మాటల మనిషిని కాదు,ని చేతల మనిషిని : ఎమ్మెల్యే రేవూరి

ప్రజా ప్రతినిధుల పదవికే విరమణ కానీ రాజకీయంలో

Update: 2024-07-03 13:25 GMT

దిశ,గీసుగొండ: ప్రజా ప్రతినిధుల పదవికే విరమణ కానీ రాజకీయంలో పదవి విరమణ ఉండదని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ప్రజలకు సేవ చేసే వారికి పదవి తో సంబంధం లేదని ప్రజాక్షేత్రంలో ఉన్నవారు ఎప్పటికీ ప్రజల మన్ననలు పొందుతారన్నారు. గీసుగొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సమావేశం ఎంపీపీ భీమ గాని సౌజన్య ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎంపీపీ బీమగాని సౌజన్య మాట్లాడుతూ.. నేను ఎంపీపీగా గెలుపొందిన గత ఐదు సంవత్సరాల నుండి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నానని ఎన్నో విమర్శలకు,అవహేళనలు గురయ్యానని అయిన తనకు ధైర్యం చెప్పుకుంటూ, వెన్ను తట్టి ముందుకు నడిపిన నా భర్త రామచంద్ర గౌడ్ కి,ఎలుకుర్తి గ్రామ ప్రజలకు,మండల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ జిల్లాలో మండలాన్ని ఉత్తమ మండలంగా నిలబెట్టి ఉత్తమ అవార్డును అందుకున్నానని దానికి సహకరించిన మండల కార్యదర్శిలకు మండల స్థాయి అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. పదవీ కాలం ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు సరైన న్యాయం చేయలేక పోయానని అధికారం వచ్చిన తర్వాత పదవి కాలం ముగుస్తున్నా ఎమ్మెల్యే మండలాన్ని అభివృద్ధి పరుస్తారని నమ్మకం ఉందని ఆమె అన్నారు.ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాప్రతినిధుల వల్ల పదవికి అలంకరణ ఉండాలి కానీ పదవిని అడ్డుపెట్టుకొని తన పంతాన్ని నెగ్గించుకోవడం అహంకార ధోరణికి అద్దం పడుతుందని అన్నారు. రాజకీయాలలో పదవికే విరమణ ఉంటుంది కానీ రాజకీయాలకు విరమణ ఉండదని అన్నారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను హామీలకు కట్టుబడి ప్రజల కోసం పనిచేసే నాయకులకు ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని అన్నారు. తనను ఎమ్మెల్యేగా గెలిపించిన కార్యకర్తలకు పరకాల ప్రజల రుణం కచ్చితంగా తీర్చుకుంటానని అది దొడ్డిదారిలో కాకుండా రాజ్య మార్గంలోనే కార్యకర్తల రుణం తీర్చుకుంటానని, తను మాటల మనిషిని కాదని చేతల మనిషినని రేవూరి అన్నారు.

ఈ సందర్భంగా ఎంపీటీసీల పదవీకాలం ముగియడంతో ఎంపీపీ బీమ గాని సౌజన్య,వైస్ ఎంపీపీ రడం శ్రావ్య భరత్ కుమార్ లకు శాలువా కప్పి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఎండి రియాజుద్దీన్,ఎంపీడీవో కృష్ణవేణి, ఎంపీఓ ప్రభాకర్, పంచాయతీరాజ్ ఏఈ సుధాకర్, విద్యుత్ శాఖ ఏఈ సంపత్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ పరకాల అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి, జిల్లా నాయకులు వీరగోని రాజ్ కుమార్,రడం భరత్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు ఆకుల రుద్ర ప్రసాద్,సొసైటీ చైర్మన్లు మండల వీరస్వామి,రడం శ్రీధర్,ఆయా గ్రామాల ఎంపీటీసీలు,ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.


Similar News