కాంగ్రెస్ బూతులు కావాలా.. బీఆర్ఎస్ భవిష్యత్తు కావాలా

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర నుంచి విడిపోయి ఏర్పడకపోతే మహబూబాబాద్ ఇంత అభివృద్ధి చెందేదా అని ప్రజలను ఉద్దేశించి మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడారు.

Update: 2023-11-25 10:13 GMT

దిశ, మహబూబాబాద్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆంధ్ర నుంచి విడిపోయి ఏర్పడకపోతే మహబూబాబాద్ ఇంత అభివృద్ధి చెందేదా అని ప్రజలను ఉద్దేశించి మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడారు. శనివారం హైదరాబాదు నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో మహబూబాబాద్ కు చేరుకున్న మంత్రి హరీష్ రావు మంత్రి సత్యవతి రాథోడ్, ఎంపీ మాలోత్ కవిత, బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డిలతో కలిసి స్థానిక ఆర్టీసీ బస్ స్టేషన్ నుండి తహశీల్దార్ కార్యాలయం వరకు రోడ్ షో నిర్వహించారు. మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ శంకర్ నాయక్ గెలుపును కోరుతూ ప్రజలను ఓటు అభ్యర్థించారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ అభివృద్ధి కావాలంటే కారుకు.. మోసం కావాలంటే కాంగ్రెస్ కు ఓటేయాలని ప్రజలకు సూచించారు. ఉద్యమంతో ఆంధ్ర పాలకుల నుంచి కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ వాళ్లు మాట్లాడే బూతులు కావాలా బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేసీఆర్ అభివృద్ధి కావాలి ప్రజలు తేల్చుకోవాలన్నారు.

తన నియోజకవర్గ సిద్దిపేట కంటే మహబూబాబాద్ ఎంతో ప్రగతి సాధించిందని అందుకు స్థానిక ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్ కృషి ఉందని కొనియాడారు. రైతులకు లబ్ధి చేకూరకుండా రైతుబంధును విడుదల చేయవద్దని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషన్ వద్ద మొరపెట్టుకున్న ఫలితం లేదని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే రైతుబంధు పథకం డబ్బులు ఈ నెల 28 వరకు వారి ఖాతాలో వేయవచ్చని ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు హరీష్ రావు తెలిపారు. సోమవారం పొద్దున్నే ప్రతి రైతు బ్యాంకు ఖాతాలో రైతుబంధు చేరుతుందని వివరించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి మళ్ళి నేడు కనిపించిందని, మహబూబాబాద్ ప్రజలు తలుచుకుంటే నాయకుల తలరాతలే మారతాయని తెలిపారు. మహబూబాబాద్ ఇంత అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే శంకర్ నాయక్ మనిషి కొంచెం కరుకు అయినప్పటికీ ఆయన మనసు చాలా మంచిదని, మళ్లీ గెలిపిస్తే కేసీఆర్ వద్ద పట్టుపట్టి నిధులను తీసుకొచ్చి, మానుకోటను బంగారు కోట చేస్తాడని వెల్లడించారు. సీఎంగా కేసీఆర్ ఉంటే ఇక్కడ వేరే పార్టీ ఎమ్మెల్యే ఉంటే మహబూబాబాద్ అంతగా అభివృద్ధి చెందదని, శంకర్ నాయక్ ని గెలిపించుకుంటే మానుకోటను శరవేగంగా అభివృద్ధి చేసుకోవచ్చని వివరించారు.

Tags:    

Similar News