భర్త కొలువులో భార్య.. వరంగల్ బల్దియాలో అధికారుల వింతలు
భర్త పేరిట కొలువు, కానీ నౌకరి చేసేది మాత్రం భార్య. ఇదీ గ్రేటర్ వరంగల్ బల్దియాలో కొన్నేళ్లుగా సాగుతున్న బాగోతం.
దిశ, వరంగల్ టౌన్ : భర్త పేరిట కొలువు, కానీ నౌకరి చేసేది మాత్రం భార్య. ఇదీ గ్రేటర్ వరంగల్ బల్దియాలో కొన్నేళ్లుగా సాగుతున్న బాగోతం. ఇలా ఒకరిద్దరు కాదు, ప్రజారోగ్యం విభాగంలో పదుల సంఖ్యలో ఉద్యోగాలు వెలగబెడుతున్నట్లు వరంగల్ మహానగర పాలక సంస్థలో బాహాటంగానే చర్చ జరుగుతోంది. ఈ విషయం బల్దియాలో గుప్పుముంటున్నా ఉన్నతాధికారులు, పాలకాధినేతలు గానీ పట్టించుకునే పరిస్థితుల్లో లేరని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకు నకిలీ ఉద్యోగులకు కొందరు అధికారుల అండదండలు ఉండడమే కారణంగా చెప్పుకుంటున్నారు. వరంగల్ బల్దియాలో ప్రజారోగ్య విభాగంలో ఓ వ్యక్తి 2011లో ఉద్యోగిగా నియామకమయ్యాడు. కొంతకాలం పని చేసిన అతడు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఏం జరిగిందో, ఎలా జరిగిందో గానీ అతడు ఉద్యోగానికి రావడం లేదు. అతడికి బదులు ఆయన భార్య పని చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల నుంచి ఆమె ఉద్యోగం చేస్తోంది. ప్రస్తుతం కాజీపేట జోనల్ పరిధిలో హన్మకొండలోని కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తోంది. ప్రతినెలా ఆమె భర్త పేరిట వేతనం జారీ అవుతుంది. అయితే, ఈ విషయమై ఆరా తీయగా అప్పటి మున్సిపల్ కమిషనర్ సర్పరాజ్ అహ్మద్ ఆదేశాలున్నట్లు చెబుతున్నారే తప్ప ఎలాంటి ఆధారాలు చూపకపోవడం గమనార్హం. అంతేకాదు ఆమె ఒక్కరే కాదు, అలా చాలామంది బల్దియాలో కొలువులు వెలగబెడుతున్నారనే నిర్లక్ష్యపు సమాధానం ఎదురుకావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కొందరు కార్పొరేటర్ల కొడుకులు, బంధువులకు కూడా బల్దియాలో నౌకర్లు ఉండగా, వారు పనులకు రాకుండా మరొకరితో చేయించి నెలనెలా వేతనాలు పొందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
అటెండెన్స్ నమోదు సిబ్బందికి చత్వారమా?
అసలైన ఉద్యోగులు పనికి రాకున్నా నెలనెలా అటెండెన్స్ నమోదు చేసి వేతన జారీకి సిఫారసు చేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యానికి ఈ వ్యవహారం నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నది. ఉన్నతాధికారుల కనుసన్నల్లోనే ఈ బాగోతం నడుస్తున్నట్లు అవగతమవుతోంది. అందుకే కిందిస్థాయి సిబ్బంది కూడా పట్టించుకోకుండా గుడ్డిగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకపక్క ఉద్యోగాల కోసం యువత అష్టకష్టాలు పడుతుంటే ఒకరికి బదులు మరొకరితో పనులు చేయిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వరంగల్ బల్దియా తీరుపై పలువురు దుమ్మెత్తిపోస్తున్నారు.
చెత్త ఆలోచనే..
నకిలీ ఉద్యోగుల విషయంలో అధికారులు పట్టించుకోకపోవడానికి ఒక చెత్త ఆలోచనే కారణంగా చెబుతున్నారు. ఇప్పుడు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న నకిలీ ఉద్యోగులు మొదట ప్రజారోగ్యం - శానిటేషన్ విభాగంలో పనికి నియమితులైనట్లు తెలుస్తోంది. వారి వేతన స్లిప్పుల్లోను అదే డెసిగ్నేషన్ ఉంటోంది. ఈ క్రమంలో వారు చేసేది చెత్త పనే కదా అని అధికారులు ఈ నకిలీ ఉద్యోగులపై ఉదాసీనతతో వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అవకాశంగా భావించి నకిలీ ఉద్యోగులు యథేచ్ఛగా చలామణి అవుతున్నట్లు చర్చ జరుగుతోంది. ఈ విషయమై ఉన్నతాధికారులతోపాటు విజిలెన్స్ అధికారులు దృష్టి సారిస్తే నకిలీ ఉద్యోగుల బాగోతం బట్టబయలవుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో కొలువులు అమ్ముకున్నారనే అపవాదు మూటగట్టుకున్న వరంగల్ మహానగర పాలక సంస్థ పాలకులు, అధికారులు ఈ నకిలీ ఉద్యోగుల వ్యవహారంపై ఏవిధంగా స్పందిస్తారో? ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచిచూడాల్సిందే.