ముత్తిరెడ్డి అండతోనే సోలిపురంలో దాడులు..
జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురం గ్రామంలో స్థానిక జడ్పీటీసీ భర్త వెంకట్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన బావమరిది గుజ్జా సంపత్ రెడ్డిల అండదండలతో కురుమల పై దాడులకు పూనుకుంటున్నాడని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ఆరోపించారు.
దిశ, జనగామ : జనగామ జిల్లా తరిగొప్పుల మండలం సోలిపురం గ్రామంలో స్థానిక జడ్పీటీసీ భర్త వెంకట్ రెడ్డి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన బావమరిది గుజ్జా సంపత్ రెడ్డిల అండదండలతో కురుమల పై దాడులకు పూనుకుంటున్నాడని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ఆరోపించారు. సోలిపురం గ్రామంలో ఇటీవల జరిగిన భూ తగాదాలో వెంకట్ రెడ్డి, ఆయన అనుచరులు కురుమల పై దాడి చేయగా గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. అనంతరం జనగామ ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సోలిపురంలోని సర్వేనెంబర్ 54లో వెంకట్ రెడ్డికి 6 ఎకరాల భూమి ఉందని స్థానికులతో కలిసి కురుమల పై దాడులకు పూనుకోవడం సరైనది కాదన్నారు. ఇప్పటికైనా ఈ తగాదాలను విరమించుకోవాలని సూచించారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆయన బామ్మర్ది బుజ్జ సంపత్ రెడ్డిల అండదండలతో వెంకటరెడ్డి దాడులకు పూనుకున్నాడని, కురుమలకు న్యాయం జరగకపోతే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తారని ఆయన హెచ్చరించారు. ఆ భూములు కురుమ కులస్తులకు తాతలు కొనుగోలు చేయగా వారసత్వంగా సంక్రమించినవని అని అన్నారు. కాగితాలు లేనంత మాత్రాన వెంకట్ రెడ్డి దాడులకుదిగి భూములు లాక్కోవాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. వెంకట్ రెడ్డి ఆయన అనుచరులు 6 ఎకరాల భూమిని ఆక్రమించి, ట్రాక్టర్ లతో దున్ని ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించాడని, వారి అక్రమ కబ్జాను అడ్డుకుంటే కర్రలు, రాళ్లతో దాడి చేశారని తెలిపారు.
కురుమల జోలికి వస్తే సహించేది లేదని అన్నారు. ముత్తిరెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ టికెట్ ఇచ్చినా కురమల మద్దతు లేకుండా గెలవలేడన్నారు. కురుమలు ఆత్మగౌరవంతో బ్రతకాలని రూ. 1100 కోట్లతో సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణి కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. సోలిపురం కురుమలకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, కలెక్టర్ శివలింగయ్య, సీపి రంగనాథ్ న్యాయం చేయకపోతే సీఎం దగ్గరకి పోతామని స్పష్టం చేశారు. కురుమలు ధైర్యంగా ఉండాలని అన్నారు. ఆయన వెంట కురుమసంఘం నాయకులు సేవెల్లి సంపత్, కంచ రాములు, రాష్ట్ర కమిటీ నాయకులు ఉన్నారు.