నాయకుల పర్యవేక్షణ లోపం.. ల్యాండ్ అయిన మంత్రి హెలికాప్టర్
బీఆర్ఎస్ నేతల పర్యవేక్షణ లోపంతో మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తున్న మంత్రి హరీష్ రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గూడూరులో ల్యాండ్ అయింది.
దిశ, గూడూరు : బీఆర్ఎస్ నేతల పర్యవేక్షణ లోపంతో మహబూబాబాద్ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్తున్న మంత్రి హరీష్ రావు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ గూడూరులో ల్యాండ్ అయింది. అక్కడి నుంచి పోలీసులు , సెక్యూరిటీ గార్డ్స్, ఎలాంటి బందోబస్తు లేకుండా ఒక సాధారణ వాహనంలో మంత్రి హరీష్ రావు రోడ్డు మార్గాన మహబూబాబాద్ కు బయలుదేరి వెళ్లారు. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం గూడూరు లో రోడ్ షో నిర్వహించాలని నాయకులు షెడ్యూల్ ఖరారు చేశారు. గత 2 రోజుల కింద హెలిప్యాడ్ స్థలాన్ని కూడా మంత్రి సత్యవతి రాథోడ్ పరిశీలించారు. కానీ వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో గూడూరులో నిర్వహించాల్సిన రోడ్ షోను క్యాన్సల్ చేసి మహబూబాబాద్ కేంద్రానికి మార్చారు. మారిన షెడ్యూల్ సమాచారం వారికి తెలియకపోవడంతో నేరుగా మంత్రి హరీష్ రావు హెలికాప్టర్ మహబూబాబాద్ నియోజకవర్గంలోని గూడూరు మండల కేంద్రంలో ల్యాండ్ అయ్యింది.
మండల నాయకులు అందరూ మహబూబాబాద్ రోడ్ షోకి వెళ్ళారు. తీరా అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అయ్యాక చూస్తే నాయకులు ఎవరూ లేకపోవడంతో మంత్రి హరీష్ రావు అసహనానికి గురై నాయకుల పై మండిపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ నాయక్ కుమారుడు హుటాహుటిన అక్కడికి బయలుదేరి వెళ్ళారు. మంత్రి హరీష్ రావు తో మాట్లాడి అక్కడి నుంచి వాహనంలో మహబూబాబాద్ కు తీసుకువెళ్లారు. మంత్రి హరీష్ రావు వచ్చారని తెలుసుకున్న ప్రజలు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చారు. ఈ సంఘటన చూస్తే నాయకుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. గూడూరులో ల్యాండ్ అయిన హెలికాప్టర్ తిరిగి మళ్ళీ మహబూబాబాద్ కు చేరుకుంది. దీంతో నాయకులు కాసంత సేపు తర్జనభర్జన పడ్డారు. గూడూరులో ఈరోజు జరగాల్సిన మంత్రి రోడ్ షో రద్దయి నప్పటికీ అనుకోకుండా హెలికాప్టర్ గూడూరులో ల్యాండ్ కావడంతో పోలీసులు సహా మండల ప్రజలందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.