Mamidala Yashaswini Reddy : ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి అభివృద్ధికి దోహదపడాలి
గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాల అభివృద్ధి కోసం
దిశ,రాయపర్తి : గ్రామాల్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారం కోసం గ్రామాల అభివృద్ధి కోసం ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధి కోసం కృషి చేయాలని పాలకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే మామిండ్ల యశస్విని రెడ్డి కోరారు. మంగళవారం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రజావేదిక కార్యక్రమాన్ని మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి హాజరై మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని అందుకు అనుగుణంగా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేసి మండల అభివృద్ధికి దోహదపడాలన్నారు. పార్టీలకు అతీతంగా లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేయాలన్నారు. మండలంలోని పేరుకుపోయిన సమస్యలపై అధికారులు ప్రజాప్రతినిధులు తన దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. మండల అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తాను ప్రజలకు సేవ చేయడానికి వచ్చాను అని తన సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని ఆమె కోరారు.
ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఇబ్బంది ఎదురు కాకుండా చూసుకోవాలని వారికి నిర్ణయించిన గడువు లోపు డబ్బులు అందజేయాలని పీడీ ని ఆదేశించారు. ఎవరైనా అవకతవకలకు పాల్పడినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జినుగు అనిమిరెడ్డి జడ్పీటీసీ రంగు కుమార్ పీడీ సంపత్ రావు ఎంపీడీవో కిషన్ తహసీల్దార్ శ్రీనివాస్ వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.