉండ‌టం గ‌మ‌నార్హం. కొద్దిరోజుల కిందట ప్రతిపాదిత మున్సిపాలిటీలు, విలీన గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ జరగగా ఆఫీసర్ల ప్రపోజల్స్ మేరకు రాష్ట్ర పురపాలక శాఖ కూడా కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో శాస‌న స‌భ‌లో కొత్త మున్సిపాలిటీల బిల్లు ప్రతిపాద‌న‌ల‌ను మంత్రి ప్రవేశ‌పెట్టారు. రెండు న‌గ‌ర పంచాయ‌తీలు మున్సిపాలిటీలుగా ఆమోదం పొంద‌డం లాంచ‌న‌మేన‌న్న అభిప్రాయాన్ని అధికార వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

11కు చేరుకోనున్న పుర‌పాల‌క‌ల సంఖ్య..!

ఉమ్మడి వ‌రంగ‌ల్ జిల్లాలో ఇప్పటికే హనుమకొండ జిల్లాలో పరకాల, వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట, నర్సంపేట, మహబూబాబాద్ జిల్లాలో మహబూబాబాబాద్, మరిపెడ, డోర్నకల్, తొర్రూరు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూపాలపల్లి, జనగామ జిల్లాలో జనగామ మున్సిపాలిటీలున్నాయి. తాజాగా స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, కేస‌ముద్రం చేరుతుండ‌టంతో మున్సిపాలిటీల సంఖ్య మొత్తం 11కు చేర‌నుంది. కొన్ని చిక్కుముడులు దాటితే ములుగు జిల్లా కేంద్ర పంచాయ‌తీకి అప్‌గ్రేడ్ ద‌క్కనుంది.

వీటిపైనా దృష్టి.. ప్రతిపాద‌న‌లు..!

ములుగుతో పాటు బండారుపల్లి, జీవంత రావుపల్లి గ్రామాలను కలిపి ములుగు మున్సిపాలిటీ ఏర్పాటుకు అడుగులు వేస్తోంది. హనుమకొండ జిల్లాలో ఆత్మకూరు మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా డెవలప్ చేసేందుకు ప్రతిపాద‌న‌లు జ‌రుగుతున్నాయి. ఆత్మకూరు మండల కేంద్రంతో పాటు ఇదే మండలంలోని తిరుమలగిరి, గూడెప్పాడ్, కామారం, నీరుకుళ్ల, పెంచికలపేట, దుగ్గొండి మండలంలోని కేశవాపురం గ్రామాలను విలీనం చేసి ఆత్మకూరు మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రతిపాద‌న‌లున్నాయి.

వరంగల్ జిల్లాలోని నెక్కొండ మండల కేంద్రంతో పాటు గుండ్రపల్లి, అమీర్ పేట, నెక్కొండ తండా, టీకే తండాల‌తో నెక్కొండ మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాల‌నే ప్రతిపాద‌న‌లున్నాయి. ఇదిలా ఉండ‌గా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టణీకరణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే స్థానిక ఎమ్మెల్యేల అభిప్రాయం మేరకు కొత్తగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల నుంచి ప్రపోజల్స్, ఆబ్జెక్షన్స్ తీసుకున్న మున్సిపల్ శాఖ ఆ తర్వాత గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కూడా నిర్వహించింది. మ‌రికొన్ని మండ‌ల పంచాయ‌తీల‌ను కూడా మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాద‌న‌లు జ‌రుగుతున్నాయి.


Similar News