ఏజెన్సీలో విజృంభిస్తున్న విష జ్వరాలు

మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం మండలాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు ఏకధాటిగా కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు దడ పుట్టిస్తున్నాయి.

Update: 2024-09-09 12:13 GMT

దిశ, కొత్తగూడ : మహబూబాబాద్ జిల్లా ఏజెన్సీ మండలాలైన కొత్తగూడ, గంగారం మండలాల్లో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. వర్షాకాలం సీజన్ ప్రారంభం నుంచి వర్షాలు ఏకధాటిగా కురుస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో సీజనల్ వ్యాధులు దడ పుట్టిస్తున్నాయి. ఏజెన్సీమండలాల్లోని గ్రామ గ్రామాన మొత్తం జనాలు జ్వరాలతో మంచాన పడుతున్నారు. అందీఅందని వైద్యంతో మృత్యువాత పడుతున్నారు. ప్రజల పరిస్థితి నానాటికీ దారుణంగా తయారవుతోంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం దొరకట్లేదు, ప్రైవేటు ఆసుపత్రిలో చూయించుకోవాలంటే డబ్బులు లేక సరైన వైద్యం అందక మృత్యువాత పడుతున్నారు.

పట్టణాలు, పల్లెలు పరిశుభ్రతతో ఉండాలనే ధ్యేయంతో రాష్ట్ర ప్రభుత్వం 'స్వచ్ఛదనం, పచ్చదనం' కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. కానీ ఏజెన్సీ మండలాల్లాలోని గ్రామాల్లో ఈ కార్యక్రమాన్ని తూతూమంత్రంగా నిర్వహించిన అధికారులు చేతులు దులుపుకున్నారు. దీంతో పల్లెలు పారిశుద్ధ్య లోపంతో కొట్టుమిట్టాడుతున్నాయి. దోమలు విజృంభించి జనాలు విష జ్వరాలతో మంచం పట్టి పిట్టల్లా రాలుతున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా డెంగ్యూ, మలేరియా, రక్త కణాలు తగ్గడం వంటి విషజ్వరాలతో ఏజెన్సీ మండలాల్లో ప్రజలు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. గత మూడు నెలల వ్యవధిలోనే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ, గంగారం మండలాల్లో హనుమన్ తండా, గుంజేడు, బావురుగొండ, కామరాం, గాంధీనగర్ గ్రామాలలో విష జ్వరాల బారిన పడి మృత్యు వాత పడి వారి కుటుంబాలలో శోకాన్ని మిగిల్చింది.

వర్షాకాలం ప్రారంభంలోనే మంత్రి సీతక్క ఇలాఖ అయిన ఉమ్మడి మండలాలపై ప్రత్యేక చొరువ చూపాలని అధికారులను ఆదేశించారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రతిష్టాత్మకంగా చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులను అప్రమత్తం చేసి జాగ్రత్తలు తీసుకొనేందుకు ఆదేశాలు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో మండల అధికారులు ప్రణాళికలు చేపట్టి ముందస్తు చర్యలు ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ వైద్య శిబిరాలు నిర్వహించినా లాభం లేకుండా పోతుంది. మండల వైద్య అధికారుల సమక్షంలో గ్రామ గ్రామాలలో వైద్య శిబిరాలు నిర్వహించినా, ఓ వైపు శిబిరాలు నిర్వహిస్తుండగా మరో వైపు విష జ్వరాల బారిన పడి మృత్యువాత పడుతున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు ప్రజలకు అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేసి వైద్య శిబిరాలు నిర్వహించినా పూర్తి స్థాయిలో ఫలితం లేకపోవడం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. స్థానిక ఆసుపత్రులలో సరిపోను సిబ్బందిని అందుబాటులో ఉంచి, నాణ్యమైన మందులు సరఫరా చేసి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీజనల్లో నిరంతర వైద్య శిబిరాలను నిర్వహిస్తే మృత్యువాతలను అడ్డుకట్ట వేయవచ్చు అని స్థానికులు అంటున్నారు.

విష జ్వరాల మరణాలతో భయమేస్తుంది -ఈ శ్రీశైలం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సబ్ డివిజన్ కార్యదర్శి


వర్షాకాలం ప్రారంభం నుండి సీజనల్ వ్యాధులతో వణికిపోతున్నాము. కురిసిన వర్షాలకు ఏజెన్సీ ఉమ్మడి మండలాల గ్రామాల్లో ఇంటికి ఒక్కరికి జ్వరాలు వచ్చి మంచాన పడుతున్నారు. సాధారణ జ్వరం వచ్చింది ఆనుకొని ఆసుపత్రికి వెళితే పరిక్షలు చేసి డాక్టర్లు రక్తకణాలు తగ్గాయి. అని తెలిపి అక్కడ నుండి మరో ఆసుపత్రి వెళ్లే లోపు మరణిస్తున్నారు. విష జ్వరాల వల్ల వరుస మరణాలతో వణికిపోతున్నాము.

నాణ్యమైన వైద్యం అందించాలి - దండు ప్రవీణ్ గుండం గ్రామ యువకుడు


ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్యం అందక అప్పుల చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పరుగులు తీయాల్సి వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యుల కొరతతో వచ్చిన రోగులకు సరైన వైద్యం అందట్లేదు. మందులు అందుబాటులో లేకపోవడంతో ఉన్న కొద్దిపాటి మందులతో వైద్యులు సరిపుచ్చుకోకపోవడంతో రోగం నయం కాకపోవడం వల్ల ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించక ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

విజృంభిస్తున్న సీజనల్ వ్యాధులు-వాసం సారయ్య బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు


గ్రామాల్లో సీజనల్ వ్యాధులు విజృంభిస్తు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. గ్రామాలలో పాలక వర్గాల పాలన లేక పారిశుధ్యం ఏర్పడి వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రత్యేక అధికారుల తీరుతో గ్రామాల్లో పారిశుధ్యం పేరుకుపోయి మురికి కాలువలో దోమల బెడద, గ్రామాల్లోని వీధుల్లో పిచ్చి మొక్కలు పెరిగి వ్యాధుల బారిన పడి అవి కాస్త విష జ్వరలుగా మారి ప్రాణాలు పోతున్నాయి. గ్రామాల్లో ఇంత వరకు బ్లీచింగ్ చల్లడం గాని ఫాగ్ చేయడం గాని దోమ తెరల పంపిణీ చేసిన పాపాన పోలేదు.

తగు జాగ్రత్తలు తీసుకోవాలి - వైద్య అధికారి శివ ప్రసాద్

మండలంలో వ్యాధుల నివారణకు విస్తృత చర్యలు చేపడుతున్నాం. ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు నిర్వహించేందుకు ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నాం. ఇంటింటా తిరుగుతూ జ్వర సర్వే నిర్వహిస్తున్నాం. మలేరియా లక్షణాలున్నవారి నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నాం. పాజిటివ్ నమోదైన వారికి చికిత్స అందిస్తున్నాం. వ్యాధుల పట్ల ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఏ సమస్య ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.


Similar News