శ్మశానంలో అస్థికల ముంతలు మాయం..!
నర్సంపేట పట్టణంలోని శ్మశానవాటికలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నదిలో కలపడానికి చిన్న ముంతలో భద్రపరిచే అస్థికలు మాయం అవుతుండటం కలకలం రేపుతోంది.
దిశ, నర్సంపేట: నర్సంపేట పట్టణంలోని శ్మశానవాటికలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నదిలో కలపడానికి చిన్న ముంతలో భద్రపరిచే అస్థికలు మాయం అవుతుండటం కలకలం రేపుతోంది. దహన సంస్కారాల అనంతరం దినాల రోజు సదరు వ్యక్తుల అస్థికలను జాగ్రత్తగా భద్రపరిచి నదిలో కలవడం ఆనవాయితీగా వస్తున్న సంగతి తెలిసిందే. తమ స్థోమతను బట్టి అస్థికలను గోదావరి (కాళేశ్వరం), గంగా (కాశీ) వంటి వివిధ నదుల్లో కలపడం వల్ల చనిపోయిన వారి ఆత్మ తృప్తి చెందుతుందన్న నమ్మకం మెజారిటీ ప్రజల్లో ఉందనేది కాదనలేం. ఇదిలా ఉండగా... తమ ఆప్తులు మృతి చెందిన బాధ ఒకవైపు ఉండగా మరోవైపు భద్రపరిచిన వారి అస్థికలు మాయం అవుతుండటం వారిని మరింత కృంగదీస్తోన్న పరిస్థితి నెలకొంది. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని శ్మశాన వాటిక ఈ సంఘటనలకు వేదికైంది.
మనోవేదనకు గురవుతున్న కుటుంబాలు..!
నర్సంపేట పట్టణంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా గల మాదన్నపేట గ్రామానికి వెళ్లే వైపుగా శ్మశాన వాటిక ఉంది. ఇందులో అస్థికలు భద్రపరిచిన ముంతలు పగలగొట్టేస్తున్న ఆనవాళ్లు ఉన్నాయి. సాధారణంగా చనిపోయిన వారి కుటుంబీకులు దినాల రోజున భద్రపరిచి, నెల తిరిగేలోగా అస్థికలను నదిలో కలపడం ఆనవాయితీ. ఇది ఏండ్లుగా పాతుకుపోయిన సెంటిమెంట్. అస్థికలు మాయం అవుతుండటంతో సదరు కుటుంబీకులు మనోవేదనకు గురవుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఏమీ చేయలేని పరిస్థితిలో తీవ్ర నైరాశ్యానికి లోనవుతున్నారు.
అస్థికల మాయం ఎవరి పని..?
నర్సంపేట నుండి మాదన్నపేట గ్రామం వెళ్లే వైపుగా శ్మశాన వాటిక, పోస్ట్ మార్టం గది ఒకే దగ్గర ఉన్నాయి. ఈ నేపథ్యంలో పగలు, రాత్రిళ్ళు చనిపోయిన వారి పోస్ట్ మార్టం కోసం జనాలు వస్తుంటారు. ఈ క్రమంలో రాకపోకలు రాత్రిళ్ళు సైతం ఉండటం ఆకతాయిలకు, మందుబాబులకు వీలు కలిగేలా ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి. నదిలో కలపడం కోసం చెట్లకు వేలాడదీసిన అస్థికల ముంతలు స్మశాన ఆవరణలోనే ఓ వైపుగా పగిలి ఉండటం అనుమానాలకు తావిస్తోంది. ముంతలో వేసే చిల్లర కోసం ఈ ఘటనలు జరుగుతున్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది. పోలీస్ స్టేషన్ కి కూతవేటు దూరంలో ఉన్న ఈ శ్మశాన వాటిక చుట్టూ బెల్ట్ షాపులతో సహా, గుడుంబా విక్రయం జరుగుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే తాగుడుకు బానిసైన వాళ్ళు చేస్తున్న పనేనని చర్చ జరుగుతోంది. ఏదేమైనా చనిపోయిన వ్యక్తి చివరి కార్యం కాస్త ఇలా అవుతుండటం స్థానికులను సైతం మనోవేదనకు గురయ్యేలా చేస్తోంది. ఈ ఘటనపై అధికారులు స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.