సీజనల్ వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ దివాకర

వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు అధికారులు ప్రత్యేక

Update: 2024-07-06 13:56 GMT

దిశ,ములుగు ప్రతినిధి : వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరం లో సీజనల్ వ్యాధుల నియంత్రణపై జిల్లా స్థాయి కో ఆర్డినేషన్ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లాలో చాలా మంది చెరువులు వాగులు చలిమల ద్వారా వచ్చే సహజసిద్ధమైన త్రాగు నీటిని ఉపయోగిస్తున్నారని కానీ అలా చేయడం సురక్షితం కాదని ఈ నేపథ్యంలోనే స్థానికంగా ఉండే ఆశా కార్యకర్తలకు, అంగన్వాడీ టీచర్ లకు, మహిళ సంఘాల సభ్యులు లకు సీజనల్ వ్యాధుల పట్ల ప్రత్యేక అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహించాలని దీని ద్వారా స్థానికంగా గ్రామ ప్రజలకు వారు అవగాహన కల్పిస్తారని కలుషిత నీరు త్రాగడం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని తెలిపారు.ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, ఎక్కడపడితే అక్కడ నీటిని తాగవద్దని సూచించారు. పాఠశాలల్లో బ్లీచింగ్ పౌడర్ ను అందుబాటులో ఉంచాలని, విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. డెంగీ, మలేరియా, విష జ్వరాలు ప్రబలకుండా పకడ్బందీగా వ్యవహరించాలని సూచించారు.

అటవీ ప్రాంతంలో ఉండే గుత్తి కోయ గ్రామాల్లో మలేరియా డెంగ్యూ వ్యాధులను నియంత్రించడానికి ప్రత్యేక అధికారులు స్థానిక అధికారులు నిరంతరం గ్రామాలను పర్యవేక్షిస్తూ పరిశీలిస్తూ అప్రమత్తం చేయాలని సూచించారు. గ్రామాల్లో శానిటేషన్ ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పేర్కొన్నారు. దోమల వ్యాప్తిని నివారించాలని, మురికిగుంటల్లో ఆయిల్స్ బాల్స్ వేయాలని సూచించారు. ప్రజలు ఇండ్ల వద్ద పరిశుభ్రత పాటించాలని, బయట ఆహారం తీసుకోవద్దని తెలిపారు. వర్షాకాలంలో తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి మంగళవారం, శుక్రవారం గ్రామాల్లో డ్రై డే నిర్వహించాలన్నారు. గ్రామాల్లో మంచి నీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలని ఆదేశించారు.

వర్షాకాలం నేపథ్యంలో వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రత్యేకంగా గుత్తి కోయ ప్రాంతంలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం కోసం స్థానిక ప్రజలను అప్రమత్తం చేయడం కోసం హెల్త్ వాలింటర్ ను ఏర్పాటు చేయాలని సూచించారు.ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా సురక్షితమైన మంచి నీటిని అందించడం జరుగుతుందని, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకులను నిరంతరం శుభ్రం చేయాలని సూచించారు.గ్రామాలలో 10 సంవత్సరాలకు ఆరోగ్య స్థితిగతులు ఇప్పటి స్థితి గతులు చాలా మార్పు వచ్చిందని కావున జబ్బు బారిన పడే వారి సంఖ్య చాలా తగ్గిందని తెలియజేశారు. ఈ సమావేశంలో ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ జగదీశ్వర్, డి ఆర్ డి ఓ శ్రీనివాస్ కుమార్, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ మోహన్ లాల్, ప్రోగ్రాం అధికారి రవీందర్, ఏటూర్ నాగారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్డెంట్ సురేష్, పంచాయతీ సెక్రటరీ లు ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు.


Similar News