రామ‌ప్ప అద్భుతం..! శిల్ప సౌంద‌ర్యానికి ముగ్దురాలైన రాష్ట్రపతి

రామ‌ప్ప ఆల‌యంలోని శిల్ప సౌంద‌ర్యానికి దేశ ప్రథ‌మ పౌరురాలు ముర్ము ముగ్దురాల‌య్యారు. చారిత్రక కట్టడంలోని శిల్ప క‌ళా నైపుణ్యాన్ని

Update: 2022-12-28 14:48 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో/ ములుగు ప్రతినిధి : రామ‌ప్ప ఆల‌యంలోని శిల్ప సౌంద‌ర్యానికి దేశ ప్రథ‌మ పౌరురాలు ముర్ము ముగ్దురాల‌య్యారు. చారిత్రక కట్టడంలోని శిల్ప క‌ళా నైపుణ్యాన్ని ఈసంద‌ర్భంగా గ‌వ‌ర్నర్ త‌మిళి సై, కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో క‌లిసి కొనియాడారు. బుధ‌వారం మ‌ధ్యాహ్నం 2గంట‌ల 55 నిముషాల‌కు భ‌ద్రాచ‌లం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో రామ‌ప్పకు చేరుకున్న ఆమెకు రాష్ట్ర గ‌వ‌ర్నర్ త‌మిళ సై, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి. పాటిల్, ఐటీడీఏ పీవో అంకిత్ రాష్ట్ర పతి కి హెలిపాడ్ వద్ద స్వాగతం పలికారు.

అనంత‌రం రుద్రేశ్వరుడిని దర్శించుకున్న రాష్ట్రపతి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు రాష్ట్రపతికి ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలను అంద‌జేశారు. అలాగే మేడారం సమ్మక్క సారలమ్మ సారే ( చీర )ను మేడారం ఆదివాసీ పూజారులు రాష్ట్రపతి, గవర్నర్ లకు కానుక‌గా అంద‌జేశారు. ఈసంద‌ర్భంగా రామ‌ప్ప ఆల‌య విశిష్టత‌, నిర్మాణం, యునెస్కో గుర్తింపున‌కు తయారు చేసిన డోసియర్‌ వివరాలు, వరల్డ్‌ హెరిటేజ్‌ బాడి విధించిన నిబంధనలు, తదితర అంశాలను రాష్ట్రపతికి కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు కన్వీనర్ ప్రొఫెస‌ర్‌ పాండురంగారావు వివరించారు. అనంతరం దేవాలయ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదిక వద్ద రూ. 62కోట్లతో ప్రసాద్ స్కీం పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ముఖ్య అతిథులను, వీక్షకులను ఆకట్టుకున్నాయి. పరమశివుని పై పరంపరా బృందం చేసిన ప్రదర్శన ఆధ్యాత్మిక భావన క‌లిగించింది. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి కార్యక్రమాన్ని ముగించారు. సాయంత్రం 4.23 నిముషాలకు కలెక్టర్ కృష్ణ ఆదిత్య, ఎస్పీ సంగ్రామ్ సింగ్ రాష్ట్ర పతి కి వీడ్కోలు పలికారు.

Tags:    

Similar News