ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్…
జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి
దిశ, జనగామ : జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య, జనగామ డీసీసీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ బనుక శివరాజ్ యాదవ్, వైస్ చైర్మన్ కొల్లూరి నరసింహులు మార్కెట్ డైరెక్టర్ లను శాలువాలతో, పూలమాలలతో ఘనంగా సన్మానించి వారిని అభినందించారు.
ప్రతిపక్షాలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఫైర్....
బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు అమాయకులైన విద్యార్థులను, నిరుద్యోగులను అడ్డు పెట్టుకుని అనవసరమైన ఆందోళనలు చేస్తూ వారిని పెడదారి పట్టిస్తున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ పైన, సీఎం రేవంత్ రెడ్డి పై బీజేపీ, బీఆర్ఎస్ ముప్పేట దాడి చేయడం సరికాదని అన్నారు. 10 ఏండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఏ ఒక్క గ్రూప్ 1, డిఎస్సి నిర్వహించకుండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. బీఆర్ఎస్ లో హరీష్ రావు, కేటీఆర్ మధ్య పోటీ ఏర్పడిందన్నారు. పేపర్లలో, టీవీ ఛానల్ లో పోటీ పడి మరి పెయిడ్ ఆర్టికల్స్ రాయించుకుంటున్నారని అన్నారు. ఒకరిని చూసి ఒకరు ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం తెలంగాణను దోచుకుందని అన్నారు. 2014లో కేసీఆర్ కుటుంబం ఆస్తులు ఎన్ని.... ఈ రోజు మీ ఆస్తులు ఎన్ని బయట పెట్టాలని అన్నారు. మీరు నిజాయితీపరులు అయితే.... తెలంగాణ ప్రజల మీద మీకు ప్రేమ ఉంటే వెంటనే ఆస్తుల వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.
బీజేపీకి ఏ హక్కుఉందని మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండి పడ్డారు. బండి సంజయ్ ఒక కేంద్ర మంత్రి అనే విషయం మర్చిపోయి రోడ్డు పై కూర్చొని ధర్నా చేయడానికి సిగ్గుండాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నారు. కనీసం 2 లక్షల ఉద్యోగాలు కూడా ప్రకటించలేదన్నారు. బీజేపీ నాయకులు ఒకరు హైడ్రా ను సమర్థిస్తే, మరొకరు విమర్శిస్తున్నారని, ఒకరు మూసీ ప్రక్షాళన చేయాలంటూ మరొకరు వద్దంటూ మాట్లాడడం వారిలో వారికి క్లారిటీ లేదని ఎద్దేవా చేశారు. ఏ ఒక్క ప్రాజెక్టును తెలంగాణకు తీసుకురాలేని నాయకులు ఏ ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారంటూ ఎమ్మెల్యే మండి పడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి సంకల్పానికి తోడుగా నిలబడాలని పిలుపునిచ్చారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.