ముడాగా మానుకోట‌…

గిరిజ‌న జిల్లా మ‌హ‌బూబాబాద్‌లో ప‌రిపాల‌న, అభివృద్ధి అంశాల్లో మ‌రో కీల‌క ముంద‌డుగు ప‌డింది.

Update: 2024-10-26 16:28 GMT

దిశ‌, వ‌రంగ‌ల్ బ్యూరో: గిరిజ‌న జిల్లా మ‌హ‌బూబాబాద్‌లో ప‌రిపాల‌న, అభివృద్ధి అంశాల్లో మ‌రో కీల‌క ముంద‌డుగు ప‌డింది. జిల్లాలో ప‌ట్ట‌ణీక‌ర‌ణ‌ను క్ర‌మ ప‌ద్ధ‌తిలో ముందుకు తీసుకెళ్లేందుకు, స‌మ‌గ్ర‌మైన అభివృద్ధి ప‌నుల‌ను చేప‌ట్టేందుకు వీలుగా రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణాభివృద్ధి ప్రాధికారిక సంస్థ‌(ముడా)ను ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్రంలో కొత్త‌గా 18 ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌ల‌ను ఏర్పాటు చేయ‌గా ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలోని మ‌హ‌బూబాబాద్‌ చోటు ద‌క్కించుకుంది. ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లాలో రెండో ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌గా ముడా ఆవిర్భ‌వించిన‌ట్ల‌యింది. గ‌త కొద్దిరోజుల క్రితం జిల్లా క‌లెక్ట‌ర్ల నుంచి రాష్ట్ర ప్ర‌భుత్వం నివేదిక కోర‌గా, త‌ద‌నుగుణంగా రిపోర్టులు అంద‌జేశారు. ఈమేర‌కు ఈనెల 15న రాష్ట్ర ప్ర‌భుత్వం యూడీఎఫ్‌ల ఏర్పాటుపై గెజిట్ జారీ చేసింది. ఇందుకు సంబంధించిన జీవోను శుక్ర‌వారం విడుద‌ల చేసింది.

నాలుగు మున్సిపాలిటీలు... 159 గ్రామాలు..!

మ‌హ‌బూబాబాద్ జిల్లాలోని మ‌హ‌బూబాబాద్‌, డోర్న‌క‌ల్‌, మ‌రిపెడ‌, తొర్రూరు మునిసిపాలిటీల‌తో పాటు ఆయా మండ‌లాల్లోని 159 గ్రామాలు మ‌హ‌బూబాబాద్ ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ ప‌రిధిలోకి రానున్నాయి. మ‌హ‌బూబాబాద్ మండ‌లంలోని 18 గ్రామాలు, కుర‌వి మండ‌లంలోని 15, కేస‌ముద్రం మండ‌లంలోని 14, సీరోలు మండ‌లంలోని 6, డోర్న‌క‌ల్ మండ‌లంలోని 10, చిన్న‌గూడూరు మండ‌లంలోని 5, మ‌రిపెడ మండ‌లంలోని 17, న‌ర్సింహుల‌పేట మండ‌లంలోని 8, దంతాల‌ప‌ల్లి మండ‌లంలోని 10, నెల్లికుదురు మండ‌లంలోని 12, ఇనుగుర్తి మండ‌లంలోని 05, పెద్ద‌వంగ‌ర మండ‌లంలోని 09, తొర్రూరు మండ‌లంలోని 20 గ్రామాలు ముడా ప‌రిధిలోకి రానున్నాయి.ఈ యూడీఏ పరిధిలో త్వరలోనే బిల్డింగ్‌, లేఅవుట్‌ ఫీజులు, ఇతర అంశాలపై మార్గదర్శకాలు జారీ కానున్నాయి. యూడీఏ లతో మౌలిక వసతుల కల్పన, పరిశ్రమల ఏర్పాటుతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

త్వ‌ర‌లోనే పాల‌క మండ‌లి క‌మిటీ..!

ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ‌ను ముందుకు నడిపించేందుకు జిల్లా క‌లెక్ట‌ర్‌ను చైర్మ‌న్‌గా, స్థానిక సంస్థ‌ల అద‌న‌పు క‌లెక్ట‌ర్ వైస్ చైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రిచ‌నున్నారు. అలాగే ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌ర్రీ లేదా ఆయ‌న నియ‌మించే అధికారి స‌భ్యుడిగా ఉంటారు. మొత్తం ముగ్గురు రాష్ట్ర స్థాయి మునిసిప‌ల్ అడ్మినిస్ట్రేష‌న్ అధికారులు కొన‌సాగ‌నున్నారు. ప‌ట్ట‌ణాభివృద్ధి సంస్థ ఏర్పాటుతో ఇక‌పై మ‌హ‌బూబాబాద్ జిల్లా కేంద్రంతో పాటు మునిసిపాలిటీ, వాటి ప‌రిస‌ర గ్రామాల్లో స‌మ‌గ్ర‌మైన అభివృద్ధికి అడుగులు ప‌డ‌నున్నాయి. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని ప్లాన్‌ల‌ను ముడా రూపొందిస్తుంది. ప్ర‌భుత్వ భూముల్లో లే అవుట్ల‌ను ఏర్పాటు చేయ‌డంతో వ‌చ్చిన ఆదాయాన్ని ప‌ట్ట‌ణాభివృద్ధికి వెచ్చించ‌నుంది. గ్రామ పంచాయ‌తీ, మండ‌ల‌కేంద్రం, తాలుకా, జిల్లా కేంద్రంగా అంచ‌లంచెలుగా అప్‌గ్రేడ్ అవుతూ వ‌చ్చిన మానుకోట ప‌ట్ట‌ణం.. ఇప్పుడు ముడాగా ఏర్పాటు కావ‌డంతో జిల్లావాసులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.


Similar News