కహానీలు చెప్పడం తప్ప కిషన్‌రెడ్డి దేనికీ పనికిరాడు: వినయ్ భాస్కర్

రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అత్యంత...MLA Vinay Bhasker Hits out at BJP and Kishan Reddy

Update: 2022-12-24 13:12 GMT

దిశ, హనుమకొండ టౌన్: రాష్ట్ర పునర్విభజన చట్టంలోని కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై అత్యంత దుర్మార్గంగా, అహంకార పూరితంగా రాజ్యసభలో సమాధానమిచ్చారంటూ కేంద్ర వైఖరిని వ్యతిరేకిస్తూ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ధ్వజమెత్తారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్, మాజీ పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్ పాల్గొని మాట్లాడారు.

చీఫ్ విప్ మాట్లాడుతూ..

'కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ సాధ్యం కాదన్న బీజేపీకి తెలంగాణలో స్థానం లేదు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీపై తెలంగాణ ప్రజలు పెట్టుకున్న కలలను బీజేపీ కల్లలు చేసింది. అప్పట్లో కాంగ్రెస్ చేసిన ద్రోహాన్నే ఇపుడు బీజేపీ చేస్తుంది. పార్లమెంటు చేసిన చట్టంలో ఉన్న హామీలకే దిక్కు లేకపోతే ఈ దేశంలో రాజ్యాంగం ఉన్నట్టా లేనట్టా..? కోచ్ పరిశ్రమల అవసరం దేశంలో ఇకలేదని అస్సాం రాష్ట్రంలోని కోక్రాజహార్ ప్రాంతానికి ఎలా కేటాయిస్తారు? రాజ్యాంగంపై, దర్యాప్తు సంస్థలపై బీజేపీ మోడీ ప్రభుత్వం పదునైన కత్తులతో దాడి చేస్తుంది. అన్నీ గుజరాత్ కు తరలించుకుపోతున్న బీజేపీని తెలంగాణ నుంచి తరలించాలి, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా పనికిరాడు. కట్టు కథలు, కహానీలు చెప్పడం తప్ప ఆయనకు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని నిలదీసే దమ్ము, ధైర్యం లేదు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మేము ఆనాడు రాజీనామాలు చేస్తే కిషన్ రెడ్డి విదేశాలకు పారిపోయిన వ్యక్తి ఈ రోజు కేంద్ర మంత్రిగా తెలంగాణకు ఏమి చేయలేడు. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీపై అసత్య ప్రచారాలు చేస్తున్నారంటూ' బీజేపీ నాయకులకు ఈ సందర్భంగా చీఫ్ విప్ సవాలు విసిరారు.

కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించిన విషయం పట్ల అసత్య ప్రచారం చేస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రకాళి అమ్మవారి సాక్షిగా ప్రమాణానికి రావాలని సవాలు చేశారు. బయ్యారం ఫ్యాక్టరీ వీలు కాదన్నారు.. ఇపుడు కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కుదరదు అంటున్నారు.. వద్దు, రద్దుల విధానాన్ని పాటిస్తూ బీజేపీ అన్ని హద్దులు దాటుతోందన్నారు. సుధీర్ఘ తెలంగాణ ఉద్యమ ప్రయాణంలో ఎంతో మంది ప్రత్యేక రాష్ట్ర వ్యతిరేకులైన హేమహేమీలను మట్టి కరిపించిన చరిత్ర తెలంగాణ గడ్డదన్నారు. గంత చేసినోల్లం మా ప్రయోజనాలను మేము కాపాడుకునేందుకు ఎవల్తోనైనా కొట్లాడుతాం.. మా హక్కులను సాధిస్తాం..! అని అన్నారు. ఆది నుండి తెలంగాణ రాష్ట్రంపై అక్కసును కక్కుతున్న బీజేపీ వల్ల తెలంగాణకు ఒరిగేదేమీ లేదు అని తేలిపోయిందన్నారు. కేంద్రంలో మళ్ళీ బీజేపీ వస్తే తెలంగాణకు తీరని నష్టం తప్పదన్నారు. దేశంలో బి.ఆర్.ఎస్ పార్టీ బలోపేతంతోనే దేశానికి ప్రయోజనం, తెలంగాణను అడగడుగున అవమానిస్తూ ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న బీజేపీకి తగిన గుణ పాఠం చెప్పే సమయం ఆసన్నమైందన్నారు.

వరంగల్ పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ మాట్లాడుతూ..

'పార్లమెంట్ సాక్షిగా పొందుపరిచిన రాష్ట్ర పునర్విభజన హామీలను అమలు చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై కక్ష్యపురితంగా వ్యవహరించి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంది. కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి నిధులపై, ప్రాజెక్టులపై, పనులపై బి.ఆర్.ఎస్ ఎంపీలం పార్లమెంట్ సాక్షిగా, మంత్రులను వ్యక్తిగతంగా కలిసి విన్నవించినా దున్నపోతుపై వానపడ్డట్లు వ్యవహరించడం అత్యంత శోచనీయం. తెలంగాణ విభజన హామీలను నెరవేర్చకపోతే కచ్చితంగా పార్లమెంట్ సాక్షిగా కేంద్రంపై యుద్ధం చేస్తాం' అని ఎంపీ హెచ్చరించారు.

మాజీ మహబూబాద్ పార్లమెంటు సభ్యులు సీతారాం నాయక్ మాట్లాడుతూ..

'తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం ఎంత పక్షపాతంగా వ్యవహరిస్తోంది అంటే, విభజన హామీ అయినటువంటి గిరిజన విశ్వవిద్యాలయం ప్రకటించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించి కేంద్రానికి అప్పగించినప్పటికి ఇప్పటివరకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం అత్యంత బాధాకరమైన చర్య. తాత్కాలిక భవనంలోనైనా తరగతులు ప్రారంభించమని విన్నవించి భవనాన్ని జాకారంలో ఇచ్చినప్పటికీ ఇంతవరకు ప్రారంభించకపోవడం వారి పక్షపాత వైఖరికి అద్దంపడుతోంది' అని అన్నారు.

ఈ సమావేశంలో కూడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ అజిజ్ ఖాన్, మాజీ కూడా చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బి.అర్.ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకులు పులి రజినీకాంత్, కార్పొరేటర్ వేముల శ్రీనివాస్, 59వ డివిజన్ అధ్యక్షులు నీలం సుహాస్, బి.ఆర్.ఎస్.వి నాయకులు డా. బొల్లికొండ వీరేందర్, డా. పాలమకుల కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News