ప్రజల భద్రత పోలీసుల బాధ్యత : మహబూబాబాద్ జిల్లా ఎస్పీ

ప్రజల భద్రత పోలీసుల బాధ్యత అని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్

Update: 2024-06-29 14:21 GMT

దిశ, కొత్తగూడ : ప్రజల భద్రత పోలీసుల బాధ్యత అని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ అన్నారు. శనివారం మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ గంగారం మండలంలోని పలు గ్రామాలల్లో తెల్లవారుజామున పోలీసు అధికారులు, భారీ సిబ్బందితో ఏజెన్సీలో చుట్టుముట్టి ప్రతి ఇంటిని అణువణువు తనిఖీ చేస్తూ కార్డెన్‌ సెర్చ్‌ నిర్వహించి దాదాపు 20 లీటర్ల గుడుంబా స్వాధీనం చేసుకొని, 100 లీటర్ల పానకాన్ని ధ్వంసం చేయడం జరిగింది.


ఈ సందర్భంగా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మాట్లాడుతూ...గ్రామంలో చిన్న వయసులోనే కొంతమంది గుడుంబాకు బానిసలుగా మారి ప్రాణాలు పోగొట్టుకుని ఎంతోమంది కుటుంబాలు ఇబ్బందుల పాలు అవుతున్నారని, అంతేకాకుండా ఇంటి యజమాని గుడుంబా తాగి మృతి చెందితే, వారి భార్య పిల్లలు అనాధగా ఏర్పడి వారు ఎంతగానో బాధపడుతున్నారని వారి పిల్లలు చదువులకు ఇతర విషయాలపై పూర్తిస్థాయిలో తండ్రి అవగాహన కల్పించేవారని, తానే మృతి చెందడంతో ఆ కుటుంబం పిల్లలు భార్య రోడ్డుపాలై కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అటువంటి కుటుంబాలను చూసి ఎవరు కూడా గుడుంబాకు బానిస కావద్దు అనే ఉద్దేశంతో ఇక నుంచి ఎవరు కూడా సారాయి పెట్టకుండా చూడాలని ఎవరైనా సారాయి బెల్లం పట్టిక పెట్టి సారాయిని తయారు చేసినచో వారిపై కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ నమోదు చేస్తామన్నారు.


ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, గ్రామాల్లో గుడుంబా నిర్మూలనకు యువత సహకరించాలని, అనుమానిత వ్యక్తులు ఎవరైనా వస్తే సమాచారం అందించాలని గ్రామస్థులకు సూచించడం జరిగింది, ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు అయితే కఠిన చర్యలు తీసుకుంటామని గుడుంబా తయారీ దారులు వారిపై పోలీస్ నిఘా ఉందన్నారు. తరుచూ ఇదే పనిగా చేస్తున్నవారిని గమనిస్తున్నామని,ఎవరైనా బెల్లం, పటిక అమ్మకాలు, రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ మహబూబాబాద్ జిల్లాను గుడుంబా రహిత జిల్లాగా మార్చుటకు అందరూ సహకరించాలన్నారు.

ఏజెన్సీలో ప్రజా సేవలో దర్శనమిచ్చిన ఎస్పీ..

నిత్యం లాఠీలు, తుపాకులతో కనిపించే పోలీసులు ఏజెన్సీ గంగారం మండలంలో ప్రజా సేవలో దర్శనమిచ్చారు. ప్రజల సంక్షేమమే ధ్యేయమన్న పోలీసు నినాదాన్ని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ బలంగా చాటి చెప్పారు. పొనుగొండ్ల గ్రామంలో మొదటగా ప్రసిద్ధిగాంచిన శ్రీ పగిడిద్దరాజు దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు జరిపించి గ్రామంలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు విన్నవించిన సమస్యలను తమ పరిధిలో పరిష్కరిస్తూ, ఇతరత్రా సమస్యల పై సంబంధిత డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచితంగా స్కూల్ బ్యాగులు, నోట్ బుక్ లు యువతకు వాలీబాల్ కిట్ అందించి నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు తగిన శిక్షణ తో పాటు మెటీరియల్ అందించేందుకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కృషి చేస్తామని యువతకు హామీ ఇవ్వడం జరిగింది. చివరిగా చిన్న పిల్లలతో బిస్కెట్లు చాక్లెట్లు పంచి ముచ్చటించి వారిని ఆనందింప చేశారు.


ఆ తర్వాత వారి తల్లిదండ్రులకు మంచి సూచనలు ఇచ్చి మీ పిల్లల్ని తప్పకుండా చదివించండి వారికి కావలసినటువంటి ఎంతటి సహకారానైనా మా పోలీస్ శాఖ అందిస్తుందని భరోసా ను ఇచ్చారు.గ్రామ ప్రజలతో పోలీస్ అధికారులు మమైకాన్ని చూసి గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పోలీసులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతి రావు, ఏ.ఆర్ డీఎస్పీ శ్రీనివాస్ , గూడూరు సీఐ బాబురావు, మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య , గంగారం ఎస్సై రవికుమార్, కొత్తగూడ ఎస్సై దిలీప్, గూడూరు ఎస్సై నగేష్ లతో పాటుగా పలువురు ఆర్ఐ లు, ఆర్ఎస్ఐ లు, గూడూరు సర్కిల్ మరియు స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.

Similar News