ఇల్లందులో అక్రమ వెంచర్.. నోటీస్ బోర్డ్ ఏర్పాటు చేయకుండా కాలయాపన

అధికారుల అండదండలతో వెంచర్ నిర్వాకులు కొనుగోలు దారులను బ్రోచర్లతో తప్పుదోవ పట్టిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు.

Update: 2024-07-03 03:50 GMT

దిశ, వర్ధన్నపేట: అధికారుల అండదండలతో వెంచర్ నిర్వాకులు కొనుగోలు దారులను బ్రోచర్లతో తప్పుదోవ పట్టిస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామం నుంచి కక్కిరాలపల్లి గ్రామానికి వెళ్లే రహదారిలో డీటీసీపీ లేఔట్ తో అక్రమ వెంచర్ ను ఏర్పాటు చేశారు. ఇల్లందరు రెవెన్యూ పరిధిలోని సర్వేనెంబర్ 13 ,14 ,16 లో 2-36 గుంటలు 5-30గుంటలు 0.7గుంటలతో కలిపి 8-33గుంటల మామిడి తోటలో వెంచర్ ను ఏర్పాటు చేశారు. డీటీసీపీ లే అవుట్ పొందిన తర్వాత వెంచర్ లో 33 ఫీట్ల రోడ్డు తో పాటు డ్రైనేజీ, విద్యుత్ సౌకర్యం లాంటి సదుపాయాలు కల్పించిన తర్వాత ప్లాట్ల విక్రయం జరపాలి. కానీ ఇవేమి లేకుండా ఇప్పటికే 7నుంచి 8 ప్లాట్లు విక్రయించడం గమనార్హం. వెంచర్ నిర్వహకులు అందమైన బ్రోచర్లతో వినియోగదారులను బోల్తా కొట్టిస్తున్నారు. బ్రోచర్లలో విశాలవంతమైన రోడ్డు, విద్యుత్ స్తంభాలు, చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేసినట్లు చూపించి మోసం చేస్తున్నారు.

అధికారుల కాలయాపన..

సరైన సదుపాయాలు లేకుండా ప్లాట్ల అమ్మకాలు జరిపితే స్థానిక పంచాయతీ కార్యదర్శి వెంచర్ నిర్వాకులకు నిర్ణీత గడువు తేదీతో నోటీసులు జారీ చేయాలి. ఈ నేపథ్యంలో నిర్వాహకులు నిర్లక్ష్యం చేస్తే వెంచర్లో నోటీసు బోర్డు ఏర్పాటు చేసి హద్దు రాళ్లను తొలగించాలి. కానీ ఇవేమీ చేయకుండా స్థానిక పంచాయతీ కార్యదర్శి కాలయాపన చేస్తున్నారు. ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా ఇంటి నిర్మాణం చేయకుండానే ఇంటి నెంబర్లు జారీ చేసినట్లు తెలుస్తోంది.

రైతుల దారి కబ్జా.. ప్రహరీ నిర్మాణం..

రైతులు తమ వ్యవసాయ భూమికి వెళ్లే ఆరు ఫీట్ల బండ్ల బాటను కబ్జా చేసి ప్రహరీ నిర్మాణం చేపట్టారని సోమవారం గ్రామానికి చెందిన మంచోజ్ రాంబ్రహ్మచారి ఎంపీడీవో కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తన వ్యవసాయ భూమి లోకి వెళ్లే బండ్ల బాటను కబ్జా చేసి ప్రహరీ నిర్మించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. దీంతో పాటుగా కోమలి కుంట పంట కాలువను సైతం కబ్జా చేశారని కార్యదర్శికి గతంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.


Similar News