'నాకు దొంగ ఏడుపులు రావు'
నాకు దొంగ ఏడుపులు రావు.. అబద్ధపు వాగ్దానాలు చేతకావని, ఏ నాడు, ఏ ఎలక్షన్లలోనూ ఒక్కరి దగ్దరి నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి అన్నారు.
దిశ, భూపాలపల్లి : నాకు దొంగ ఏడుపులు రావు.. అబద్ధపు వాగ్దానాలు చేతకావని, ఏ నాడు, ఏ ఎలక్షన్లలోనూ ఒక్కరి దగ్దరి నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర రమణారెడ్డి అన్నారు. 2018 ఎన్నికల్లో భూపాలపల్లి ప్రజలు నా మీద నమ్మకం ఉంచి ఓటు వేశారని, వారి నమ్మకాన్ని అభివృద్ధితో నిలబెట్టుకున్నానని అన్నారు. భూపాలపల్లి పట్టణవాసులకు కావాల్సిన ప్రతి సౌకర్యాన్ని కల్పించామన్నారు. శనివారం భూపాలపల్లి పట్టణంలోని 4, 5, 6, 7, 23, 24, 25, 26వ వార్డుల బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యఅతిథులుగా భూపాలపల్లి నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జి మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణా రెడ్డి మాట్లాడారు. నాడు ఎన్నికల హామీల్లో ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్, సింగరేణి కార్మికులకు 1000 క్వార్టర్స్ రెండు పడకల ఇండ్ల నిర్మాణాలను ప్రతివార్డులో అంతర్గత రోడ్ల నిర్మాణాలను భూపాలపల్లి పట్టణానికి నాలుగు దిక్కులుగా ఉన్న శివార్లకి స్మశాన వాటికలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
అలాగే పట్టణంలో సెంట్రల్ లైటింగ్ సిస్టంను ఏర్పాటు చేశామని అన్నారు. భూపాలపల్లి పట్టణానికి బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడే స్థిరపడిన యాదవ కాలనీ కృష్ణ కాలనీ, సుభాష్ కాలనీ వాసులకు ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి సంస్థలో ఉన్న భూమిని ప్రభుత్వానికి అందజేసి ప్రత్యేక జీవం ద్వారా ఆయా కాలనీవాసులకు శాశ్వత ఇల్లా రిజిస్ట్రేషన్ పట్టాలను అందించి ఈరోజు మీ ముందుకు వచ్చానని తెలిపారు. మంత్రి కేటీఆర్ చొరవతో పట్టణంలో వందల కోట్ల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. రానున్న ఎన్నికల సమయంలో మరోసారి అవకాశం కల్పిస్తే ఈ ప్రభుత్వాన్ని ఒప్పించి, మెప్పించి జిల్లాకు మైనింగ్ ఇంజనీరింగ్ కళాశాల తీసుకొస్తానని హామీ ఇచ్చారు. భూపాలపల్లి పట్టణానికి సమగ్ర ప్లానింగ్ ఏర్పాటు చేసి ప్రజలకు అన్ని విధాల సౌకర్యాలకు మెరుగుపడేలా చూస్తానని తెలిపారు. నాకు పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఏ విధమైన కోపతాపాలు ఉండవు, ప్రజలకు కావాల్సిన పనులను చేస్తా అంతే కాని అబద్ధపు మాటలు చెప్పడం రాదు. నేను కన్నీళ్లు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టించను. అభివృద్ధి చేసిన, అవకాశం కల్పిస్తే మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.