కారు వదిలి కాంగ్రెస్‌లో చేరిన నవీన్‌రాజ్‌

వరంగల్‌ తూర్పు బీఆర్‌ఎస్‌లో కీలక నాయకుడిగా చెప్పుకునే గోపాల నవీన్‌రాజ్‌ ఆ పార్టీని వీడారు.

Update: 2023-11-11 07:31 GMT

దిశ, వరంగల్‌ టౌన్‌ : వరంగల్‌ తూర్పు బీఆర్‌ఎస్‌లో కీలక నాయకుడిగా చెప్పుకునే గోపాల నవీన్‌రాజ్‌ ఆ పార్టీని వీడారు. తన సొంతగూటి(కాంగ్రెస్‌)లో చేరిపోయారు. ఆయనతో పాటు కార్పొరేటర్‌ గుండేటి నరేందర్‌, కేడల పద్మ జనార్ధన్‌, రామ తేజశ్రీ శిరీష్, మాజీ కార్పొరేటర్లు లక్ష్మణ్‌, బాసాని శ్రీనివాస్‌, బత్తిని వసుంధర, కేడల పద్మ, జన్ను ప్రసన్న, గోరంటల రాజు, మాజీ మార్కెట్‌ డైరెక్టర్‌ తోట వేణుగోపాల్‌, యూత్‌ నాయకుడు బిల్లా పవన్‌ కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు.

కాంగ్రెస్‌ జిల్లా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు ఆధ్వర్యంలో వీరందరికీ టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్‌ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వరంగల్‌ తూర్పులో కాంగ్రెస్‌ నుంచి కొండా సురేఖ పేరు వినపడగానే.. ఆమె భర్త మురళీధర్‌రావు వ్యూహం పన్నుతూ వచ్చారు. ఈ క్రమంలో తన ఆత్మీయ అనుచరుడైన నవీన్‌రాజును తిరిగి కాంగ్రెస్‌లో చేర్చుకోవడంతో ఆ పార్టీకి బలం చేకూరినట్లుగా పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాగా, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి నన్నపునేని నరేందర్‌ క్యాంపులో కాస్త కలకలం రేపుతోంది. నవీన్‌రాజ్‌ వెంట ఉన్న బీఆర్‌ఎస్‌ శ్రేణల బాటలో మరింతమంది వెళ్లనున్నట్లు జరుగుతున్న ప్రచారంతో గులాబీగూటిలో ముసలం మొదలైంది.

Tags:    

Similar News